Sunday, April 28, 2024

కోహ్లీ రికార్డుకు ఒక్క పరుగు దూరంలో యశస్వీ జైస్వాల్!

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్ తో గురువారంనుంచి ధర్మశాలలో ప్రారంభమయ్యే ఐదో  టెస్టులో అందరి కళ్లూ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పైనే ఉంటాయి. ఎందుకంటే అతను మళ్లి తన బ్యాట్ కు పనిచెప్తే, కింగ్ కోహ్లీ, సునీల్ గవాస్కర్లు గతంలో నెలకొల్పిన  రికార్డులు బద్దలవుతాయి.

ఇంగ్లండ్ పై టెస్ట్ సీరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా కోహ్లీ పేరిట రికార్డు ఉంది. 2016-17లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సీరీస్ లో కోహ్లీ 665 పరుగులు చేశాడు. ఈ రికార్డును ఇప్పటికే సమం చేసిన యశస్వి మరొక పరుగు చేస్తే ఈ రికార్డును అధిగమించినట్లవుతుంది. ప్రస్తుత సీరీస్ లో యశస్వి నాలుగు టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలతో సహా 665 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ యావరేజి 93.57గా ఉంది. కాగా యశస్వి మరో 38 పరుగులు చేస్తే, కోహ్లీ నెలకొల్పిన మరో రికార్డు బద్దలవుతుంది. అదేంటంటే- 2014-15 సీజన్లో ఆస్ట్రేలియాతో జరిగిన సీరీస్ లో కోహ్లీ 692 పరుగులు చేశాడు. టెస్ట్ సీరీస్ లో కోహ్లీ అత్యధిక స్కోరు ఇదే. యశస్వి మళ్లీ తన బ్యాట్ ఝళిపిస్తే, ఈ రికార్డును బద్దలు కొట్టడం అంత కష్టమేమీ కాదు.

ఇక 1970లో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వెస్టిండీస్ తో జరిగిన సీరీస్ లో 774 పరుగులు చేశాడు. ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా గత 50 ఏళ్లుగా ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. యశస్వి మరో 119 పరుగులు చేస్తే గవాస్కర్ రికార్డు కూడా మాయం కావడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News