Tuesday, May 14, 2024

వికలాంగులకు ఉచిత విద్యుత్, ప్రయాణ సౌకర్యం కల్పించాలి

- Advertisement -
- Advertisement -

తీవ్ర వైకల్యానికి రూ. 25 వేల ప్రత్యేక అలవేన్స్ చెల్లించాలి
అక్టోబర్ 9న మహాధర్న : ఎన్‌పిఆర్‌డి

మన తెలంగాణ / హైదరాబాద్ : వికలాంగులకు ఉచిత విద్యుత్, ప్రయాణ సౌకర్యం కల్పించాలని, తీవ్ర వైకల్యానికి రూ. 25 వేలు ప్రత్యేక అలవెన్స్ చెల్లించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వికలాంగుల పెన్షన్ రూ. 10వేలకు పెంచాలని కోరింది. వికలాంగుల డిమాండ్ల సాధన కోసం అక్టోబర్ 9న ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నను జయప్రదం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె. వెంకట్, ఎం. అడివయ్య పిలుపునిచ్చారు. సోమవారం చిక్కడపల్లి రాష్ట్ర కార్యాలయంలో మహాధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగులు ఎదుర్కొంటున్న 39 సమస్యలపై వికలాంగుల డిక్లరేషన్ ప్రకటించామని, డిక్లరేషన్ అంశాలను రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని డిమాండ్ చేశారు. మహాధర్నాకు అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఉద్యోగ నియామకాల్లో వికలాంగుల రోస్టర్ ను పది లోపు తగ్గించేందుకు స్టేట్ సబర్దినెట్ సర్వీస్ రూల్స్ ని సవరించాలని డిమాండ్ చేశారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఐదు శాతం వికలాంగులకు కేటాయించాలన్నారు. జిఓ నెంబర్ 1 ఎందుకు అమలు చేయడం లేదని సందర్భంగా వారు ప్రశ్నించారు.

ప్రభుత్వ అసమర్థత మూలంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపుల్లో వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. గృహలక్ష్మి పథకంలో పెళ్లి కాని వికలాంగులకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని కోరారు. నామినేటెడ్ పదవులలో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని కోరారు. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ధర్నాకు వికలాంగులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్కోని రాజు , బి స్వామి, కె. కాశప్ప ,రాష్ట్ర సహాయ కార్యదర్శి పి బాలేశ్వర్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ. సురుపంగ ప్రకాష్, రంగారెడ్డి, ఎ. భుజంగ రెడ్డి, ఎ. లింగన్న, వీరబోయిన వెంకన్న, ప్రభు స్వామి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News