Thursday, May 2, 2024

పది పరీక్షలకు అనుమతి ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

Give permission for tenth class exams

 

‘పది’ పరీక్షలకు అనుమతివ్వండి
హైకోర్టుకు ప్రభుత్వం వినతి
19న విచారణ జరపుతామన్న ధర్మాసనం

మనతెలంగాణ/హైదరాబాద్ : పదో తరగతి పరీక్షల నిర్వహణ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ చేపట్టాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు కోరింది.

ఈక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ పదవ తరగతి పరీక్షల అంశాన్ని హైకోర్టుకు విన్నవించారు. అయితే పదవ తరగతి పరీక్షల అంశంపై ఈ నెల 19న విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది. ఈక్రమంలో పది పరీక్షల విషయంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని ఎజి కోరారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణలో భాగంగా లాక్ డౌన్‌లో పాటించాల్సిన భౌతిక దూరం, శానిటైజర్ల వినియోగం వంటి అన్ని జాగ్రత్తలను చేపడతామని తెలిపారు. పరీక్ష గదిలో పది మంది విద్యార్థులే ఉండేలా ఏర్పాట్లు చేశామని, వాయిదా పడిన టెన్త్ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విద్యాశాఖ గురువారం హైకోర్టులో అఫిడవిట్ దాఖలుచేసిన విషయం విదితమే.

భౌతికదూరం, పరిశుభ్రతకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనుమతించాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఆ అఫిడవిట్‌లో కోరారు. హైకోర్టు ఆదేశాల మేరకు మార్చి 23 నుంచి 30 వరకు నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదావేశామని వివరించారు. ఈ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ అంశంపై ఆదేశాలివ్వాలంటూ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ శుక్రవారం హైకోర్టు ఎదుట ప్రస్తావించారు.

ఇదిలావుండగా రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపు వల్ల పెండింగ్‌లో ఉండిపోయిన పదో తరగతి పరీక్షలను అనతికాలంలో నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. హైకోర్టు నుంచి అనుమతి రాగానే మే ఆఖరు, జూన్ మొదటి వారం నుంచి పది పరీక్షలు నిర్వహిస్తామని సిఎం పేర్కొన్న విషయం విదితమే. కాగా కోర్టు ఉత్తర్వులు రాగానే పరీక్షల ప్రక్రియను వేగవంతం చేసి పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News