Friday, March 29, 2024

ప్రభుత్వం నుంచి నేను సెంటు భూమి పొందలేదు

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : ప్రభుత్వం నుంచి తాను సెంటర్ భూమి కూడా పొందలేదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మంలో పలు సొసైటీలు, స్కూళ్ళతో పాటు కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్‌తో సహా అనేక సంస్థలకు ఎన్‌ఎస్‌పి భూములు, అసైన్మెంట్ స్థలాలను ప్రభుత్వం పలు సందర్భాల్లో క్రమబద్ధీకరించిందన్నారు. 1994లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తన నివాసానికి క్వార్టర్స్ కేటాయించారని, నాటి నుంచి నేటి వరకు తను పన్ను చెల్లిస్తూ వస్తున్నానే తప్ప రెగ్యులరైజ్ కాలేదని స్పష్టం చేశారు.

అవగాహన లేని కొందరు వ్యక్తులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ దుష్ప్రచారం చేయడం బాధాకరం అంటు తాను ఇటీవల చెల్లించిన పన్ను రశీదును విలేకరులకు చూపించారు. సోయి తప్పి మాట్లాడే నాయకులకు కాలమే సరైన సమాధానం చెబుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేళ్ళు పూర్తయి 10 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఒక్కోరోజు ఒక్కో ప్రభుత్వ శాఖ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసే విధంగా కార్యచరణ రూపొందించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని కొత్తూరు రైతు వేదిక నుంచి కాకర్లపల్లి రైతు వేదిక వరకు ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి, రైతులకు సహ పంక్తి భోజనాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యచరణను నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల్లో ఒక్కో రోజు ఒక్క మండలంలో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, కౌన్సిలర్లు మట్ట ప్రసాద్, గ్రాండ్ మౌలాలి, అద్దంకి అనిల్, దొడ్డ ప్రవీణ్, రఘు, నాయకులు అమరవరపు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News