Saturday, April 27, 2024

వరద గుప్పిట్లో వరంగల్

- Advertisement -
- Advertisement -

 లోతట్టు ప్రాంతాలు జలమయం, ధ్వంసమైన రోడ్లు
 దెబ్బతిన్న తాగునీటి, విద్యుత్ వ్యవస్థలు
 సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రులు ఎర్రబెలి, సత్యవతి రాథోడ్, ఇతర ప్రజాప్రతినిధులు
 వాతావరణ సూచన మేరకు ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిక 
 టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు

Heavy water floods in Telangana due to Rains

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వరదల్లో చిక్కుకుంది. ఎంతో అభివృద్ధి చెందిన వరంగల్ మహానగరంతో పాటు దాని చుట్టూ ఉన్న జిల్లాలు అటవీ ప్రాంతాలు భారీ వ ర్షాలకు విలవిలలాడిపోతున్నాయి. ఒకేరోజు 15 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కావడం కుండతో కుమ్మరించినట్లవుతుంది. ఎటు చూ సినా వరద జలాలు పోటెత్తి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు, మైదాన ప్రాంతాలన్ని వరదనీటితో నిండిపోయాయి. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌లు ఎక్కడికక్కడే అధికారులను అలర్ట్ చేసి ఆదివారం ఉదయం నుండి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. స్థానిక ఎంఎల్‌ఎలు నిద్రహారాలు మాని ఎక్కువ నష్టం జరగకుండా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులను కో ఆర్డినేట్ చేసుకొని వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ఒడ్డుకు చేర్చి వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని పోతననగర్, సమ్మయ్యనగర్, దీన్‌దయాల్‌నగర్, కాజీపేట, వరంగల్ హంటర్‌రోడ్డు, హన్మకొండ తదితర ప్రాంతాల్లోని ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, వరంగల్ తూర్పు ఎంఎల్‌ఎ నన్నపునేని నరేందర్‌లు స్థానిక కార్పొరేటర్లతో సహాయక చర్యలను చేపట్టారు.

పోలీస్ శాఖ నుండి సిపి ప్రమోద్‌కుమార్ నేతృత్వంలో పోలీ స్ కమిషనరేట్ పరిధిలోని డిసిపి, ఎసిపి, సిఐలు, ఎస్సైలు పెద్ద ఎత్తున సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వరంగల్ రూరల్ జిల్లాలో కలెక్టర్ హరిత, నర్సంపేట ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ముంపు ప్రాంతాలైన ఎన్‌టిఆర్‌నగర్, మాదన్నపేట, చెరువు, రంగాయచెరువు, పాకాల సరస్సుల పరిస్థితులను పరిశీలించి తెలుసుకున్నారు. ములుగు జిల్లాలో అక్కడి కలెక్టర్‌తో పాటు జడ్పి చైర్మన్ కుసుమ జగదీష్, స్థానిక ఎంఎల్‌ఎ సీతక్కలు, ములుగు, మేడారం, పస్రా, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు, నూగూరు వెంకటాపురం మండలాల పరిధిలో గోదావరి ఉధృతికి ముంపు ప్రాంతాల బాధితులను ముందస్తుగానే ఆదివారం ఉదయం సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. వారికి కావాల్సిన ఆహార సౌకర్యాలను సమకూర్చారు.

భూపాలపల్లి జిల్లాలో ఎంఎల్‌ఎ గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. చిట్యాల, టేకుమట్ల, భూపాలపల్లి, కాటారం, మహదేవ్‌పూర్, రేగొండ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్‌తో సమీక్ష నిర్వహిస్తూ అవసరమైన మేరకు వరదలో చిక్కుకున్న వారికి దమ్ము ట్రాక్టర్లను పంపించి సహాయక చర్యలను చేపట్టారు. మహబూబాబాద్ జిల్లాలో కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల మండలాల్లో వర్షపాతం అధికంగా నమోదు కావడం అక్కడే వరదలు ముంచెత్తాయి. ఈ వరదలతో ఎక్కడికక్కడే జనజీవనం స్తంభించిపోగా గార్ల, బయ్యారం, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి సత్యవతిరాథోడ్ పర్యటించి ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. జనగాం జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎంఎల్‌ఎ రాజయ్యతో పాటు పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జనగాం జిల్లా వరదల ముంపుపై సమీక్షను నిర్వహించారు. అక్కడి నుండి నేరుగా వరంగల్ జిల్లా కేంద్రానికి చేరుకొని వాడవాడలు తిరుగుతూ వరద ముంపు నష్టం అంచనాలపై వరదలోనే పాదయాత్రలను నిర్వహిస్తూ ప్రజలతో మమేకమైపోయారు. వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను కలిసి మంత్రి ఓదార్చారు. స్థానిక ఎంఎల్‌ఎలు దాస్యం వినయభాస్కర్, నన్నపునేని నరేందర్‌లతో ఎక్కడికక్కడే సమీక్షలను నిర్వహించారు.
వర్షం తగ్గినా.. ఆగని వరదలు..
వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం నుండి వర్షం కొంత మేరకు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికి వరదలు మాత్రం ముంచెత్తుతూనే ఉన్నాయి. ఆదివారం తెల్లవారు జాము వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. ఆవర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగడమే కాక నివాస గృహాల్లోని వీధులన్ని వాగులుగా మారిపోయాయి. నాలుగు గంటల పాటు వర్షం కురియకపోవడంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నా ఆదివారం సాయంత్రం నుండి వర్షం మళ్లీ ప్రారంభమైంది.
సహాయక చర్యల్లో మంత్రులు
ఆదివారం భారీ వర్షాల నుండి ఉపశమనం కలుగుతుందనుకుంటే మళ్లీ వర్షం కొనసాగుతూనే ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆ మేరకు జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లు మరో మూడురోజుల పాటు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని టోల్‌ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేస్తూ అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అలర్ట్ చేశారు. సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలతో పిడుగుపాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ఎక్కువగా బయటకు రావొద్దని హెచ్చరికలు చేశారు. ఇదిలా ఉంటే గత నాలుగైదు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో కూరగాయలు, నిత్యావసర సరుకులకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ధ్వంసమైన తాగునీటి, విద్యుత్ వ్యవస్థలు..
భారీవర్షాలకు ఉమ్మడి జిల్లాలో కనివిని ఎరుగని నష్టాన్ని చవిచూస్తున్నట్లవుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగాయి. పట్టణాలతో పాటు పల్లెల్లో తాగునీటి కోసం మిషన్‌భగీరథ లాంటి సౌకర్యాలను మోటార్లతో ఏర్పాటు చేశారు. వరదలు ముంచెత్తడంతో తాగునీటి బావులు, మోటార్లన్ని వరదలోనే మునిగిపోయాయి. తాగునీటి సరఫరాకు ఉపయోగించే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఎక్కడికక్కడే నీటిలో మునిగిపోయి రెండు వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం తాగునీటి సరఫరా ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకపక్క వరదలు ముంచెత్తుతున్న నల్లాల ద్వారా తాగునీటి సరఫరా లేకపోవడం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది.
లక్షలాది ఎకరాలను ముంచేసిన వరదలు.. ఎక్కడికక్కడే గండ్లు పడ్డ రోడ్లు..
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ముంచెత్తి పంట చేలన్ని వరదలు కమ్మేశాయి. వరిపంటతో పాటు మెట్టపంటలైన పసుపు, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలన్ని వరదలోనే మునిగిపోయాయి. భారీ వరదలు వచ్చిన చోట పంటలపై ఇసుక మేటలు కమ్మేశాయి. ఎక్కడ చూసినా ముంచెత్తిన వరద నీరు తప్ప పంటల ఆనవాళ్లు కనిపించడం లేదు. చిన్నచిన్న వాగుల నుండి వచ్చిన వరదలు సైతం పంట భూములను కోతకు గురిచేశాయి. డాంబర్‌రోడ్లు, గ్రామాల్లోని మట్టి, మెటల్‌రోడ్లన్నీ కూడా వరదల తాకిడికి ఎక్కడికక్కడే కొట్టుకుపోయి గండ్లు పడ్డాయి. నాలుగు రోజుల నుండి వరదలు భీకరంగా ముంచెత్తడంతో ప్రధాన రహదారులకు అడ్డంకిగా మారాయి. గ్రామాలు జలదిగ్భందంలో ఇప్పటికే చిక్కుకోగా వరదలు తగ్గుముఖం పట్టినా గండ్లు పడ్డ రోడ్లతో ఒకటి రెండు రోజుల వరకు రవాణ మెరుగుపడే పరిస్థితులు కూడా కనిపించడం లేదు.

Heavy inflow in Warangal due to Rain

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News