Tuesday, April 30, 2024

జ్వరేవ్, రూడ్ ముందంజ

- Advertisement -
- Advertisement -

French Open Grand Slam tennis tournament: Zverev Rude lead

మూడో రౌండ్‌లో వొండ్రూసొవా, కొలిన్స్, బెలిండా, అగట్ ఇంటికి, జకోవిచ్ శుభారంభం, ఫ్రెంచ్ ఓపెన్

పారిస్: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ), 15వ సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) మూడో రౌండ్‌కు చేరుకున్నారు. మహిళల విభాగంలో డానియల్ రోజ్ కొలిన్స్ (అమెరికా), మార్కెటా వొండ్రూసొవా (చెక్) రెండో రౌండ్‌లో విజయం సాధించారు. అయితే మహిళల సింగిల్స్‌లో పదో సీడ్ బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్), కారోలిన్ గార్సియా (ఫ్రాన్స్) రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్‌లో 11వ సీడ్ రొబెర్టె బౌటిస్టా అగట్ (స్పెయిన్) ఓటమి పాలయ్యాడు. మరోవైపు అగ్రశ్రేణి ఆటగాడు, టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా), పదో సీడ్ డిగో షావార్ట్‌మాన్ (అర్జెంటీనా)లు కూడా తొలి రౌండ్‌లో విజయం సాధించారు.

జ్వరేవ్ దూకుడు..

మరోవైపు బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో జ్వరేవ్ విజయం సాధించాడు. రష్యా ఆటగాడు రొమాన్ సఫియులిన్‌తో జరిగిన మ్యాచ్‌లో జ్వరేవ్ 76, 63, 76తో జయకేతనం ఎగుర వేశాడు. తొలి సెట్‌లో జ్వరేవ్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. దీంతో టైబ్రేకర్ తప్పలేదు. ఇందులో జ్వరేవ్ విజయం అందుకున్నాడు. రెండో సెట్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన జర్మనీ స్టార్‌కు మూడో సెట్‌లో మళ్లీ తీవ్ర ప్రతిఘటన తప్పలేదు. ఈసారి కూడా సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఇందులో చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన జ్వరేవ్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు నార్వే ఆటగాడు రూడ్ కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్‌లో రూడ్ 63, 62, 64తో పోలండ్ ఆటగాడు కామిల్‌ను చిత్తు చేశాడు.

ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన రూడ్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వరుసగా మూడు సెట్లను గెలిచి ముందంజ వేశాడు. అయితే 11వ సీడ్ అగట్‌కు రెండో రౌండ్‌లోనే చుక్కెదురైంది. స్విట్లర్లాండ్ ఆటగాడు లాక్సొనెన్‌తో జరిగిన పోరులో అగట్ ఓటమి పాలయ్యాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన లాక్సొనెన్ 62, 26, 63, 62తో విజయం సాధించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో సెర్బియా ఆటగాడు లాస్లొ డెరె విజయం సాధించాడు. రెండో రౌండ్‌లో తన దేశానికే చెందిన మియోమిర్‌పై ఐదు సెట్ల పోరాటంలో జయకేతనం ఎగుర వేశాడు. తొలి రెండు సెట్లలో ఓటమి పాలైన లాస్లొ అసాధారణ పోరాట పటిమతో చివరి మూడు సెట్లు గెలిచి ముందంజ వేశాడు. ఇక సెర్బియాకే చెందిన టాప్ సీడ్ జకోవిచ్ తొలి రౌండ్‌లో విజయం సాధించాడు. అమెరికా ఆటగాడు సాండ్‌గ్రేన్‌తో జరిగిన పోరులో జకోవిచ్ 62, 64, 62తో జయభేరి మోగించాడు.

కొలిన్స్ గెలుపు

మహిళల సింగిల్స్‌లో అమెరికా క్రీడాకారిణి కొలిన్స్ మూడో రౌండ్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో కొలిన్స్ 60, 62తో ఉక్రెయిన్‌కు చెందిన కలినినాను చిత్తు చేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన కొలిన్స్ అలవోక విజయంతో ముందంజ వేసింది. మరో మ్యాచ్‌లో 20వ సీడ్ వొండ్రూసొవా జయకేతనం ఎగుర వేసింది. ఫ్రాన్స్ క్రీడాకారిణ టాన్‌తో జరిగిన రెండో రౌండ్‌లో 61, 63తో విజయం సాధించింది. అయితే పదో సీడ్ బెలిండా బెన్సిక్‌కు రెండో రౌండ్‌లోనే షాక్ తగిలింది. రష్యా క్రీడాకారిణి కసాట్కినాతో జరిగిన పోరులో బెన్సిక్ 26, 26తో ఓటమి పాలైంది. ఇతర పోటీల్లో హార్కాగ్ (స్లొవేనియా), జిడాన్‌సెక్ (స్లొవేనియా) తదితరులు రెండో రౌండ్‌లో విజయం సాధించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News