Thursday, May 2, 2024

సంపాదకీయం: ద్వంద్వ న్యాయ ప్రమాణాలు?

- Advertisement -
- Advertisement -

Arcep Regional Comprehensive Economic Partnership

ఏ సిద్ధాంతాలకు, ఆలోచనలకు, ఆదర్శాలకు ప్రాధాన్యం ఇచ్చి, ప్రాతినిధ్యం వహించే ఎటువంటి శక్తులు అధికారంలోకి వచ్చినా దేశ ప్రజల మౌలిక హక్కులకు, స్వేచ్ఛలకు భంగం వాటిల్లకుండా చూసి వాటిని కాపాడే వజ్ర కవచాల్లాంటి ఏర్పాట్లను దేశ పథనిర్దేశకులు రాజ్యాంగంలో పొందుపరిచారు. అటువంటి వాటి లో ప్రధానమైనది రాజ్యాంగంలోని 32వ అధికరణ. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వారు నేరుగా హైకోర్టులనో, సుప్రీంకోర్టునో ఆశ్రయించి రక్షణ పొందడానికి ఈ అధికరణను చేర్చారు. రాజ్యాంగం 3వ విభాగంలోని 12 నుంచి 35 వరకు గల ఆర్టికల్స్‌లోని హక్కులకు నిఘాతం కలుగకుండా రాజ్యాం గం చాచిన అభయ హస్తమే అధికరణ 32. చట్టం ముందు సమానత్వం, భావ ప్రకటన స్వేచ్ఛ, మత, సాంస్కృతిక స్వాతంత్య్రం, కోరుకున్న మతాన్ని అవలంబించే వీలు దోపిడీని ఎదిరించడం వంటివి ఈ హక్కుల కిందికి వస్తాయి. ఇటువంటి ప్రధానమైన ఐదు హక్కులతో పాటు వాటిని కాపాడుతాననే హామీని కూడా ఆర్టికల్ 32 రూపంలో ఆరవ ప్రాథమిక స్వత్వంగా రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆర్టికల్ 32 లేని రాజ్యాంగం నిరుపయోగమని అది దాని ఆత్మ, హృదయం అని డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ సభలోనే ప్రకటించారు.

పౌరులకు అన్ని దిక్కులూ మూసుకుపోతే చిట్టచివరి దిక్కుగా అంతిమ విమోచన ద్వారంగా పని చేయవలసిన దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు ఇటీవల ఆశ్చర్యకరంగా ఈ 32వ అధికరణను ఆశ్రయించవద్దని దేశ ప్రజలను హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిర్బంధం నుంచి కేరళ జర్నలిస్టు సిద్దిఖి కప్పన్‌ను జామీనుపై విడుదల చేయాలని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ బాబ్డే ఈ విధంగా వ్యక్తమయ్యారు. ఆర్టికల్ 32 కింద వ్యాజ్యాల దాఖలును తాము ప్రోత్సహించదలచుకోలేదన్నారు. ఈ కోవకు చెందిన పటిషన్లు కుప్పలుగా పడి ఉన్నాయన్నారు. కాపాడవలసిన చేతులే ముడుచుకుంటే సర్వ బలగాలుండే ప్రభుత్వాల నిరంకుశ నిర్ణయాల నుంచి పౌరులను ఇంకెవరు కాపాడుతారు అనే ప్రశ్న తలెత్తి అత్యంత దయనీయ నైరాశ్య స్థితి పౌరులను ఇటువంటి సందర్భాల్లోనే ఆవహిస్తుంది. కింది కోర్టుకు వెళ్లే అవకాశమున్నప్పటికీ దానిని దాటి తన వద్ద దాఖలయ్యే వ్యాజ్యాల విషయంలో ముందు అక్కడికి వెళ్లి రండి అని చెప్పి సుప్రీంకోర్టు తిప్పి పంపుతున్న సందర్భాలు తరచూ తారసపడుతున్నాయి. కాని వివాదాస్పదుడైన, కేంద్రంలోని పాలక వర్గాల జేబులోని గొంతు అనిపించుకుంటున్న మీడియా ప్రముఖుడు రిపబ్లిక్ టివి సంపాదకుడు ఆర్నాబ్ గోస్వామి ఇటీవల ముంబై పోలీసులు తనను ఒక కేసులో అరెస్టు చేసినప్పుడు సెషన్స్, హైకోర్టులను విడిచి పెట్టి ఆర్టికల్ 32 కింద నేరుగా సుప్రీంకోర్టునే ఆశ్రయించగా ఆయనకు హుటాహుటిన జామీను మంజూరు అయిన ఉదంతం తెలిసినదే. అప్పుడు ధర్మాసనం అత్యంత విలువైన, ప్రజాస్వామ్యానికి వెన్నుదన్ను వంటి వ్యాఖ్య కూడా చేసింది. పౌరుల స్వేచ్ఛలను కాపాడడానికి సుప్రీంకోర్టు ఉన్నదనే విషయం రాష్ట్ర ప్రభుత్వాలు మరచిపోకూడదని హెచ్చరించింది.

ఇది జరిగిన తర్వాత కేరళ జర్నలిస్టు కప్పన్ విషయంలో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ సందర్భంలో ఆర్టికల్ 32 వ్యాజ్యాల పట్ల ప్రధాన న్యాయమూర్తి విసుగును, వైముఖ్యాన్ని ప్రదర్శించడం ఆశ్చర్యపరిచింది. కప్పన్‌కు బెయిల్‌ను నిరాకరించిన కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరగా ఆయనను తాము అక్రమంగా నిర్బంధించలేదని జర్నలిజం ముసుగులో కప్పన్ కుల విభేదాలు రెచ్చగొడుతున్నాడని తెలియజేసింది. కప్పన్ కేరళ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ కార్యదర్శి. 19 ఏళ్ల దళిత యువతి సామూహిక హత్యాచారానికి గురైన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాకు వెళుతుండగా అతడిని గత నెల 5న ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.

ఆయన కుల వైషమ్యాలు రెచ్చగొట్టడానికి వెళుతున్నాడనే కారణం మీద నిర్బంధానికి తీసుకున్న యుపి పోలీసులది తప్పు కాకపోతే బహిరంగ బరితెగింపు వ్యాఖ్యలూ ప్రసారాలతో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడన్న ముద్రపడిన ఆర్నాబ్ గోస్వామి సుప్రీంకోర్టు జామీనుకు ఎలా అర్హుడయ్యాడు అనే ప్రశ్న సహజంగానే తలెత్తింది. కప్పన్ మాత్రమే కాదు అంతకంటే దారుణమైన స్థితిలో జైళ్లలో మగ్గుతూ బెయిల్ కోసం నిరీక్షిస్తున్న సామాన్యులే కాకుండా మేధావులు, హక్కుల ఉదమకారులున్నారు. ఎవరి మీద ఎటువంటి నేరారోపణలున్నప్పటికీ వారి వ్యక్తిగత స్వేచ్ఛలు నిరవధికంగా హరించుకుపోతుంటే సుప్రీంకోర్టు ఊరుకోడం న్యాయమా? ఆర్నాబ్ గోస్వామి విషయంలో బెయిల్ మంజూరు అత్యవసరమని పౌరుల స్వేచ్ఛల హరణాన్ని సహించరాదని భావించిన సుప్రీంకోర్టు అదే మాదిరి ఇతర కేసుల్లో ఆర్టికల్ 32 అభ్యర్థనలను తిరస్కరించడంలో ద్వంద్వ ప్రమాణాలు కనిపించడం లేదా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News