Sunday, May 5, 2024

మేదరి కులస్తులకు చేయూతనివ్వాలి

- Advertisement -
- Advertisement -

Medari caste

 

హైదరాబాద్ : మేదరి కులస్తులకు చేయుతనివ్వాలని కోరుతూ ఆ సంఘం ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో వినోద్‌కుమార్ ను కలిసి మేదరి కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆ సంఘం ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెదురునే ప్రధానంగా జీవనాధారం చేసుకొని జీవనం సాగిస్తున్న మేదరులను ప్రోత్సహించాలని, వృత్తి పరంగా కీలకమైన వెదురు ముడి సరుకును రాయితీపై అందించేలా చర్యలు తీసుకోవాలని ఆ సంఘం ప్రతినిధులు వినోద్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. మారుతున్న కాలానుగుణంగా మేదరులకు వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆ సంఘం ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

మార్కెట్‌ను అనుసరించి నూతన పరిజ్ఞానంతో కొత్త విధానాలు అమలు చేసి వినూత్న రూపాల్లో ఉత్పత్తులు తయారు చేసేందుకు మేదరులకు తగిన తర్ఫీదు ఇవ్వాలని వారు పేర్కొన్నారు. మేదరుల సంఘం ప్రతినిధులు పేర్కొన్న అంశాలపై స్పందించిన బోయినపల్లి వినోద్ కుమార్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి లేఖ రాశారు. మేదరుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. మేదరులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని వినోద్‌కుమార్ ఈ సందర్భంగా హామీనిచ్చారు. ఈ ప్రతినిధి బృందంలో మేదరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. వెంకట్రాముడు, ప్రధాన కార్యదర్శి కె. మురళీకృష్ణ, ప్రచార కార్యదర్శి ఎం. గంగాధర్, కోశాధికారి పి. హన్మంత్, హస్తకళల విభాగం పి.సత్యదేవ్, తదితరులు పాల్గొన్నారు.

Helping for Medari caste
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News