Sunday, April 28, 2024

పార్లమెంట్ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

 భౌతిక దూరం పాటించేలా సభ్యులకు సీటింగ్
 తొలిసారిగా ఉభయసభల్లో సభ్యులకు ఏర్పాట్లు
 చాంబర్‌తో పాటుగా గ్యాలరీల్లోను సభ్యులు కూర్చునే వీలు
 విడివిడిగా లోక్‌సభ, రాజ్యసభ భేటీలు
 చర్చల్లో పాల్గొనడానికి వీలుగా భారీడిస్‌ప్లే స్క్రీన్లు
 రేడియేషన్ పద్ధతిలో వైరస్‌ను హతమార్చేందుకు ఏర్పాట్లు
 మూడో వారానికల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య ఆదేశాలు

Special Seating Arrangements for Parliament MeetingsSpecial Seating Arrangements for Parliament Meetings

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ పార్లమెంటు వర్షాకాల సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమావేశాలకు సిద్ధమవుతున్న రాజ్యసభ సచివాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి పార్లమెంటు సమావేశాల కోసం తొలిసారిగా అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రాజ్యసభ ఎంపీలకు లోక్‌సభలో సీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆగస్టు మూడో వారం నాటికల్లా పూర్తి చేయాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆదేశాలు ఇచ్చారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు చివరివారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సమావేశాలు జరిగే సమయంలో రాజ్యసభ సభ్యులు అటు చాంబర్‌తో పాటుగా గ్యాలరీలలో కూడా కూర్చుంటారని రాజ్యసభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. 1952 తర్వాత భారత పార్లమెంటు చరిత్రలో ఇలాంటి ఏర్పాటు జరగడం ఇదే మొదటిసారి. భౌతిక దూరాన్ని పాటిస్తూ సీటింగ్ ఏర్పాట్లు చేస్తూ ఉన్న కారణంగా రాజ్యసభలో 60 మంది సభ్యులు చాంబర్‌లో, మరో 51 మంది సభ్యులు గ్యాలరీల్లోను కూర్చుంటే, మిగతా 132 మంది సభ్యులు లోక్‌సభలో కూర్చుంటారు. లోక్‌సభ సెక్రటేరియట్ కూడా ఇలాంటి ఏర్పాట్లే చేస్తోంది. మొట్టమొదటిసారిగా సభలో భారీ డిస్‌ప్లే స్క్రీన్లతో పాటుగా గ్యాలరీల్లో కూర్చునే వారి కోసం చిన్న స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా రేడియేషన్ పద్ధతిలో అల్ట్రా వయలెట్ కిరణాలు ప్రసరింపజేసి వైరస్‌ను హతమార్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

జూలై 17న జరిగిన సమావేశంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలు పార్లమెంటు సమావేశాల నిర్వహణకున్న వివిధ అవకాశాలను పరిశీలించి ఉభయ సభల చాంబర్లు, గ్యాలరీలను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ఆగస్టు మూడో వారానికల్లా సమావేశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లును పూర్తి చేయాలని వెంకయ్యనాయుడు అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత టెస్టింగ్, రిహార్సల్, తుది ఇన్‌స్పెక్షన్ చేపడతారు. పూర్తి సన్నద్ధత ఉండేలా చూడడం కోసం రాజ్యసభ సెక్రటేరియట్ గత రెండు వారాలుగా అహోరాత్రాలు శ్రమిస్తోంది. సాధారణంగా పార్లమెంటు ఉభయ సభలు ఏకకాలంటో పని చేస్తుంటాయి. అయితే ఈ సారి మాత్రం ఒక సభ ఉదయం జరిగితే మరో సభ సాయంత్రం జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతి రోజు నాలుగు గంటల పాటు సమావేశాలు జరుగుతాయి. దాదాపు రెండువారాలపాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఆరునెలకోసారి తప్పనిసరిగా పార్లమెంటు సమావేశాలు జరగాల్సి ఉందని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా కారణంగా గత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను మార్చి23న నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో నిబంధనలకు అనుగుణంగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. కాగా పార్లమెంటు సమావేశాలకు సంబంధించి స్పష్టమైన షెడ్యూల్ ఇంకా వెల్లడి కాలేదు.

Special Seating Arrangements for Parliament Meetings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News