Saturday, April 27, 2024

పాకిస్థాన్ ఆసుపత్రుల్లో మందులకు కటకట

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ఇప్పుడు ఆసుపత్రులలో రోగులకు అవసరమైన మందులు లేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. దేశంలో కొనసాగుతోన్న ఆర్థిక సంక్షోభం ఇప్పటికే పలు రంగాలను దెబ్బతీసింది. ఆహార ధాన్యాల సరఫరాలకు గండిపడింది. ఇప్పుడు ఆసుపత్రులకు వచ్చే రోగులకు సరైన ఔషధాలు, ఇంజిక్షిన్లు , చివరికి అవసరం అయిన బ్లడ్ కూడా లేకపోవడంతో వారే కాకుండా బంధువులు కూడా తల్లడిల్లుతున్నారు. పలు ఆసుపత్రులలో వైద్య పరికరాలు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక మాంద్యం కారణంగా స్థానిక ఔషధకంపెనీలు మందుల తయారీ కోటాను గణనీయంగా తగ్గించుకున్నాయి. దీనితో అత్యవసర, నిత్యావసర ఔషధాలకు కొరత ఏర్పడింది. చివరికి ఆసుపత్రులలో ఆపరేషన్లలో వాడే అనస్తేషియా నిల్వలు హరించుకుపోతున్నాయి. పలు చోట్ల ఈ పరిణామంతో డాక్టర్లు తాము ఆపరేషన్లు చేయలేమని అశక్తత చాటారు. అత్యవసర ప్రాతిపదికన చేయాల్సిన గుండె, కిడ్నీ కాలేయ ఆపరేషన్లను కూడా నిలిపివేయాల్సి వస్తోంది.

ఆసుపత్రులు చివరికి మూతపడే పరిస్థితి ఏర్పడుతోంది. ఆసుపత్రులలో కేవలం రెండు వారాల అనస్తేషియా నిల్వలే మిగిలాయి. మారుమూల ప్రాంతాలలో ఇది పూర్తిగా లేకపోవడంతో దారుణ పరిస్థితి ఏర్పడింది. పాకిస్థాన్‌లో ఔషధ పరిశ్రమ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడే మనగల్గుతోంది. ఇతర దేశాల నుంచి వచ్చే ముడిపదార్థాలతోనే మందుల తయారీకి వీలుంది. అయితే విదేశీ మారకద్రవ్య సమస్యలు , బ్యాంకింగ్ వ్యవస్థలో అవసరం అయిన డాలర్లు లేకపోవడంతో విదేశాల నుంచి వచ్చిన సరుకు చాలా వరకూ రేవుపట్టణాలలోనే క్లియరెన్స్ లేకుండా పడి ఉంటోంది. ఆర్థిక వ్యవస్థలో లోపాలే ఇప్పటి సంక్షోభానికి కారణం అని , వాణిజ్య బ్యాంకులు తమకు అవసరం అయిన లెటర్స్ ఆఫ్ క్రెడిట్లను జారీ చేయడం లేదని డ్రగ్గ్ తయారీదార్లు తెలిపారు.

పాకిస్థాన్‌కు ఎక్కువగా ఔషధ ముడిపదార్థాలు ఇండియా , చైనా నుంచే వస్తాయి. అయితే సరుకు ఇప్పుడు ఎక్కువగా కరాచీ రేవులో నిలిచిపోయి ఉంది. రోజుల తరబడి ముడిపదార్థాలు రేవుల్లో లంగర్ నౌకల్లో ఉండటంతో తయారీదార్లకు అవసరం అయిన సరుకు రాకపోవడం ఉత్పత్తి తగ్గిపోవడం, నిల్వలు హరించుకుపోవడంతో దేశంలో వైద్య అత్యయిక స్థితి ఏర్పడుతోంది. చాలా రోజుల క్రితమే పాకిస్థాన్ వైద్య మండలి (పిఎంఎ) ఔషధ కొరత దాపురిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పరిస్థితిని విశ్లేషించుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే మందుల కొరత ఏర్పడుతుందని తెలిపింది. అయితే నిల్వలు విషయాలు పరిశీలించుకుని తరువాత చర్యలు తీసుకుంటామని అధికారులు చెపుతూ రావడంతో ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News