Monday, April 29, 2024

మహిళా జడ్జికే వేధింపులు!

- Advertisement -
- Advertisement -

“బతకాలని లేదు, గత ఏడాదిన్నరగా నన్ను జీవచ్ఛవంగా, నడిచే కళేబరంగా మార్చేశారు. ఆత్మ లేని, ప్రాణం లేని ఈ శరీరాన్ని మోయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నా జీవితం నిష్ప్రయోజనం, గౌరవప్రదంగా బతుకును అంతం చేసుకోడానికి అనుమతించండి” -ఈ మాటలు ఏ సాధారణ అభాగ్య మహిళవో కావు. ఒక మహిళా సివిల్ జడ్జివి. తనను లైంగికంగా వేధిస్తున్న తన పై అధికారి అయిన ఒక జిల్లా జడ్జి గురించి భారత ప్రధాన న్యాయమూర్తికి ఆమె రాసుకొన్న లేఖలోని మాటలు ఇవి. మగానుభావుల చేతుల్లో వేధింపులకు, అత్యాచారాలకు గురయ్యే అభాగినులు ఎంతో మందికి న్యాయం చేసే ఆమె తన విషయంలో ఎంతకీ న్యాయం దొరక్కపోడంతో స్వయంగా తానే నేరుగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ని ఆశ్రయించారు.

సిజెఐకి ఆమె రాసుకొన్న లేఖ గతవారం వైరల్ అయ్యింది. ఆమె ఉత్తరప్రదేశ్ బందా జిల్లాలో సివిల్ జడ్జిగా పని చేస్తున్నారు. తన ఫిర్యాదుపై విచారణ మొదలు కావడానికి ఆరు మాసాల కాలం పట్టిందని, వేలాది ఇ మెయిల్స్ సంధించవలసి వచ్చిందని ఆమె మొరపెట్టుకొన్నారు. విచారణలో సాక్షులు తనను వేధిస్తున్న జిల్లా జడ్జి కింద పని చేస్తున్నవారేనని, వారు తమపై అధికారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే అవకాశం లేదని అటువంటప్పుడు ఆ విచారణ నవ్వులాటగానే ముగిసిపోతుందని ఆమె వాపోయారు. ఆమె లేఖను పరిగణనలోకి తీసుకొన్న సిజెఐ అలహాబాద్ హై కోర్టు నుంచి వివరాలు కోరారు. ఆ మగ మహా జిల్లా జడ్జి గారు వృత్తిపరమైన విషయాలు తనతో మాట్లాడడానికి రాత్రి పూట తన ఇంటికి రావాలని తనను ఆదేశించేవారట. మహిళా సాధికారత, వారు ఉన్నత పదవులు అందుకోడం ద్వారా సిద్ధించేది కాదని అర్థమవుతుంది. అది వారిపై వేధింపులను, కామ కోరలు వారిని బాధించడాన్ని అరికట్టడం లేదన్న మాట. మహిళల పై అకృత్యాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించడానికి ఉద్దేశించిన చట్టాలు అనేకం ఉన్నాయి. శిక్షలు కూడా పడుతున్నాయి.

కాని ఈ దారుణ నేరాలు తగ్గడం లేదు. 1992 లో రాజస్థాన్‌లో మహిళా అభివృద్ధి ప్రాజెక్టులో పని చేస్తున్న సోషల్ వర్కర్ ఒకామె ఏడాది ఈడు ఆడపిల్ల పెళ్లిని ఆపడానికి ప్రయత్నించగా ఐదుగురు దుర్మార్గులు ఆమె పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు పని స్థలాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు శిక్షలు వేయడానికి తగిన చట్టాలు లేవని అభిప్రాయ పడింది. అందువల్ల ఈ కేసుల్లో న్యాయస్థానాలు చర్యలు గైకొనడానికి మార్గదర్శకాలను విశాఖ గైడ్‌లైన్స్ పేరిట 1997లో రూపొందించింది. ప్రత్యేక చట్టం అవతరించే వరకు, అన్ని పని స్థలాల్లో వాటిని పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. పని స్థలాల్లో లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, న్యాయం అందజేత చట్టం 2013లో వచ్చింది. అది రూపొంది పదేళ్లు దాటిపోయినా ఈ నేరాలు ఆగడం లేదు. కార్యాలయాల్లో లైంగిక వేధింపుల కేసులు 2021- 22 ఆర్ధిక సంవత్సరంలో 27 శాతం పెరిగాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్చేంజిలో నమోదైన 100 కంపెనీల్లో జరిపిన సర్వేలో ఇది వెల్లడైంది. మహిళా ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేయడానికి అవకాశం కల్పించినప్పుడు ఈ దారుణాలు తగ్గు ముఖం పట్టి తిరిగి వారు ఆఫీసులకు వచ్చిన తర్వాత పూర్వం లాగానే పేట్రేగినట్టు బయటపడింది. మహిళలను చదవనివ్వడం, ఉద్యోగాల్లో చేరనివ్వడం ఉద్దేశమే పురుషులతో సమానంగా స్వేచ్ఛను, సాధికారతను పొంది రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను సంపూర్ణంగా అనుభవించేలా చేయడం అయినప్పుడు ఇంటి నుంచి పని చేయించడంలో ప్రయోజనం శూన్యం. అనేక మంది చైతన్యవంతులైన, విద్యావంతులైన మహిళలు తాము పని చేసిన చోట తమ బాస్‌లు, సహ పురుషోద్యోగుల నుంచి ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయటపెట్టి ‘మీటూ’ ఉద్యమాన్ని నడిపారు.

అయినా ఈ మగ పశువులకు బుద్ధి రాలేదు. మార్పు సంభవించలేదు. మన సనాతన జీవన శైలి, విశ్వాసాలు మతపరమైన లింగ సంబంధాలు, మగాధిపత్యాన్ని బోధిస్తున్నాయి. స్త్రీ మీద పురుషుడి దౌర్జన్యాన్ని సుస్థిరం చేస్తున్నాయి. ఈ మనస్తత్వం మెజారిటీ పురుషుల్లోనే కాదు స్త్రీలలోనూ నాటుకుపోయింది. దీనిని తొలగించడానికి మౌలికమైన కృషి జరగాలి. దురదృష్టం కొద్దీ ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్న శక్తులు స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని కాక అసమానతనే సమర్ధిస్తున్నాయి. మహిళ చదువుకోకుండా, ఉద్యోగాలు చేయకుండా గృహ బానిసగానే కొనసాగాలని కోరుకొంటున్నాయి. ప్రస్తుత సమతా రాజ్యాంగానికి బదులు, మను రాజ్యాన్ని స్థాపింప జూస్తున్నాయి. అందు చేత మహిళ తన స్వాతంత్య్రం కోసం, ఆత్మ గౌరవం కోసం మరింత సునిశిత పోరాటానికి సిద్ధం కావలసి ఉంది. అభ్యుదయ, విప్లవ శక్తులు ఆమెకు అండగా నిలబడవలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News