Saturday, May 4, 2024

బోణీ అదిరింది..

- Advertisement -
- Advertisement -

బోణీ అదిరింది.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం
రాణించిన ధావన్, కోహ్లి, చెలరేగిన కృనాల్, రాహుల్

ప్రసిద్ధ్ మ్యాజిక్, శార్దూల్ మాయ.. బెయిర్‌స్టో శ్రమ వృథా

India win by 66 Runs in 1st ODI against England

పుణె: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలోఆతిథ్య భారత్ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్ కోహ్లి సేన 10 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 317 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం చవిచూసింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు, శార్దూల్ ఠాకూర్ మూడు, భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, జాసన్ రాయ్‌లు కళ్లు చెదిరే ఆరంభాన్ని అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. ఇటు రాయ్, అటు బెయిర్‌స్టో చెలరేగి పోవడంతో ఇంగ్లండ్‌కు కళ్లు చెదిరే శుభారంభం లభించింది. ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన బెయిర్‌స్టో భారత బౌలర్లను హడలెత్తించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. ఇదే క్రమంలో రాయ్‌తో కలిసి 14.2 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 135 పరుగులు జోడించాడు. ధాటిగా ఆడిన రాయ్ 35 బంతుల్లోనే ఏడు ఫోర్లు, సిక్స్‌తో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన బెయిర్‌స్టో 66 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, మరో ఆరు ఫోర్లతో 94 పరుగులు చేసి ఠాకూర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.
శుభారంభం..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఆరంభంలో నెమ్మదిగా ఆడింది. ఇటు రోహిత్ శర్మ అటు శిఖర్ ధావన్ సమన్వయంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఇంగ్లండ్ బౌలర్లు కచ్చితమైన లైడ్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో భారత్ స్కోరు వేగంగా పరిగెత్తలేక పోయింది. రోహిత్, ధావన్‌లు భారీ షాట్ల జోలికి వెళ్లకుండా ఆత్మరక్షణకే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో తొలి పది ఓవర్లలో 39 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత రోహిత్ కాస్త దూకుడును పెంచాడు. కానీ 42 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసిన రోహిత్‌ను స్టోక్స్ వెనక్కి పంపాడు. దీంతో 64 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
కోహ్లి దూకుడు..
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే బాధ్యతను కెప్టెన్ విరాట్ కోహ్లి, ధావన్ తమపై వేసుకున్నారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరు వేగాన్ని పెంచారు. ఆరంభం నుంచే కోహ్లి దూకుడును ప్రదర్శించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. ధావన్ కాస్త సమన్వయంతో బ్యాటింగ్ చేయగా కోహ్లి తన మార్క్ దూకుడుతో స్కోరును పరిగెత్తించాడు. టి20లో వరుస అర్ధ సెంచరీలతో అలరించిన కోహ్లి తొలి వన్డేలో కూడా అదే జోరును ప్రదర్శించాడు. ఒకవైపు వికెట్‌కు కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ముందుకు సాగాడు. ఇదే క్రమంలో హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే 60 బంతుల్లో 6 ఫోర్లతో 56 పరుగులు చేసిన కోహ్లిని మార్క్‌వుడ్ వెనక్కి పంపాడు. అప్పటికే ధావన్‌తో కలిసి రెండో వికెట్‌కు కీలకమైన 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
ధావన్ సెంచరీ మిస్..
ఇక స్టార్ ఓపెనర్ ధావన్ ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత రోహిత్‌తో, ఆ తర్వాత కోహ్లితో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అర్ధ సెంచరీ వరకు కాస్త నెమ్మదిగా ఆడిన ధావన్ ఆ తర్వాత వేగాన్ని పెంచాడు. ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ శతకం దిశగా సాగాడు. కానీ 106 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 98 పరుగులు చేసిన ధావన్‌ను స్టోక్స్ ఔట్ చేశాడు. దీంతో ధావన్ రెండు పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కొద్ది సేపటికే హార్దిక్ పాండ్య కూడా పెవిలియన్ చేరాడు. 9 బంతుల్లో ఒక పరుగు మాత్రమే చేసిన హార్దిక్‌ను కూడా స్టోక్స్ వెనక్కి పంపాడు. దీంతో భారత్ 205 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది.
పాండ్య, రాహుల్ జోరు..
ఇలాంటి స్థితిలో భారత్ స్కోరు 275 పరుగులకు చేరడం కూడా కష్టంగానే కనిపించింది. కెఎల్.రాహుల్ పేలవమైన ఫామ్‌లో ఉండడం, కృనాల్ పాండ్యది ఆరంగేట్రం వన్డే కావడంతో టీమిండియా భారీ స్కోరుపై ఆశలు సన్నగిల్లాయి. కానీ తొలి మ్యాచ్ ఆడుతున్న కృనాల్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. ఇటు రాహుల్ అటు కృనాల్ ధాటిగా ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించారు. కృనాల్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ఇదే క్రమంలో ఆరంగేట్రం మ్యాచ్‌లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన కృనాల్ పాండ్య 31 బంతుల్లోనే ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు రాహుల్ కూడా దూకుడైన ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రాహుల్ 43 బంతుల్లోనే నాలుగు భారీ సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇదే క్రమంలో రాహుల్‌పాండ్యలు ఆరో వికెట్‌కు అజేయంగా 112 పరుగులు జోడించారు. దీంతో భారత్ భారీ స్కోరును నమోదు చేసింది.

IND vs ENG 1st ODI: India win by 66 Runs 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News