Saturday, April 27, 2024

అత్యాచారం జరగలేదు

- Advertisement -
- Advertisement -

ghatkesar pharmacy student case update

మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా, కీసర ః రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన బీ ఫార్మసీ విద్యార్ధినిపై అత్యాచార సంఘటన కట్టుకథగా స్పష్టమైంది. విద్యార్ధినిపై అఘాయిత్యం జరిగలేదని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో తప్పుడు కేసుగా నిర్ధారించామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. ఇంట్లోంచి బయటకు వెళ్లే ఉద్దేశంతో అందర్నీ తప్పుదోవ పట్టించిందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ శనివారం మీడియాకు వెల్లడించారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్‌ఎల్ నగర్ ఓయు కాలనీకి చెందిన విద్యార్ధిని (19) మేడ్చల్ కండ్లకోయలోని సీఎంఆర్ కాళాశాలలో బీ ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతుంది. ఈ నెల 10వ తేదీన సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి తిరిగి వస్తూ తనను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకెళ్తున్నట్లు తన తల్లికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఆందోళన చెందిన యువతి తల్లి 100కి డయల్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కీసర, ఘట్‌కేసర్ పోలీసులు యువతి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.

రాత్రి 7.50 గంటలకు యువతి ఫోన్ నంబరును ట్రాక్ చేసిన పోలీసులు అన్నోజిగూడ ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద ఉన్నట్లు గుర్తించారు. దాంతో పోలీసులు అక్కడికి చేరుకొని గాయలతో అపస్మారక స్థితిలో పడిఉన్న బాధితురాలిని గుర్తించి చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరించారు. పోలీసుల విచారణలో యువతి తనను బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది. గతంలో చిల్లర విషయంలో ఓ ఆటో డ్రైవర్‌తో గొడవ జరగడంతో ఆ వ్యక్తిని నిందితుడిగా చూపింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనుమానంతో ఈ సీఐఎల్, రాంపల్లి, ఘట్‌కేసర్ వైపు ఆటోలు నడిపే పలువురు ఆటో డ్రైవర్లను గురువారం అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. పోలీసుల విచారణలో ఆటో డ్రైవర్లకు సంఘటనతో ఎలాంటి సంబంధం లేదని తేలింది. బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. క్షేత్రస్థాయి వాస్తవాలకు బాధితురాలు చెప్పిన వివరాలకు పొంతన కుదరకపోవడంతో అనుమానంతో మరోసారి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ పుటేజీలను సేకరించి విశ్లేషించారు. 10వ తేదీన యువతి సాయంత్రం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు ఘట్‌కేసర్, యనంపేట్, అన్నోజీగూడ తదితర ప్రాంతాల్లో ఒంటరిగా సంచరించినట్లు గుర్తించారు. ఆ సమయంలో పోలీసుల అదుపులో ఉన్న ఆటో డ్రైవర్ల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆ ప్రాంతంలో లేవని తేల్చారు.
ఇంటి నుంచి వెళ్లిపోయేందుకే కిడ్నాప్, అత్యాచార నాటకం
ఇంటి నుంచి వెళ్లిపోయేందుకే యువతి కిడ్నాప్ నాటకం ఆడి, తనపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పిందని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు యువతిని గుచ్చిగుచ్చి అడగడంతో తన ప్లాన్ మొత్తాన్ని బయటపెట్టింది. కుటుంబ సభ్యులతో గొడవల కారణంగానే యువతి ఈ ప్రణాళిక రచించి అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు. చీకటి పడినా ఇంటికి ఎందుకు రాలేదని తల్లి పదేపదే ఫోన్ చేస్తుండటంతో ఆటో డ్రైవర్ ఎక్కడికో తీసుకెళ్లాడని చెప్పినట్లు యువతి అంగీకరించింది. యువతి కోసం పోలీసులు గాలింపు చేపట్టగా పోలీసు వాహనాల సైరన్ వినిపించడంతో పరుగెత్తుకుంటూ పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లి పడిపోయిందని అన్నారు. ఆ సమయంలోనే ఆమే కాలికి గాయమైందని తెలిపారు. తనపై అత్యాచారం జరిగినట్లు పోలీసులను నమ్మించేందుకు తన దుస్తులను తానే చింపుకుందని అన్నారు. గతంలో ఓ ఆటో డ్రైవర్‌పై ఉన్న కోపాన్ని ఇప్పుడు ఉపయోగించుకుందని చెప్పారు. యువతి కిడ్నాప్‌లు అంటే ఒక రకమైన ఇష్టమని, 6 నెలల క్రితం తన స్నేహితురాలికి మరో కిడ్నాప్ కథ చెప్పిందని పోలీసుల విచారణలో తెలిసింది. ఈ కేసులో కిడ్నాప్, అత్యాచారం జరగలేదని సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. విచారణలో భాగంగానే ఆటో డ్రైవర్లను విచారించామని, వారికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆటో డ్రైవర్లు కేసు దర్యాప్తులో పూర్తిగా సహకరించారని అన్నారు. వారికి క్షమాపణలు చెబుతున్నామని సీపీ అన్నారు. కేసు ధర్యాప్తులో శ్రమించిన పోలీసు అధికారులను సీపీ మహేష్ భగవత్ అభినందించారు.

ghatkesar pharmacy student case update

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News