Sunday, May 5, 2024

దేశంలో 50 వేలకు చేరువలో కరోనా మరణాలు

- Advertisement -
- Advertisement -

 గడచిన 24 గంటల్లో 944 మంది మృతి
 63,490 కొత్త పాజిటివ్ కేసులు
 26 లక్షలకు చేరువలో మొత్తం కేసులు
 72 శాతానికి పెరిగిన రికవరీ రేటు

944 people died with Corona in 24 hours in India

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు కలవర పెడుతోంది. నిత్యం వేల సంఖ్యలో కొత్తగా వైరస్ బారిన పడుతూ ఉండడంతో పాటుగా మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా నిత్యం దాదాపు వెయ్యి మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 944 మంది ఈ వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో ఆదివారం నాటికి దేశంలో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 49,980కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇక పాజిటివ్‌ల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ నెల 7వ తేదీనుంచి ప్రతి రోజూ 60 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒక్క 11వ తేదీ మాత్రమే 53,601 కేసులు నమోదయ్యాయి. కాగా శనివారం ఒక్క రోజే 63,490 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్త కరోనా కేసుల సంఖ్య 25,89,682కు చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు 18, 62,258 మంది వైరస్‌నుంచి పూర్తిగా కోలుకోగా, మరో 6,77.444 యాక్టివ్ కేసులున్నాయి.

అయితే గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతున్నా అదే స్థాయిలో రికవరీలు కూడా పెరుగుతుండడం ఊరటనిస్తున్న అంశం. శనివారం కూడా దాదాపు 53 వేల మంది వైరస్‌నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు దాదాపు 72 శాతానికి పెరగ్గా, మరణాల రేటు 1.93 శాతానికి తగ్గిపోయిందని ఆ శాఖ తెలిపింది. మరణాల రేటు ప్రపంచంలోనే అతి తక్కువ అని కూడా ఆ శాఖ తెలిపింది. అమెరికాలో 23 రోజుల్లోనే మరణాలు 50 వేలను దాటగా, బ్రెజిల్‌లో 95 రోజుల్లో, మెక్సికోలో 141 రోజులకు మరణాలు ఆ సంఖ్యకు చేరుకున్నాయి. అదే భారత్‌లో మరణాలు 50 వేల స్థాయికి చేరుకోవడానికి 156 రోజులు పట్టిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పెద్ద ఎత్తున టెస్టులు నిర్వహించడంతో పాటుగా పాజిటివ్ రోగులను గుర్తించి సకాలంతో తగు చికిత్సను అందించడం వల్లనే ఇది సాధ్యమయిందని తెలిపింది. ఇదిలా ఉండగా దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,93,09,703 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని, శనివారం ఒక్క రోజే 7,46,608 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) తెలిపింది.

కాగా శనివారం సంభవించిన మరణాల్లో ఒక్క మహారాష్ట్రలోనే 322 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో చనిపోయిన వారి సంఖ్య 19,749కి చేరుకుంది. కాగా తమిళనాడులో 127 మం ది, కర్నాటకలో 114 మంది చనిపోయారు. దీంతో తమిళనాడులో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 5,641కి చేరుకోగా, కర్నాటకలో 3,831కి చేరుకుంది. కాగా ఒకప్పుడు మహారాష్ట్ర తర్వాత కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఢిల్లీలో ప్రస్తుతం ఉధృతి గణనీయంగా తగ్గింది. శనివారం అక్కడ కేవలం 10 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఢిల్లీలో మొత్త మరణాల సంఖ్య 3,831కు చేరుకుంది. 2000కు పైగా మరణాలు సంభవించిన రాష్ట్రాల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, యుపి, పశ్చిమ బెంగాల్‌లు ఉన్నాయి.
12,290 మంది మహారాష్ట్ర పోలీసులకు కరోనా
కాగా మహారాష్ట్రలో కరోనా కష్టకాలంలోనూ అలుపెరగకుండా సేవలందిస్తున్న పోలీసులు సైతం పెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 12,290 మంది పోలీసులకు కరోనా సోకగా, 125 మంది మృత్యువాత పడ్డారు. శనివారం ఒక్క రోజే 303 మంది పోలీసులకు కరోనా నిర్ధారణ అయింది. ఒకరు చనిపోయారు. ఇప్పటివరకు 9,850 మంది పోలీసులు వైరస్‌నుంచి కోలుకోగా, మరో 2,315 మంది చికిత్స పొందుతున్నారని రాష్ట్ర పోలీసు శాఖ తెలియజేసింది.

944 people died with Corona in 24 hours in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News