Sunday, April 28, 2024

దిగజారిన సంబంధాలు

- Advertisement -
- Advertisement -

మాల్దీవులతో సంబంధాలు ఇంతగా దిగజారిపోవడం ఆందోళనకరం. వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన దీవులపై అదుపు కోసం చైనాతో పోటీ పడుతున్న సమయంలో మనకు అతి సమీపంలోని మాల్దీవులతో మన సంబంధాలు ఇంతగా చెడిపోడం బాధాకరమైన పరిణామం. ఇండియాను, ప్రధాని నరేంద్ర మోడీని కించపరుస్తూ ముగ్గురు మాల్దీవుల జూనియర్ మంత్రులు సామాజిక మాధ్యమం x (ట్విట్టర్)లో చేసిన వ్యాఖ్యలు హిందూ మహా సముద్రంలోని మన పొరుగు ద్వీప దేశంతో మన అనుబంధాన్ని దెబ్బ తీశాయి. ఈ వ్యాఖ్యలు చేసిన జూనియర్ మంత్రులు ముగ్గురినీ సస్పెండ్ చేస్తున్నట్టు కొత్త అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ప్రభుత్వం ప్రకటించింది. భావప్రకటన స్వేచ్ఛను ప్రజాస్వామిక విధానంలో, బాధ్యతాయుతంగా వ్యక్తం చేయాలని విద్వేషాన్ని, వ్యతిరేకతను రెచ్చగొట్టి తమకు గల అంతర్జాతీయ సంబంధాలను దెబ్బ తీసే విధంగా ఉండకూడదని మాల్దీవుల ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొన్నది. దీనితో భారత, మాల్దీవుల సంబంధాలకు ఇంతవరకు జరిగిన నష్టం విస్తరించకుండా ఆగుతుందని ఆశించవచ్చు.

భారత పౌరుడొకరు చేసిన వ్యాఖ్యకు అదే రీతిలో అక్కడి మంత్రులు జవాబు చెప్పడం ఎంత మాత్రం సబబు కాదు. మంత్రుల స్పందన ఆ దేశ స్పందనగా పరిగణన పొందుతుంది. గత సెప్టెంబర్‌లో జరిగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో పూర్వ అధ్యక్షుడు సోలిహ్ ఓడిపోయి ముయిజ్జు విజయం సాధించారు. ముయిజ్జు ఎన్నికల ప్రచారంలో భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారు. సోలిహ్ ప్రభుత్వం ఇండియాతో కుదుర్చుకొన్న 100 కి పైగా ఒప్పందాలను తిరిగి పరిశీలిస్తామని ఆయన ప్రజలకు వాగ్దానం చేశారు. అధికారంలోకి రాగానే అక్కడ గల భారత సైన్యాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రధాని మోడీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ విషయాన్ని ఈ మధ్య మరోసారి గుర్తు చేశారు. మీది చైనా అనుకూల వైఖరి అనే విమర్శకు తమది వేరే ఎవరికీ అనుకూల విధానం కాదని కేవలం మాల్దీవులకు అనుకూలమైనది మాత్రమేనని ముయిజ్జు ప్రకటించారు. ఆచరణలో మాత్రం చైనా చెప్పుచేతల్లోకి వెళుతున్నారు. ముయిజ్జు ప్రభుత్వం, తన మంత్రుల వైఖరిని ఖండించి వారిని సస్పెండ్ చేసినప్పటికీ అప్పటికే దెబ్బతిన్న సంబంధాలు ఇప్పట్లో పుంజుకోవని స్పష్టపడుతున్నది.

ప్రధాని మోడీ ఇటీవల లక్షద్వీప్ వెళ్లి అక్కడ టూరిజాన్ని పెంపొందించే కార్యక్రమాలలో పాల్గొనడంతో మాల్దీవుల మంత్రులు ఆ వ్యాఖ్యలకు పాల్పడినట్టు అర్ధమవుతున్నది. తమ అధ్యక్షుడు ముయిజ్జును చైనా చేతిలో కీలుబొమ్మ అని భారత పౌరుడొకరు వ్యాఖ్యానించడంతో ఇండియా ఇజ్రాయెల్ చేతిలో కీలుబొమ్మ అని తమ మంత్రులు సమాధానం ఇచ్చినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. విదేశీ పెద్దలపై తమ మంత్రులు చేసిన చిల్లర వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని మాల్దీవుల ప్రభుత్వం ప్రకటించింది. ప్రెసిడెంట్ ముయిజ్జు బృందం ఇప్పుడు చైనాలో పర్యటిస్తున్నది. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆహ్వానంపై ముయిజ్జు సతీసమేతంగా ఈ పర్యటనకు వెళ్లారు. అక్కడ చైనాతో అనేక కొత్త ఒప్పందాలు కుదుర్చుకొంటారని భావిస్తున్నారు. ఈ సందర్భంగా మాల్దీవులతో మైత్రిని గురించి చైనా వేనోళ్ళతో పొగిడిందిద. తమ బంధం ముందు ముందు మరింతగా బలపడగలదని ప్రకటించింది. భారత దేశంతో 2019లో కుదిరిన హైడ్రాలజీ ఒప్పందాన్ని రద్దు చేసుకోడానికి నిర్ణయించినట్టు ముయిజ్జు గత నెలలో ప్రకటించి ఉన్నారు.

మాల్దీవుల ఆర్ధిక వ్యవస్థ టూరిజం ప్రధానమైనది. ఏటా 8 లక్షల మందికి పైగా విహార యాత్రికులు మాల్దీవులను సందర్శిస్తారు. అత్యధికంగా భారత దేశం నుంచి 2 లక్షల మందికి మించి వెళతారు. మాల్దీవుల ధోరణి మారిన తర్వాత ప్రధాని మోడీ లక్షద్వీప్ వెళ్లి అక్కడి ఫోటోలను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మాల్దీవుల జూనియర్ మంత్రులు భారత్‌పై కువ్యాఖ్యలకు పాల్పడిన తర్వాత సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులు మాల్దీవులకు బదులుగా లక్షద్వీప్ కు వెళ్లాలని భారత టూరిస్టులకు పిలుపు ఇచ్చారు. మాల్దీవులు భారత చైనాల మధ్య మారుతూ ఉండడం కొత్త కాదు. చైనా తమను రుణ ఊబిలోకి లాగుతున్నదనే అభిప్రాయం కూడా అక్కడి ప్రజల్లో లేకపోలేదు. అందుచేత దాని దూకుడు పట్ల సహనం ప్రదర్శించడమే విజ్ఞత అవుతుంది.భారత మాల్దీవుల మధ్య లోతైన చారిత్రిక సంబంధాలున్నాయి. మాల్దీవులపై సామాజిక మాధ్యమాల్లో బిజెపి సైన్యం రెచ్చిపోయిన తీరు హర్షించదగింది కాదు.

చైనా ఒక వ్యూహం ప్రకారం మాల్దీవులను తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నప్పుడు ఆ పరిణామాలను గమనిస్తూ ఆచితూచి వ్యవహరించవలసిన బాధ్యత మనపై వుంది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమ సేనలు మాల్దీవుల బహిష్కరణకు పిలుపు ఇవ్వడం మంచి పరిణామం కాదు. సున్నితమైన విషయాల్లో బండగా వ్యవహరించడం విజ్ఞత అనిపించుకోదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News