Tuesday, April 30, 2024

సుప్రీంకోర్టుకు చేరిన హిజాబ్ వివాదం

- Advertisement -
- Advertisement -
Hijab controversy reached the Supreme Court
లిస్టింగ్ పరిశీలిస్తామన్న చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ

న్యూఢిల్లీ: కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదం చివరికి సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పటికే ఈ వివాదంపై కర్నాటక హైకోర్టు విచారణ జరుపుతుండగా..తాజాగా ఈ అంశంపై జోకం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. ముఖ్యంగా కర్నాటక హైకోర్టులో హిజాబ్ వివాదంపై నడుస్తున్న కేసులను సుప్రీంకు బదిలీ చేసుకోవాలని దాఖలయిన పిటిషన్‌ను స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం..లిస్టింగ్ అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. అయితే ప్రస్తుతం కర్నాటక హైకోర్టులో విచారణకొనసాగుతున్నందున .. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పిటిషనర్‌కు సూచించింది. హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టులో ఉన్న కేసులను బదిలీ చేసుకోవడంతో పాటుగా తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది.

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.‘ ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. అమ్మాయిల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ వివాదం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది’ అని సిబల్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనిపై ప్రస్తుతం ఎలాంటి ఆదేశాలను కోరుకోవడం లేదని, కేవలం తమ విజ్ఞప్తిని లిస్టింగ్ చేసుకోవాలని మాత్రమే కోరుతున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ ‘ అలాగే.. పరిశీలిస్తాం’ అని పేర్కొన్నారు. అయితే ఇప్పుడే ఈ కేసును సుప్రీంకోర్టులో లిస్టింగ్ చేస్తే కర్నాటక హైకోర్టులో విచారించే అవకాశముండదని అన్నారు.‘ ప్రస్తుతం ఈ కేసును హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ సమయంలో మేము ఏమీ చేయలేం.అత్యవసరంగా ఈ కేసును టేకప్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడే దీనిలో జోక్యం చేసుకోలేం. హైకోర్టులో త్రిసభ్య ధర్మాసనం దీన్ని విచారిస్తోంది. అక్కడ విచారణ జరగనివ్వండి. హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం’ అని న్యాయమూర్తులు ఎఎస్ బొపన్న, హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించింది. అయితే సిబల్ మళ్లీ మళ్లీ కోరడంతో పిటిషన్‌ను లిస్టింగ్ చేసే అంశాన్ని పరిశీలిస్తామని బెంచ్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News