Sunday, April 28, 2024

పారిశ్రామిక వాడలు, చుట్టుపక్కల పెరుగుతున్న వాయుకాలుష్యం

- Advertisement -
- Advertisement -

పలుచోట్ల ఏక్యూఐ 150కి పైగా నమోదు
అస్తమా, శ్వాసకోశ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు
ఔటర్ అవతలకు కాలుష్య కారక పరిశ్రమల
తరలింపు ముమ్మరం
నోటీసులు అందుకున్నా తరలించని యాజమాన్యాలపై
చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సమాయత్తం

Risk of dementia is higher with air pollution
మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రస్తుతం ఢిల్లీతో పాటు హైదరాబాద్‌లోనూ వాయుకాలుష్య తీవ్రత ఎక్కువగా ఉందని సిపిసిబి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో నివసించే ప్రజలు కాలుష్యం బారితో పలు శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో కూడా తలెత్తే పరిస్థితి ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరం చుట్టుపక్కల పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న 25 పరిశ్రమల అత్యంత కాలుష్యం వెదజల్లుతున్నాయని గతంలో చేసిన అధ్యయనంలో పిసిబి అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో గరిష్ట ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 150కి పైగా నమోదు అవుతున్నాయని, మాములుగా ఏక్యూఐ 100 దాటితే శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కాలుష్యం ఎక్కువగా విడుదల చేసే పరిశ్రమల్లో ఫార్మాతో పాటు పొగాకు, రసాయనాలు, రబ్బర్, ప్లాస్టిక్, మెటల్ ప్రాబ్రికేషన్, లేదర్ లాంటి పరిశ్రమలున్నాయని వీటితోనే కాలుష్యం అధికమయ్యిందని పిసిబి అధికారులు తమ అధ్యయనంలో తేల్చారు.

బూచనెల్లిలో 200 ఎకరాల స్థలం

కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ అవతలకు తరలించాలని గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో టిఎస్‌ఐఐసి దీనికి సంబంధించిన ఏర్పాట్లను సైతం చేస్తోంది. ముందుగా ఆయిల్ పరిశ్రమలను తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందులో భాగంగా ఆయా కంపెనీ యాజమాన్యాలకు సైతం నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న పలు కంపెనీల యజమానులు కోర్టుకు వెళ్లడంతో ప్రస్తుతం పరిశ్రమల తరలింపు నత్తనడకన సాగుతోంది. ఆయిల్ పరిశ్రమల కోసం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని బూచనెల్లికి 200 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో పాటు ఫార్మా కంపెనీలకు ఫార్మా సిటీలో స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం ప్రభుత్వం కల్పిస్తున్న వసతుల మేరకు రెండు సంవత్సరాలుగా 300ల నుంచి 400ల కంపెనీలు మాత్రం తమ కంపెనీలను ఔటర్ అవతలకు తరలించినట్టుగా పిసిబి అధికారుల గణాంకాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పరిశ్రమలను తరలించని యాజమాన్యాలపై కొరడా ఝుళిపించాలని ప్రభుత్వం భావిస్తోంది.

జీరో లిక్విడ్ డిశ్చార్జ్‌లను….

ముఖ్యంగా జీడిమెట్ల, బాలానగర్ పటాన్‌చెరు, యాదాద్రి జిల్లా చౌటుప్పల్ ప్రాంత వాసులు ఇక్కడ ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆయా ప్రాంతాల్లోని నీటి వనరులు సైతం రంగు మారిపోవడంతో త్రాగడానికి నీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. మాములుగా కాలుష్యం వెదజల్లే పరిశ్రమల్లో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (జెడ్‌ఎల్‌డి) లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడాన్ని తప్పనిసరి చేసినా యాజమాన్యాలు వాటిని తుంగలో తొక్కుతున్నారని పిసిబి అధికారులు సైతం కంపెనీలను తనిఖీలు చేయకపోవడంతో ఆయా పరిశ్రమల యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ ప్రాంతాల్లో గరిష్ట ఎయిర్ క్వాలిటీ

పలు పారిశ్రామిక వాడల్లో గాలి నాణ్యత కూడా తగ్గుతుండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గతంలో పిసిబి చేసిన అధ్యయనంలో పేర్కొంది. ముఖ్యంగా వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలుగా బాలానగర్, జీడిమెట్ల, పటాన్‌చెరు, చౌటుప్పల్ ప్రాంతాలున్నాయని పిసిబి అధికారులు పేర్కొంటున్నారు. జీడిమెట్ల, బాలానగర్, ఎద్దుమైలారం, బాచుపల్లి, చౌటుప్పల్ పారిశ్రామిక ప్రాంతాల్లో రెడ్, ఆరెంజ్ కేటగిరీకి సంబంధించి సుమారుగా 2,000ల వరకు పరిశ్రమలు ఉన్నాయని పిసిబి తన అధ్యయనంలో వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో గరిష్ట ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 150కి పైగానే నమోదు అవుతున్నాయి. మాములుగా ఏక్యూఐ 100 దాటితే శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయని అస్తమాతో ఊపిరితిత్తుల వ్యాధులతో చాలామంది ఆస్పత్రుల్లో చేరుతున్నట్టుగా వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం 385 పరిశ్రమలు ఓఆర్‌ఆర్ అవతలకు

ప్రస్తుతం 385 పరిశ్రమలు ఓఆర్‌ఆర్ అవతలకు తరలించగా మిగతావి ఆయా ప్రాంతాల్లోనే ఉన్నాయి. వీటి తరలించాలని ప్రభుత్వం ప్రయత్నించినా ఏదో రకంగా వారు ఈ ప్రాంతాలను వదిలి వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో పాటు కోర్టుల నుంచి ఆర్డర్‌లను తీసుకొచ్చి వాటిని తరలించకుండా మొండికేస్తున్నారని పిసిబి, టిఎస్‌ఐఐసి అధికారులు పేర్కొంటున్నారు.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాణాలు ఇలా…

పాయింట్లు కలర్ కేటగిరి ఆరోగ్యంపై ప్రభావం
0– నుంచి 50 గ్రీన్ గుడ్ అతి తక్కువ ప్రభావం
50 నుంచి 100 లైట్‌గ్రీన్ శాటిస్‌ఫ్యాక్టరీ సున్నితులపై స్వల్పంగా
100 నుంచి 200 ఎల్లో మోడరేట్ అస్తమా, గుండెజబ్బులున్న వారికి ఇబ్బంది
200 నుంచి 300 ఆరెంజ్ పూర్ శాస్వపరమై ఇబ్బందులు
300 నుంచి 400 లైట్ రెడ్ వెరీపూర్ శ్వాస పీల్చడంలో తీవ్ర ఇబ్బంది
400 నుంచి 500 రెడ్ సివియర్ ఆరోగ్యవంతులపై ప్రభావం

నగరంతో పాటు శివారు జిల్లాల్లో….

నగరంతో పాటు శివారు జిల్లాల్లో పిఎం 10 తో పిఎం 2.5 తీవ్రతలు ఎక్కువ అవుతున్నాయని సిపిసిబి గణాంకాల్లో వెల్లడయ్యింది. దీనివలన మనం పీల్చుకునే గాలిని ఉద్గారాలు కలుషితం చేయడమే కాదు ఆరోగ్యంపైన తీవ్ర దుష్ప్రభావాలు చూపుతున్నాయని పేర్కొంది. దాదాపు 40 రకాల ఉద్గారాలు నిత్యం గాలిలో విడుదలవుతుండడంతో వీటిలో ఓజోన్, నైట్రోస్ ఆక్సైడ్‌ల వలన పిఎం 10, పిఎం 2.5లు అధిక ప్రభావం చూపడంతో స్వచ్ఛమైన గాలిని దూరం చేస్తున్నాయని సిపిసిబి తమ అధ్యయనంలో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News