Friday, May 10, 2024

హత్రాస్ అమానుషం

- Advertisement -
- Advertisement -

                Hathras gang rape and murder         ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో 19 ఏళ్ల దళిత యువతి (మనీష)ని నలుగురు యువకులు ఘోరంగా హింసించి సామూహికంగా చెరచి చావునోట్లోకి నెట్టేసిన అమానుషం దేశంలో మహిళకు బొత్తిగా రక్షణలేని దుస్థితిని మరోసారి మరింత బిగ్గరగా చాటింది. హత్రాస్ జిల్లా చాంద్ పా గ్రామంలో మనీష పై జరిగిన అత్యాచార అఘాయిత్యం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ దుర్మార్గాన్ని ఆమె ఎంతగా ప్రతిఘటించిందో ఆ క్రమంలో వారు ఎటువంటి హింసకు గురి చేశారో తలచుకుంటేనే ఒళ్లు భయంతో ఆగ్రహంతో గగుర్పొడుస్తుంది. నాలుక కోసేయడం, నడుము, మెడ ఎముక విరిగిపోడం ఇంతటి అకృత్యానికి మనుషులు పాల్పడగలరా అనే ప్రశ్న తలెత్తుతుంది. అవును, పాల్పడగలరు అని ఉత్తరప్రదేశ్ నుంచి సూటి సమాధానం వినవస్తున్నది. నిర్భయ, దిశ వంటి దారుణాల్లోనూ ఇదే దురిత కాండ.

ఎంత కఠినమైన శిక్షలు పడుతున్నా, చట్టం ఎంత దృఢంగా వ్యవహరిస్తున్నా మహిళలపై హద్దు, ఆపూ లేకుండా సాగిపోతున్న ఈ అమానుషం మూలాలెక్కడున్నాయి అనే దాన్ని లోతుగా పరిశీలించి తెలుసుకోవలసి ఉంది. తల్లితో పాటు పశుగ్రాసం సేకరిస్తున్న అమ్మాయిని నలుగురు అగ్రకుల యువకులు వెనుక నుంచి వెళ్లి ఆమె కప్పుకున్న వస్త్రాన్నే మెడకు బిగించి అపహరించుకుపోయి అత్యాచారారానికి పాల్పడడం, ఢిల్లీ ఆసుపత్రిలో మృత్యువుతోనూ పోరాడి చివరికి ఆమె ఓడిపోడం ఒక ఎత్తు అయితే అక్కడి నుంచి ఆమె మృతదేహాన్ని సొంతూరికి తీసుకొచ్చిన పోలీసులు రాత్రి 2 గం. వేళ హడావిడిగా బలవంతపు అంత్యక్రియలు జరిపించేసిన తీరు మరో ఎత్తు. తెల్లారితే జనం పోగై శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే భయంతో అలా జరిపించవలసి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఇదే ఉన్నత సామాజిక వర్గానికి చెందిన యువతి వ్యవహారం అయితే ఇలాగే చేస్తారా అని దళిత కంఠం ప్రశ్నిస్తోంది.

ఇది కొట్టి పారేయడానికి వీలు లేని ప్రశ్న. సామాజిక తేడాలతో నిమిత్తం లేకుండా మొత్తం దేశంలోని మహిళలందరూ ఎదుర్కొంటున్న అభద్రత, మగ కామపిశాచుల దాడుల సమస్య ఒకటైతే భూమి, హోదా లేమితో కుల వ్యవస్థ అట్టడుగునున్న దళిత మహిళ మిగతా స్త్రీల కంటే ఎక్కువగా బలి పశువు అవుతున్న చెప్పరాని దుర్మార్గం మరొకటి. ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో దళిత మహిళలు, పురుషులు కూడా పై వర్గాల దౌర్జన్యాలకు గురి అవుతున్న దారుణోదంతాలు జరిగిపోతున్నాయి. సామూహిక అత్యాచారాలకు, మహిళలపై యాసిడ్ దాడులకు పాల్పడిన దుండగులు ఎన్‌కౌంటర్ ఘటనల్లో పోలీసు కాల్పులకు చనిపోయిన సందర్భాలున్నాయి, శిక్షలు పడుతున్నాయి. అయినా ఈ ఘాతుకాలు ఆగకుండా సాగిపోతున్నాయి. ఇందుకు మూలంలోని కారణాలను వెతికి పట్టుకోవాలి. నిర్భయ నిధి పేరిట ఉన్న నిధులను అటువంటి కృషికి వెచ్చించాలి. ఇప్పటికీ సంప్రదాయ అలవాట్లు, ఆచారాలు, మనోభావాలు నడిపిస్తున్న సమాజం మనది. ప్రజాస్వామికమైన నడత అనేది రాజ్యాంగ గ్రంథానికే పరిమితమైపోయి ఉన్నది. దాని నుంచి అవతరించిన చట్టం అరుదుగాగాని సామాజిక జీవనంపై ప్రభావం చూపడం లేదు. దైనందిన జీవితం మీద పూర్వం నుంచి పాటిస్తున్న విధి విధానాల ప్రభావమే ఎక్కువగా ఉంది.

ఇది పట్టణాల్లో తక్కువ స్థాయిలో పల్లెల్లో పరిపూర్ణంగా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాదిలో దళితులు, తదితర సామాజిక అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాల్లో సంప్రదాయ భావ జాల ప్రభావమే రుజువవుతుంది. స్త్రీని తక్కువగా చూసే పురుష దురహంకారాన్ని, అదే సమయంలో అంతస్థుల కుల వ్యవస్థ దృష్టితో మానవ సంబంధాల్లో ఎగుడు దిగుడులను పాటిస్తున్న ధోరణిని గమనించవచ్చు. మహిళ ఇప్పటికీ పురుషుడి చాటున బతికే ద్వితీయ శ్రేణి పౌరసత్వాన్నే అనుభవిస్తూ ఉండడం గమనించగలం.

ఉన్నత రాజకీయ పదవుల్లోని స్త్రీలకు కూడా ఇది తప్పడం లేదు. దళిత స్త్రీ పరిస్థితి మరీ ఘోరం. దానిని ఆ కోణంలోనే పరిశీలించి చూడాలి. మొత్తంగా రాజ్యాంగం ప్రవచిస్తున్న, ప్రసాదిస్తున్న సర్వ సమానత్వ సూత్రం ఆచరణలో కనిపించకపోడం, రానురాను అది మరింత ప్రబలి సామాజికమైన గాఢాంధకారం అలముకోడం మతం రాజకీయాల్లో ఎప్పటి కంటె ఎక్కువగా ప్రాబల్యం చూపుతూ ఉండడం స్త్రీలకు మరింత కంటకప్రాయం అవుతున్నది. ప్రజాస్వామ్య పరిపాలనా విధానంతో పాటు జీవన శైలి కూడా పూర్తిగా తెరమరుగవుతూ ఉండడం మహిళలపై, దళిత స్త్రీలపై అణచివేతను విపరీతం చేస్తుంది. ఈ ప్రమాదాన్ని గమనించి అటు స్త్రీలు, ఇటు అణగారిన వర్గాలు సంఘటితం కావలసిన అవసరం ఎప్పటి కంటే ఎక్కువగా నేడున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News