Sunday, April 28, 2024

ఎపిలో అల్ప‘పీడ’నం

- Advertisement -
- Advertisement -
Heavy rains in Andhra Pradesh for another two days
మరో రెండు రోజుల పాటు ఎడతెరిపిలేని వర్షాలు
ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్
కృష్ణా, గుంటూరు, ప.గో,తూ. గోలలో ఎల్లో అలర్ట్
నెల్లూరులో కేంద్ర బృందం పర్యటన

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఆదివారం నాడు రాష్ట్రానికి వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అండమాన్ సముద్రంలో సోమవారం నాడు ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో ఎపిలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ మేరకు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు ఎపిలోని గుంటూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఎపిలోని రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాల కారణంగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో పలు జిల్లాల కలెక్టర్లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షం ధాటికి కడప నగరంలోని అనేక ప్రాంతాలు మళ్ళీ జలమయమయ్యాయి. కడప కార్పొరేషన్ పరిధిలోని ఎన్‌జివొ కాలనీ, బాలాజీ నగర్, ఆర్టీసీ బస్టాండ్, అప్సరా సర్కిల్, శంకరాపురం, కోఆప్ రేటివ్ కాలనీ ప్రాంతాలు జలమయం అయ్యాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలలో ఎడతెరిపి లేకుండా వర్షా కురుస్తున్నాయి. అయితే వెంకటగిరి, కోవూరు నియోజకవర్గంలో ఓ మోస్తరుగా, సూళ్లూరుపేట, సర్వేపల్లి నియోజకవర్గాలలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో కూడా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. తిరుపతి, శ్రీకాళహస్తీ, సత్యవేడు, నగరిలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు

లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం 

వర్షాలు కురుస్తున్న క్రమంలో కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలోని లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లే అవకాశం ఉన్న చోట్ల రహదారులపై రాకపోకలను కట్టడి చేస్తున్నారు. నదులు, ప్రమాదకర రహదారులు ఉన్న చోట్ల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అటువైపుగా ఎవరూ వెళ్లకుండా చూస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే మొన్నటి వానలకు, వరదలకు తడిచిపోయిన పాతకాలం నాటి భవనాలు దెబ్బతింటాయనే ఆందోళన వ్యక్తం అవుతుంది. మరోవైపు మొన్నటి వర్షాలకు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కడప ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈసారి భారీ వర్షాలు పడితే నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, అలా జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

స్కూళ్లకు రెండు రోజుల సెలవు 

భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లాల్లో పాఠశాలలకు రెండు రోజుల పాటు అధికారులు సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా.. రాబోయే రెండు రోజుల్లో అవి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

నెల్లూరులో కేంద్ర బృందాల పర్యటన 

నెల్లూరు జిల్లాలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో రెండు కేంద్ర బృందాలు ఆదివారం పర్యటించాయి. దెబ్బతిన్న నిర్మాణాలు, రోడ్లు, పంటలు, ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నాయి. ఒక బృందం తిరుపతి నుంచి జిల్లాకు చేరుకోగా, మరో బృందం కడపలో పర్యటించింది. ఒక కేంద్ర బృందం నెల్లూరు జిల్లాలోని తూర్పు ప్రాంతాల్లో పర్యటించగా, రెండో బృందం పశ్చిమ ప్రాంతంలో పర్యటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News