Sunday, April 28, 2024

ట్విట్టర్ వివాదం!

- Advertisement -
- Advertisement -

Government of India Controversy between Twitter  ప్రముఖ అంతర్జాతీయ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్‌కు భారత ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదంపై మన సుప్రీంకోర్టు ఏమి చెప్పనున్నది? మన రాజ్యాంగం హామీ ఇస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛకు తిరుగులేదని ప్రకటిస్తుందా, దానిపై అదే రాజ్యాంగం అనుమతిస్తున్న సహేతుక పరిమితులను సమర్థిస్తుందా, అయితే ఆ పరిమితులు ఎటువంటి అభిప్రాయ ప్రకటనల మీద, సమాచారం మీద ఉండాలి, మరెటువంటి వాటిపై ఉండకూడదు? అనేవి తేలవలసి ఉంది. సహేతుక పరిమితులు ఉండి తీరాలనే వాదన వైపే దేశ అత్యున్నత న్యాయస్థానం మొగ్గితే అది అన్ని విషయాల్లోనూ, అందరి సోషల్ మీడియా పోస్టింగులకు, టివి చానళ్లు తదితర మీడియా వాహినులలో వచ్చే వ్యాఖ్యానాలకు, అభిప్రాయాలకు సమానంగా వర్తించే రోజులు వస్తాయా? ప్రభుత్వాల ఏకపక్ష, నిరంకుశ నిర్ణయాల వల్ల చెప్పనలవికాని బాధలు అనుభవించవలసి వస్తుందనే భయంతో, బాధతో ప్రజలు జరిపే ఉద్యమాలకు, కొన్ని వర్గాలు కసితో రెచ్చిపోయి పాల్పడే హింసాయుత చర్యలకు మధ్య విభజన రేఖను సుప్రీంకోర్టు గుర్తిస్తుందా? ఈ ప్రశ్నలకు ముందు ముందు సమాధానాలు వస్తాయని ఆశించవచ్చు. ప్రస్తుతానికైతే ట్విట్టర్‌కు మన కేంద్ర ప్రభుత్వానికి మధ్య సవాలు వాతావరణం నెలకొన్నది.

దేశంలో గల చట్టాలకు లోబడి వ్యవహరించకపోతే తగిన చర్యలు తీసుకోవలసి వస్తుందని ట్విట్టర్‌ను ప్రభుత్వం హెచ్చరించిన పరిణామం గమనించదగినది. భారత ప్రభుత్వం దేశంలోని ట్విట్టర్ అత్యున్నత అధికారులను అరెస్టు చేసే పరిస్థితి తలెత్తవచ్చునని ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. తాను సూచించిన కొన్ని ఖాతాలను తొలగించాలంటూ సమాచార సాంకేతిక చట్టం (ఐటి చట్టం)సెక్షన్ 69ఎ కింద ఇచ్చిన నోటీసును ఖాతరు చేయనందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకోగలదని వార్తలు వచ్చాయి. కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటి వ్యవహారాల మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశానికి అవకాశమివ్వాలని ట్విట్టర్ చేసిన అభ్యర్థనను మంత్రి తిరస్కరించిన తర్వాత ఈ విధమైన అంచనాలు బయలుదేరాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ సరిహద్దుల్లో రెండున్నర మాసాలుగా సాగుతున్న రైతు ఉద్యమానికి సంబంధించి ‘రైతుల ఊచకోత’ అనే పేరిట పోస్టింగులు పెట్టిన 250 ఖాతాలను, ఖలిస్థాన్ సానుభూతి పరులు, పాకిస్థాన్ మద్దతుదార్లవిగా భద్రతా దళాలు అనుమానిస్తున్న మరి 1178 అకౌంట్లను తొలగించాలని భారత ప్రభుత్వం ట్విట్టర్ యాజమాన్యాన్ని కోరిన తర్వాత ఈ వివాదం ఊహించని స్థాయికి వేడెక్కింది.

ఈ ఖాతాల్లో కొన్నింటిని తొలగించానని, వార్తా సంస్థలకు, జర్నలిస్టులకు, ప్రజా సంఘాల కార్యకర్తలకు, రాజకీయ నేతలకు సంబంధించిన వాటిని మాత్రం కొనసాగనిస్తున్నామని టిట్టర్ యాజమాన్యం వెల్లడించింది. దీనిపై దాఖలైన ఒక కేసులో శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వానికి, ట్విట్టర్ భారతీయ విభాగానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్న నకిలీ వార్తలు, బూటకపు ప్రచారం దేశాన్ని అశాంతికి గురి చేస్తున్నాయని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. విద్వేషం వ్యాప్తి చేసే సమాచారాన్ని, ప్రకటనలను క్రమబద్ధం చేయడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని పిటిషన్‌దారు అందులో కోరారు. ఒక సమాచారం ప్రకారం ఇండియాలో 3 కోట్ల 50 లక్షల ట్విట్టర్ ఖాతా లు, 35 కోట్ల ఫేస్‌బుక్ అకౌంట్లు ఉన్నాయి. వీటిలో చెరి 10 శాతం బోగస్ ఖాతాలుంటాయని సమాచారం. గురువారం నాడు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నందుకు ట్విట్టర్‌ను తమ ప్రభుత్వం గట్టిగా ప్రశ్నించిందని వెల్లడించారు. అమెరికా పార్లమెంటు భవనంపై దాడి సందర్భంలో అక్కడి పోలీసుల చర్యను సమర్థించిన ట్విట్టర్ భారత గణతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట పై దాడి సందర్భంగా మన పోలీసుల చర్యను ఎందుకు వ్యతిరేకించింది అని ఆయన ప్రశ్నించారు.

అయితే ఇక్కడి రైతు ఉద్యమాన్ని అక్కడి హింసాయుత దాడిని ఒకే గాటన కట్టడం సమంజసమా అనే ప్రశ్న ఉదయించక మానదు. అలాగే జర్నలిస్టులు, మేధావులు, ఆందోళనకార్లు మన ప్రభుత్వాల నిర్ణయాలను ప్రశ్నించడాన్ని, వాటిని సామాజిక మాధ్యమాలలో అనుమతించడాన్ని తీవ్రవాద చర్యలుగానో, రాజద్రోహ నేరాలుగానో పరిగణించవచ్చునా ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఫేస్‌బుక్‌ను దుర్వినియోగం చేసిన ప్రజా ప్రతినిధుల ఉదంతాలు ఎన్నికల్లో దుష్ప్రచా రానికి వాడుకున్న సందర్భాలూ గతంలో బయటపడ్డాయి. అన్ని రకాల దుర్వినియోగాలనూ, జాతి విద్రోహకర ప్రచారాలనూ అరికడుతూనే ప్రజల భావప్రకటన స్వేచ్ఛను కాపాడవలసి ఉంది. సహేతుక పరిమితుల పేరుతో న్యాయమైన, ప్రజల అసంతృప్తిని, బాధను వ్యక్తం చేసే అభిప్రాయాలను కూడా అణచివేయాలనుకోడం సరైనది కాదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News