Saturday, April 27, 2024

భారీగా పెంచి కొద్దిగా తగ్గించారు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనుండటం, మరి కొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో ఎవరూ అడగకుండానే కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమై.. సిలిండర్ రూ. 200 ధర తగ్గించింది. ఉజ్వల యోజన లబ్ధిదారులకు రూ.400 తగ్గించింది. 33 కోట్ల మందికి లబ్ధి చేకూర్చే ఈ నిర్ణయం ‘ఇండియా’ కూటమికి భయపడే.. ఎన్‌డిఎ ప్రభుత్వం తీసుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటి వరకు రెండు సార్లు సమావేశమైనందుకే.. రూ. 200 తగ్గిస్తే, ఇండియా కూటమి రంగంలోకి దిగితే.. పరిస్థితి మరోలా ఉంటుందని ఎద్దేవా చేస్తున్నాయి. ఆడపడుచులకు రాఖీ పండుగ, ఓనం వేడుకల కానుకగా.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర తగ్గించిందని కేంద్ర మంత్రులు తమను తాము సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఎప్పుడూ ఉచితాలను అనుచితమని వ్యాఖ్యానించే బిజెపి ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు ఎలాంటి ప్రయోజనం లేకుండా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటారనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.

2014లో దేశ అధికార పగ్గాలు చేతబట్టిన మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం.. దేశ రూపురేఖల్ని మారుస్తామని చెబుతూ అనేక హామీలు ఇచ్చింది. అచ్ఛేదిన్ ఆయేగా, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి గ్రామానికి తాగు నీళ్లు, విద్యుత్, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ లిటరసీ, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణం కట్టడి వంటి అనేక హామీలతో ఊదరగొట్టింది. అచ్ఛేదిన్ రాలేదు సరికదా.. దేశంలో సామాన్యుడు జీవించలేని స్థితిని మోడీ ప్రభుత్వం కల్పించింది. వంట గ్యాస్ ధర రూ. 1200లకు చేరుకుంది. 2014లో వంట గ్యాస్ సిలిండర్ ధర దాదాపు రూ. 400 ఉన్నది. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా పెరిగిపోయింది. మోడీ హయాంలో 13 సార్లు గ్యాస్ ధర పెరిగింది. 2014లో రూ. 410గా ఉన్న 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర 2023, మార్చి నాటికి ఏకంగా రూ. 1,155 కి చేరింది. గత తొమ్మిదేండ్లలో దాదాపు రూ. 900 మేర ధర పెరిగింది. రెక్కాడితేగాని డొక్క నిండని పేదలు కట్టెల పొయ్యి వైపు చూసే దుస్థితి నెలకొన్నది.

గ్రామాల్లో ఇప్పటికే కట్టెల పొయ్యిల వాడకం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి గతంలో లీటర్ కిరోసిన్ రాయితీపై అందించేది. ఇప్పుడు అది కూడా లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు పొయ్యి అంటించడానికి బంకుల నుంచి డీజిల్ బాటిళ్లలో తెచ్చుకొని వాడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో చిన్న పిల్లలు తిన పడేసిన కుర్కురే కవర్లతో పొయ్యి వెలిగిస్తున్నారు. ఇలా డీజిల్, కవర్లను కాల్చడం వల్ల వెలువడే విష వాయువులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అయినా గత్యంతరం లేని పరిస్థితుల్లో గ్యాస్ ఎక్కువ వాడలేక కట్టెల పొయ్యితో కాలం వెళ్లదీస్తున్నారు. గ్యాస్ సహా పెట్రోల్, డీజిల్ ధరలు అసాధారణంగా పెరిగాయి. 2014 నుంచి డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం 344 %, పెట్రోల్‌పై 110% పెంచిన కేంద్రం.. తగ్గించాలని మొన్నటిదాకా రాష్ట్రాలను కోరింది. ఇంధన ధరల పెంపు ప్రభావం ప్రతి చిన్న వస్తువుపై పడి వాటి ధరలూ బాగా పెరిగి పేదోడు అందుకోలేనంత పైకి ఎగబాకాయి.

సాధారణ సమయాల్లో పేదల ధరల భారం గురించి కనీసం ఆలోచించని బిజెపి ప్రభుత్వం.. ఎన్నికల ముందు తగ్గించి, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బాదుడు మళ్లీ మొదలు పెడుతున్న తీరు గత 9 ఏండ్లుగా చూస్తూనే ఉన్నాం. గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో యుపితో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు జరిగాయి. దీనికి సరిగ్గా 5 నెలల ముందు నుంచి పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ధరల పెంపును కేంద్రం ఆపేసింది. ఎన్నికలు ముగిశాయో లేదా వాయింపు మొదలుపెట్టింది. 16 రోజుల వ్యవధిలో 14 సార్లు పెంపుతో ఏకంగా రూ. 12 పెంచింది.
ఒక వస్తువు ఉత్పత్తికి సంబంధించిన ముడిసరుకు ధరలు తగ్గితే.. అందుకు అనుగుణంగా రిటైల్ మార్కెట్‌లో ఆ వస్తువు ధర తగ్గాలి. ఆ ప్రయోజనం అంతిమంగా వినియోగదారులైన ప్రజలకు చేరాలి. అయితే ఇంధన ధరల విషయంలో అలా జరగడం లేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా.. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రయోజనాన్ని ప్రజలకు చేర్చడం లేదు. రెండు నెలల క్రితం అమెరికాలో బ్యాంకింగ్ రంగ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. బ్యారెల్ ముడిచమురు ధర దాదాపు 65 డాలర్లకు పడిపోయింది.

గత ఏడాది జూన్‌లో బ్యారెల్ క్రూడాయిల్ ధర దాదాపు 120 డాలర్లుగా ఉన్నది. అప్పటి నుంచి తగ్గుతూ వచ్చింది. అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా.. అందుకు అనుగుణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్రం ఎన్నడూ ముందుకు రాలేదు. క్రూడాయిల్ ధరలు తగ్గిన మేరకు ఇంధన ధరలను తగ్గించకుండా కేంద్ర ప్రభుత్వం లాభాలను తన జేబులో వేసుకున్నది. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని గ్యాస్ ధరను రూ. 200 తగ్గించి.. దేశ ప్రజలకు మేలు చేసినట్లు చెబుతున్నది. అంతర్జాతీయంగా తగ్గిన ముడి చమురు ధరలకు అనుగుణంగా ఇంధన ధరలు సవరిస్తే దాదాపు -15/ రూపాయల వరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉండేది. ఎన్నికలు ఉంటే.. అప్పటికి కొద్ది నెలల ముందు నుంచి ధరల్లో మార్పు చేయదు. అదే ఎన్నికల ఫలితాలు వచ్చీ రాగానే ఇంధన ధరల బాదుడు ఎప్పటిలాగే మోగుతుంది. పైగా తాము పెంచింది తక్కువేనంటూ విచిత్రమైన సమర్థన చేసుకుంటుంది.

2014 మే నెలలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 107 డాలర్లు ఉంటే లీటర్ పెట్రోల్ ధర రూ.71 ఉంది. 2023 మొన్న మార్చి నెలలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 65 డాలర్లకు తగ్గింది. కానీ లీటర్ పెట్రోల్ ధర మాత్రం రూ. 110గానే ఉన్నది. క్రూడాయిల్ ధర పెరిగినప్పుడు ఇంధన ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం, ధరలు తగ్గినప్పుడు ఆ మేరకు ఇంధన ధరలు తగ్గించాలి కదా? అనే ప్రశ్నకు సమాధానమే లేదు. రష్యా నుంచి చౌకగా ముడి చమురు లభిస్తున్నప్పటికీ, అధిక పన్నులు, శుద్ధి ఖర్చులు, మారకపు రేటు, పంపిణీ, రవాణా ఖర్చులు, ప్రభుత్వ రాయితీలతో దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. అసోం, గుజరాత్ రాష్ట్రాలతో పాటు బంగాళాఖాతంలో చమురు క్షేత్రాలు ఉన్నాయి. అంతర్జాతీయ చమురుపై మనం ఆధారపడటాన్ని కేంద్రం ప్రభుత్వం తగ్గించడానికి అవకాశం ఉంది. కానీ ఆ దిశగా ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు. గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కొన్ని రాయితీలు ఇచ్చినా,ఈ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు తాలుకు మౌలిక వసతుల కల్పన అంత వేగంగా జరగడం లేదు.

ఫలితంగా ఇవాళ ప్రతి కుటుంబం ఇంధనం వాడుతూ.. ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తున్నది. దేశాన్ని బలోపేతం చేస్తానని అధికారాన్ని చేపట్టిన బిజెపి.. తన అనునయ వ్యాపారవేత్తలను మాత్రమే బలోపేతం చేసి సామాన్యులను నిరుపేదలుగా మార్చేస్తున్నది. బిజెపి ప్రభుత్వం చెప్పినట్టుగా రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. కరోనా మహమ్మారిలో వేలాది మంది ప్రాణాలు విడిచారు. కానీ బ్యాంకులను మోసం చేసి, ఈ దేశాన్ని లూటీ చేసిన వారు క్షేమంగా ఉన్నారు. కరోనాతో వందల కుటుంబాలు కడు పేదరికంలోకి నెట్టబడగా, కార్పొరేట్ల ఆదాయాలు పదింతలు పెరిగాయి ఈ దేశంలో. మహమ్మారి దేశాన్ని కుదిపేస్తున్న సమయంలోనూ రూ. 30 లక్షల కోట్లు సంపాదించి ఏకంగా 142 మంది ధనవంతులయ్యారు. సాధారణ సమయంలో అన్నింటి ధరలు పెంచేసి.. ఎన్నికల సమయంలో తగ్గించి.. లక్షలాది మంది పేదలకు మేలు చేశామని చెప్పుకోవడం ఏ కోశానా సమర్థత అనిపించుకోదు!——————–

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News