Home జిల్లాలు సందడి షురూ!

సందడి షురూ!

నగరంలో గణపతి బప్పా సందడి

ganeshసిటీబ్యూరో : నగరంలో గణపతి బప్పా సందడి మొదలైంది. నగర ప్రజల పూజలు అందుకోవడానికి గణనాథుడు మండపాలకు తరలి వెళ్తున్నారు. ఈ నెల 17న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయక ప్రతిమను మూడు రోజుల ముందు నుంచే మండపాలకు తరలిస్తున్నారు. దీంతో నగర రోడ్లపై ఎక్కడ చూసినా జై భోలో గణేశ్ మహరాజ్‌కీ జై అనే నినాదాలే వినబడుతున్నాయి. వివిధ రూపాలలోని వినాయక విగ్రహాలు రోడ్లపై ప్రజలకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ప్రజలు బారులుతీరి విగ్రహాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ధూల్‌పేట్ నుంచి భారీ వినాయక విగ్రహాలను పలు ఉత్సవ కమిటీలు సోమవారం మండపాలకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా రోడ్లపై ఉన్న విద్యుత్, కేబుల్, ఇంటర్‌నెట్ తీగలతో పాటు చెట్ల కొమ్మలు అడ్డంగా రావడంతో విగ్రహాలను జాగ్రత్తగా తరలించారు. దీంతో అక్కడక్కడ కొంత ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు. అయితే వివిధ రూపాల్లో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ గణనాథుని విగ్రహాలను చూస్తూ ప్రజలు తమ కష్టాలను మరిచి పోతున్నారు.