Sunday, May 5, 2024

గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ఫిబ్రవరి మాసానికి రూ. 227.50 కోట్ల గ్రాంటుగా విడుదల
వెల్లడించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Government Mission for Comprehensive Development of Villages

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి, వివిధ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఇందులో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం అమలకు ఫిబ్రవరి నెలకు గ్రాంట్‌గా ప్రభుత్వం రూ. 227 కోట్ల 50 లక్షల రూపాయలను గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేసిందని వెల్లడించారు.
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రతి నెల ఈ మొత్తాన్ని గ్రాంటుగా ప్రభుత్వం విడుదల చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల్లో రూ.210 కోట్ల 44 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీలకు, 11 కోట్ల 37 లక్షల రూపాయలు మండల పరిత్తులకు, 5 కోట్ల 69 లక్షల రూపాయలు జిల్లా పరిషత్తులకు ప్రతి నెల గ్రాంటుగా విడుదల చేస్తున్నామన్నారు. పల్లె ప్రగతి క్రింద 2019 సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు ( ఫిబ్రవరి..2022) 8 వేల 569 కోట్ల 50 లక్షల రూపాయలు గ్రాంటు గా గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేశామన్నారు. అందులో భాగంగానే 2019…2020 ఆర్థిక సంవత్సరంలో 2 వేల 373 కోట్ల రూపాయలు, 2020..2021 ఆర్థిక సంవత్సరంలో 3 వేల 694 కోట్ల రూపాయలు, 2021..2022 సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 2 వేల 502 కోట్ల 50 లక్షల రూపాయలు గ్రాంటుగా విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నుండి 2021…2022 సంవత్సరానికి మొదటి విడతగా 682 కోట్ల 50 లక్షల రూపాయల నిధుల విడుదలయ్యాయని ఆయన తెలిపారు. కేంద్రం నుండి ఈ ఆర్థిక సంవత్సరంలో రెండవ విడత నిధులు విడుదల కానప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు ప్రతి నెల 227 కోట్ల 50 లక్షల రూపాయలు గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంటుగా విడుదల చేసిందని మంత్రి తెలిపారు. నిధుల విడుదల పారదర్శకంగా ఉండటానికి గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంటుగా విడుదలైన నిధులపై సంబంధించిన అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వెంటనే సమాచారాన్ని అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గ్రామ పంచాయతీలకు గ్రాంటు విడుదల చేయగానే సంబంధిత గ్రామ సర్పంచ్ లకు, గ్రామ కార్యదర్శిక, జిల్లా పంచాయతీ అధికారులకు, మండల పరిషత్తులకు గ్రాంటు విడుదల చేయగానే సంబంధిత మండల పరిషత్ అధ్యక్షులకు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు, జిల్లా ప్రజా పరిషత్ లు నిధులు విడుదల చేయగా సంబంధిత జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ లకు, జిల్లా కలెక్టర్లకు, జిల్లా అదనపు కలెక్టర్లకు (స్థానిక సంస్థలు) ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారాన్ని పంపిస్తున్నామని ఆయన తెలిపారు. గ్రామీణ స్థానిక సంస్థల నిధుల విడుదలలో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News