Sunday, April 28, 2024

గ్రీన్‌కార్డులకు ట్రంప్ గ్రహణం?

- Advertisement -
- Advertisement -

Green Cards

 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గత ఎన్నికల నాటి తన విజయ మూలాలను వెతికి మరి వెలికి తీస్తున్నట్టున్నాడు. అప్పుడు తనకి అనూహ్య విజయాన్ని కట్టబెట్టిన మితిమించిన జాతీయవాద విధానాలను మళ్లీ ఆశ్రయిస్తున్నాడు. వాస్తవానికి ఈ వ్యాపకంలో ఆయన ఎప్పుడూ విరామం ఇవ్వలేదు. వాటిలో ముఖ్యమైనది దేశదేశాల నుంచి వలసలను ఆపివేస్తానన్న వాగ్దానం, అక్రమ వలసలకు అడ్డుకట్ట వేస్తానన్న భీష్మ ప్రతిజ్ఞ, మెక్సికోతో గల సరిహద్దుల పొడుగునా గోడ కట్టి ఆ ఖర్చును కూడా దాని నుంచి ముక్కు పిండి వసూలు చేస్తానన్న ప్రకటన. కరోనాను, పెరిగి పేట్రేగిపోతున్న నిరుద్యోగాన్ని సాకుగా తీసుకొని ఇప్పుడు మళ్లీ వలసలను అరికట్టే అస్త్రాన్ని ప్రయోగిస్తానని ప్రకటించాడు ట్రంప్. కనిపించని కరోనా శత్రువు నుంచి కాపాడుకోడానికి, అమెరికన్ పౌరుల ఉద్యోగావకాశాలను మెరుగు పర్చడానికి విదేశాల నుంచి వలసలను తాత్కాలికంగా బంద్ చేస్తానని మొన్న సోమవారం నాడు ట్రంప్ వెల్లడించాడు.

ప్రత్యేక అధ్యక్ష ఉత్తర్వుల (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) ద్వారా ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెస్తానన్నాడు. అమెరికాలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8 లక్షలకు చేరుకున్నది. 40 వేల మందికి పైగా మృతిచెందారు. అలాగే కరోనా నేపథ్యంలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోయింది. వీరి సంఖ్య 2 కోట్ల 20 లక్షలకు చేరుకున్నది. ఈ వైరస్ కారణంగా జాతీయ ఆత్యయిక స్థితి ప్రకటించిన తర్వాత గత నాలుగు వారాల్లోనే 52 లక్షల మంది నిరుద్యోగులుగా నమోదు చేసుకున్నారు. కొన్ని రకాల వలస ఉద్యోగులకు గ్రీన్ కార్డుల మంజూరును రెండు మాసాల పాటు నిలిపివేయదలచినట్టు ట్రంప్ చేసిన తాజా ప్రకటన ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చునని భావించే వారూ ఉన్నారు. దీనివల్ల అమెరికాకు చెప్పుకోదగిన మేలు జరగదని వీరు అభిప్రాయపడుతున్నా రు. ఇప్పటికే అమెరికా తన సరిహద్దులను మూసివేసింది.

ఆదిలో యూరప్, చైనాల నుంచి విమానాల రాకను నిలిపివేసింది. ఆ తర్వాత అన్ని అంతర్జాతీయ విమానాలకు తెర దించింది. అలాగే అన్ని దేశాల పౌరులకు వీసాల మంజూరును ఆపివేసింది. అందుచేత విదేశాల నుంచి చదువులు, ఉద్యోగాల కోసం వచ్చేవారంటూ ఉండేందుకే అవకాశం లేదు. వాస్తవానికి ఏ దేశ అధినేత అయినా ఇటువంటి పరిస్థితులలో విదేశాల నుంచి వచ్చే వారిని రానివ్వకుండా చూడడం సహజమే. అయితే ట్రంప్ మొదటి నుంచి విదేశీ వలసల మీద వాగ్బాణాలు సంధిస్తూనే ఉన్నాడు. పొరుగు ఊరులాంటి మెక్సికో నుంచి తండోపతండాలుగా వచ్చే వలసల మీద ఆయన కన్ను వేసి ఉన్నాడు. అందుచేత ఆయన చేసిన తాజా ప్రకటన అంతగా ఆందోళన కలిగించదు. అయితే తనను అభిమానించే ఓటర్లకు ఇది వీనుల విందుగా ఉంటుంది. వారిలో పట్టభద్రులు కానివారు, పరిమిత విద్యావంతులు అధికంగా ఉంటారు. ‘బి అమెరికన్ హైర్ అమెరికన్’ అనే నినాదం ఆయనకు బాగా కలిసి వచ్చింది.

హెచ్1 బి వీసాల మంజూరును ఆయన ఎప్పటికప్పుడు పరిమితం చేస్తూ రావడానికి కూడా ఇదే కారణం. కెనడా, మెక్సికోల నుంచి అత్యవసరం కాని వలసలు, వచ్చే నెల ప్రథమార్థం ముగిసే వరకు నిలిపివేస్తూ ఆ రెండు దేశాలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాడు. కరోనా కారణంగా అమల్లోకి వచ్చిన ఆత్యయిక పరిస్థితి చట్టాల కింద వేలాది మంది మెక్సికన్ అక్రమ వలసదార్లను వెనక్కి పంపించివేశాడు. కరోనాకు ముందు, ఏడాదికి 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదార్లు అమెరికాకు వచ్చేవారు. అటువంటివారిని ఏరివేస్తామంటూ ట్రంప్ ఇప్పటికే అనేక సార్లు హెచ్చరించాడు. నిజానికి అమెరికన్ల ప్రాణాలను కాపాడుతున్న వారిలో, అలాగే అక్కడి అతి పెద్ద కార్పొరేట్ సంస్థల్లో పని చేస్తున్న అత్యుత్తమ సాంకేతిక నిపుణుల్లో విదేశీ వలసదారులే ఎక్కువ. కరోనా చికిత్స చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర ఆరోగ్య సహాయకులు, అక్కడి భారీ వ్యవసాయ క్షేత్రాల్లో పని చేస్తున్నవారు, రెస్టారెంట్ కార్మికులలో వలస వచ్చిన వారే అధికంగా ఉంటారు.

విదేశీయులందరినీ పంపించివేసి ఆ ఉద్యోగాలన్నింటినీ మీకే ఇస్తానని ఆశ పెట్టి సాధారణ అమెరికన్ ఓటర్లను తన వైపు నిలబెట్టుకోడమే ట్రంప్ అసలు వ్యూహమని బోధపడుతున్నది. ప్రత్యేకించి ముస్లిం దేశాల నుంచి రాకడకు పూర్తిగా తెర దించాలన్నదే ఆయన ఉద్దేశం. లిబియా, ఇరాన్, సోమాలియా, సిరియా, యెమెన్, ఉత్తర కొరియా, వెనుజులాల నుంచి వలసలను నిషేధించిన ట్రంప్ చర్య చాలా కాలం పాటు న్యాయస్థానాలలో సవాళ్లను ఎదుర్కొన్నది. అంతిమంగా సుప్రీంకోర్టు ఆమోదంతో అది గట్టెక్కింది.

ఇప్పడీ దేశాల సంఖ్య ను ట్రంప్ 13కి పెంచాడు. ఆయన వ్యక్తిగత వాణిజ్యాది భవనాల నిర్మాణంలోనే అక్రమ వలసదార్ల శ్రమను వినియోగించుకున్న సందర్భాలున్నాయి. వారికి తగిన వేతనాలివ్వలేదనే వ్యాజ్యాలను కూడా ఎదుర్కొని ఆయన స్వయంగా పరిహారం చెల్లించుకున్న ఉదంతాలూ ఉన్నాయి. అందుచేత వలసదార్ల మేధస్సు, శ్రమ లేకుండా అమెరికాకు ఒక్క క్షణం గడవదన్నది నిగ్గు తేలిన వాస్తవం. ఇప్పటి వలసల తాత్కాలిక నిరోధక సంకల్పం కూడా ఆయన దృష్టి మళ్లింపు వ్యూహాల్లో ఒకటిగానే తెల్లారిపోవచ్చు.

 

Green Cards to be suspended for 60 days
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News