Saturday, April 27, 2024

‘బండీ’.. ఇదేం భక్తి

- Advertisement -
- Advertisement -

సాగునీటి ప్రాజెక్టులకు మోకాలడ్డింది నిజం కాదా!
పర్యావరణ అనుమతులివ్వద్దని సిడబ్లుసికి లేఖ రాయలేదా
చేతనైతే రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టు తీసుకురా
అసెంబ్లీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్

Rs 18 lakh Stolen from SBI Bank in Peddapalli

మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ భక్తి ఉంటే చాలదు…రాష్ట్ర భక్తి కూడా ఉండాలన్నారు. వారు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం క్షుద్ర రాజకీయాలు చేయడం తగదన్నారు. ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కాదని, రాష్ట్రం శాశ్వతమన్నారు. రాష్ట్ర హక్కులకు భంగం కలిగేలా సంజయ్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో సాగునీటి పద్దులపై జరుగుతున్న చర్చ సందర్భంగా బండిపై మంత్రి హరీశ్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు తెస్తే..నిండు సభలో సన్మానం చేస్తామన్నారు. కానీ పదవులకోసం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా బిజెపి ఎంపిలు, నేతలుపని చేయడం బాధాకరమన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క ప్రాజెక్టుకు బిజెపి నేతలు సహాయ పడకపోగా అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇందుకు కేంద్ర జలమంత్రిత్వ శాఖకు బండి సంజయ్ లేఖ రాయడం ఇందుకు నిదర్శమన్నారు. సాగు నీటి ప్రాజెక్టులకు అన్ని అనుమతులు ఇచ్చే వరకు పర్యావరణ, అటవీ అనుమతులు ఇవ్వద్దు అని, అవసరమైతే తెలంగాణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురండి? అంటూ బండి సంజయ్ లేఖ రాయ డం నిజం కాదా? అని ప్రశ్నించారు. సెంట్రల్ వాటర్ కమిషన్‌లో 16 రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, అటవీ, ఎన్విరాన్‌మెంట్ అనమతులకు ట్రై చేస్తామన్నారు. కాని సిడబ్ల్యూసి అనుమతులు ఇచ్చేదాకా పర్యావరణ అనుమతులు ఇవ్వద్దు అని లేఖ ఇచ్చారన్నారు. కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రి షెకావత్ కూడా లేఖ ఇచ్చారని హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటేనా కదా వారు ఢిల్లీకి పోయిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే వారు రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. దీనిపై సభ్యులంతా ఆలోచించాలన్నారు. వీరికి రాజకీయ భుక్తిపై ఉన్న ధ్యాస కంటే రాష్ట్ర భక్తి, రైతులమీద లేదన్నారు. ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలితంతో తెలంగాణను సాధించుకున్నామన్నారు.

రైతులు కళ్లలో వత్తులు వేసుకుని నీళ్లు వస్తాయి, పంటలు పండుతాయని చూస్తుంటే. రైతుల నోట్లో మట్టి గొట్టడానికా ఈ రాజకీయాలు అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. మనస్సు ఉంటే సహకారం అందించండి లేదా సాయం చేయండి! అంతే కాని కాళ్లల్లో కట్టెలు పెట్టకండి అని బిజెపి నేతలకు ఆయన సూచించారు. ప్రాజెక్టులపై కొందరు కేసులు వేయగా, మరికొందరు రైతులను రెచ్చగొట్టారన్నారు. కోర్టుల్లో, గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేశారన్నారు. బిజెపి నేతలు అయితే ఇప్పుడు ఏకంగా చట్టమే తేవాలంటున్నారు. దేశమంతా ఒక చట్టం అయితే తెలంగాణకు మరో న్యాయం అంటున్నారు. పక్క రాష్ట్రంలో ప్రాజెక్టులు వేగంగా కట్టుకుంటుంటే. రాష్ట్రంలో మాత్రం ప్రాజెక్టులు కట్టవద్దు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చైతనైతే ఒక జాతీయ ప్రాజెక్టును తీసుకురావాలన్నారు. రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టు కావాలని, పర్యావరణ అనుమతులు తొందరగా ఇవ్వాలని కేంద్రానికి లేఖ ఇవ్వాల్సింది పోయి, ప్రత్యేక చట్టాలు తెచ్చి ప్రాజెక్టులు ఆపేందుకు యత్నించడం సిగ్గుచేటని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం నడిచిందన్నారు. అందుకే సిఎం కెసిఆర్ నీటిపారుదల రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారన్నారు.సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందన్నారు. మండుటెండల్లో చెరువులు మత్తడి దుంకుతున్నాయన్నారు. యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల విలువ లక్ష కోట్లు దాటిందన్నారు. గత పాలకుల నిర్లక్షం కారణంగా తెలంగాణలో ప్రాజెక్టులన్నీ నత్తనడకను తలపించాయన్నారు. కానీ సిఎం కెసిఆర్ నేతృత్వంలో ఆ ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేసి శరవేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్దరించుకున్నామన్నారు. అలాగే వాగులపై చెక్‌డ్యాంలను నిర్మిస్తున్నామన్నారు. ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు అని, గుజరాత్ ప్రభుత్వం నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యాం పూర్తి చేయడానికి 37ఏండ్లు పట్టిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చెరువులను పట్టించుకోలేదు. చెరువుల కింద 15లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరణ చేశామని హరీశ్‌రావు వివరించారు. ఎపి ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

అనితర సాధ్యమైన కాళేశ్వరాన్ని మూడేళ్ళలోనే పూర్తి చేశాం
మూడేళ్లలో అనితర సాధ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని హరీశ్‌రావు తెలిపారు. ఆసియా ఖండంలోసాగు నీటి రంగంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమన్నారు. వంద మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండ పోచమ్మ సాగర్ కు 10 లిఫ్ట్ లలో, 3 బ్యారేజీలు నిర్మించి తేవడం ఆషామాషీ కాదన్నారు. ఇది ఒక అద్భుతమన్నారు. పెద్ద ఎత్తన రిజర్వాయర్లు నిర్మించడం సులువైన విషయం కాదన్నారు. నర్మద నదిపై సర్థోర్ సరోవర్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి గుజరాత్ ప్రభుత్వానికి ఏకంగా 37 ఏళ్లు పట్టిందన్నారు. నర్మదాపైనే మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఇందిరాసాగ్ ప్రాజెక్టును 1984లో శంకుస్థాపన చేసి 2005లో ప్రారంభించారని, దీనికి 21 సంవత్సరాలు పట్టిందన్నారు. అలాగే భాక్రానంగల్ ప్రాజెక్టు పంజాబ్ లో 1948 లో ప్రారంభమైతే 1963 పూర్తి చేయడానికి 15 ఏళ్లు పట్టిందన్నారు. ఒరిస్సాలో హీరాకుడ్ ప్రాజెక్టుకు పదేళ్లు, మహారాష్ట్రలో గైక్వాడ్ ప్రాజెక్టు 11 ఏళ్లు, నాగార్జున సాగర్ నిర్మాణానికి 12 సంవత్సరాలు, రాష్ట్రంలోని శ్రీరామ్ సాగర్ నిర్మాణానికి 14 ఏళ్లు పట్టిందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం వంటి ఎత్తిపోతల ప్రాజెక్టును మూడు సంవత్సరాలలో పూర్తి చేయాలంటే సిఎం కెసిఆర్ పట్టుదల, ఇంజనీర్ల కృషిని అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టు నుంచి కూడా చెరువుల్లోకి నీరు ఇచ్చేవారు కాదన్నారు. కానీ టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలోచెరువులు, కుంటలు మేజర్ ప్రాజెక్టుల నీటితో నింపాలని విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. దీని వల్ల ఆయకట్టు బాగా పెరిగిందన్నారు. చెరువుల కింద మిషన్ కాకతీయ ద్వారా 15 లక్షల ద్వారా ఆయకట్టుస్థిరీకరించబడిందటే, చెరువుల పునరుద్ధరణ, ప్రాజెక్టుల నుంచి నీటిని చెరువులు నింపడం కారణమన్నారు. సిరిసిల్ల రాజన్న జిల్లాలో చెరువులు నింపడంవల్ల భూగర్భజలాలలు అత్యధికంగా 6 మీటర్లు పెరిగాయన్నారు. దేశంలోనే రాజన్న సిరిసిల్లా జిల్లా అత్యధిక భూగర్బజలాలు ఉన్న జిల్లాగా రికార్డు సాధించిందన్నారు.

Harish Rao fires on Bandi Sanjay in Assembly

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News