Sunday, April 28, 2024

మహోగ్ర గోదావరి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రమంతటా కుండపోత వర్షాలు

ఆరేళ్ల తర్వాత మూడో ప్రమాద హెచ్చరిక జారీ
ఉప్పొంగుతున్న వాగులు, ప్రాజెక్టులకు జలకళ
కోయిల్‌సాగర్, మూసీ గేట్లు ఎత్తివేత లక్ష్మీ, సరస్వతి బ్యారేజీలకు పోటెత్తిన వరద,
దిగువకు గోదావరి ఉరకలు
ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎడతెరిపి లేని వానలు
పలు చోట్ల గ్రామాలకు రాకపోకలు బంద్, విద్యుత్ సరఫరాకు విఘాతం
పలుచోట్ల పంటలకు నష్టం, అక్కడక్కడ కూలిన ఇళ్లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇల్లు కూలి తల్లికూతుళ్ల మృతి

1102 New Corona Cases Registered in Telangana

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్టవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంతో ప్రభావిత జిల్లాల్లో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. జనజీవనం అస్త వ్యస్తమైంది. రోడ్లు ధ్వంసమయ్యాయి. గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. కుండపోత వర్షంతో పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయమేర్పడుతోంది. లోతట్టు ప్రాంత వాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. గోదావరి ఉగ్రరూపం దాల్చి ంది. భద్రాద్రి రామాలయం తూర్పు మెట్ల వరకు, భద్రాద్రి రామయ్య సన్నిధి అన్నదాత సత్రంలోకి వరదనీరు చేరింది. వరద నీటిలో కల్యాణకట్ట, స్నాన ఘట్టాలు మునిగాయి. భద్రాచలం కొత్తకాలనీ, ఎఎంసి కా లనీల్లోకి వరదనీరు చేరింది. ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నది ఆదివారం రాత్రికి ప్రమాదకర స్థాయి దాట వచ్చని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. ఈ మేరకు సీడబ్లూసి హెచ్చరికలు జారీ చేసింది. రాత్రి 9 గంటలకు ప్రమాదస్థాయిపైన నాలుగు అడుగుల మేర గోదావరి నది ప్రవాహం ఉండవచ్చని పేర్కొంది. ఆదివారం మధ్యాహ్నం 1.50 గంటలకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు కలెక్టర్ ఎంవీరెడ్డి ప్రకటించారు. ఇప్పటివరకు అత్యధికంగా వరద వచ్చే 53 అడుగులకు చేరింది. భద్రాచలంలో ప్రధాన రహదారులపైకి వరదనీరు పారుతోంది. భద్రాచలం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయా యి. 2014 తర్వాత మళ్లీ ఆరేళ్లకు మళ్లీ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రోజుల తరబడి ఆగకుండా కురుస్తున్న వర్షం కారణంగా పంట పొలాలు నీట మునిగాయి. పలు చోట్ల వరినాట్లు మునిగిపోయాయి. పత్తి, కంది, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఆ రెండు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మరో మూడు రోజుల పాటు వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నందున రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యాచరణపై దిశానిర్దేశన చేశారు. వరంగల్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించామని మంత్రి పేర్కొన్నారు. గోదావరి తీర ప్రాంతం అప్రమత్తం చేశామన్నారు. వరంగల్‌కు జాతీయ విపత్తుల నివారణ టీమ్‌లను రప్పిస్తున్నామని చెప్పారు. ఎమర్జెన్సీ అవసరాలకు సిద్ధంగా లైఫ్ జాకెట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఉమ్మడి జిల్లాల్లోని అన్ని రకాల రవాణా మార్గాలను మూసివేసే దిశగా ఆలోచిస్తున్నామని స్పష్టం చేశారు. మరోవైపు ప్రజలెవరూ ఇళ్లు విడిచి బయటకు రావొద్దని, వ్యవసాయ పనులు, చేపల కోసం రైతులు, జాలర్లు వెళ్లొద్దని హెచ్చరించారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టామన్నారు. వరంగల్ కార్పొరేషన్‌లో అదనంగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టామన్నారు. వర్షాలు తీవ్రత తగ్గే వరకు మంత్రులు, ఎంఎల్‌ఎలు ఎవరరి నియోజకవర్గాల్లో వారే ఉండి.. సమీక్షలు నిర్వహించాలని సూచించారు. తాను వరంగల్, మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ కేంద్రంగా అన్ని వేళలా అందుబాటు లో ఉంటామని మంత్రి తెలిపారు. మరోవైపు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎడతెరపిలేని వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతు న్నాయి. కోయిల్ సాగర్, రంగ సముద్రం, శంకర సముద్రం, రామన్‌పాడు, సంగం బండ జలాశయాలు నిండటం వల్ల గేట్లు ఎత్తివేసి నీళ్లు విడుదల చేస్తున్నారు. సరళాసాగర్‌లో ఆదివారం తెల్లవారుజామున సైఫన్లు తెరుచుకుని దిగువకు నీళ్లు విడుదల అవుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా ఇల్లు కూలి తల్లి కూతుళ్లు కోటమ్మ(80), బుజ్జమ్మ(5౦)లు మృత్యువాత పడ్డారు. శిధిలావస్థకు చేరిన ఇళ్లలోని ప్రజల్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

మరోవైపు నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని సంగంబండ రిజర్వాయర్ నుంచి సైతం రెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. రంగ సముగ్రం జలాశయం నిండటం వల్ల ముంపు గ్రామమైన నాగరాల ఇళ్లలోకి నీరు చేరింది. పంట పొలాలు మునిగిపోయాయి. శంకర సముద్రం జలాశయం నిండటం వల్ల మూడు గేట్లను అడుగున్నర పైకెత్తి 1,700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కోయిల్‌సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 32.9 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 32.6 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో రెండు వేల క్యూసెక్కులు ఉండటం వల్ల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దుంధుభి వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల రఘుపతి పేట వద్ద రాకపోకల్ని నిలిపేశారు. అక్కడ వాగులో బస్సు చికక్కుకుంది. కొల్లాపూర్ మండలంలో ముక్కడిగుంండం వాగు వల్ల నార్లాపూర్ ముక్కినగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షాల ప్రభావంపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. చేపట్టాల్సిన చర్యలపై యంత్రాంగానికకి దిశానిర్దేశనం చేశారు. కూలెందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లను ఖాళీ చేయించాలని, వారిని సురక్షిత ప్రాంతాలకకు తరలించాలని, నిండిన చెరువుల వద్ద జెసీబీలను సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజాప్రతినిధులను సైతం భాగస్వాముల్ని చేసుకుని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్ధేశించారు. జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 13 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 99,000 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,23,670గా ఉండగా పూర్తిస్థాయి నీటి సామర్థం 9.65 టిఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ 8.53 టిఎంసీలు. సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. భారీగా వరద పోటెత్తడంతో మూసి నిండుతోంది. దీంతో ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి వేసే అవకాశం ఉంది. మూసీ పరివాహ ప్రాంత గామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Heavy water floods in Telangana due to Rains

నల్గొండ, సూర్యాపేట వాసులు నది, వాగుల్లోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. పూర్తి సామర్థం 4.46 టిఎంసీలు, ప్రస్తుత నీటి మటటం 3.79 టీఎంసీలు. ఇన్‌ఫ్లో 6,832 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 145 క్యూసెక్కులుగా ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలో లక్ష్మీ(మేడిగడ్డ), సరస్వతి(అన్నారం( బ్యారేజీల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి శనివారం రాత్రి భారీగా వరద పెరగడంతో.. ఇప్పటికే 57 గేట్లు ఎత్తి ఉంవడగా.. ఆ సంఖ్యను 65కు పెంచారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. అత్యధికంగా మోపాల్‌లో 7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. చందూర్, ఇందల్వాయి, నిజామాబాద్ రూరల్‌లో 4 సెంమీగా ఉంది. మరో మూడు రోజుల పాటు భారీ వర్ష సూచనతో అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్‌లో 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. గత నాలుగురోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులలోకి 35 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, సుమారు 1077 అడుగుల వరకు వరదనీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 43 టిఎంసీల నీరు నిల్వ ఉంది. లక్ష్మీసరస్వతి కాలువ ద్వారా పొలాలకు నీరు విడుదల చేస్తున్నారు. వరద ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలోని మున్నేరువాగు కూడా వరదనీటితో నిండిపోయింది. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 34 ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరికొన్ని పాతగృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని 25 చెరువులు పూర్తిగా జలకళను సంతరించుకోగా.. మరో 75కు పైగా చెరువుల్లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని కలెక్టరేట్‌లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న నీటి ప్రవాహం
ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా నాగార్జునసాగర్ జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 42,378 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయానికి గత 20 రోజుల నుంచి నీటి ప్రవాహం నిలకడగా వస్తుండటం వల్ల నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 566.70 అడుగులకు చేరుకుంది.
జలవనరుల శాఖ నిరంతర పర్యవేక్షణ
వర్షాలు, వరదల పరిస్థితిని జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. జిల్లా అధికారులు, ఇంజనీర్లతో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రంజత్‌కుమార్ క్షేత్రస్థాయి పరిస్థితులను ఆరా తీస్తున్నారు. గోదావరి నదిలోకి భారీగా వరద చేరుతున్న నేపథ్యంలో అధికారులు, ఇంజినీర్లను పూర్తి అప్రమత్తం చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లాకు ప్రత్యేకంగా నీటిపారుదల అధికారిని నియమించారు. పరిస్థితుల పర్య వేక్షణ కోసం దేవాదుల చీఫ్ ఇంజినీర్‌ను ములుగు వెళ్లాలని ఆదేశించారు. హైదరాబాద్ జలసౌధలో 24 గంటల పాటు పనిచేసేలా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. చీఫ్ ఇంజీనర్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నట్లు రజత్‌కుమార్ వెల్లడించారు.
హుస్సేన్ సాగర్‌లో వరద.. అప్రమత్తం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 513.64 మీటర్లకు చేరింది. ఫలితంగా అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు అలుగులు, ఒక తూము ద్వారా నీటిని వదులుతున్నారు.

Heavy water floods in Telangana due to Rains

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News