Sunday, April 28, 2024

దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరింది: గంగుల

- Advertisement -
- Advertisement -

India rice bowl is telangana

రాష్ట్ర బీసీ, సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

దుర్షెడ్,  నగునూర్, కొత్తపల్లిలో  ధాన్యం కొనుగోలు కేంద్రాలను  ప్రారంభించిన మంత్రి

 60 లక్షల వ్యయంతో దుర్షెడ్ లో నిర్మించనున్న గోదాం కు శంకుస్థాపన చేసిన మంత్రి

 మన తెలంగాణ / కరీంనగర్: రైతుల సంతోషమే  రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, రైతుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు  చేస్తుందని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.  శుక్రవారం కరీంనగర్ రూరల్ మండలం దుర్షెడ్,  నగునూర్,  కొత్తపల్లి మండలం లోని కొత్తపల్లి గ్రామంలో  ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు.  గతంలో  రైతులు పంటలు  పండించుకునేందుకు  నానా ఇబ్బందులు పడ్డారని, కరెంటు లేక, నీళ్లు లేక అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్ట్  వల్ల రైతులు పంటలు  పండించుకునేందుకు సమృద్ధిగా నీరు వచ్చిందని అన్నారు.

వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇవ్వడం వల్ల నేడు తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా ధాన్యం పంటలు పండుతున్నాయని తెలిపారు.  దీని వల్ల నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే  అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది అని అన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని గంగుల తెలిపారు.  జిల్లాలో రైతులు పండించిన వానకాలం పంట ధాన్యం కొనుగోలు కోసం 6540   కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే 1762 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. జిల్లాలో రైతులు రెండు లక్షల 72 వేల ఎకరాల్లో దాన్యం పండించారని,  ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 4లక్షల 86 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామని అన్నారు.

విత్తనాలు, సన్న బియ్యం కలిపి ఒక్క లక్ష పదివేల మెట్రిక్ టన్నుల ఉంటుందని తెలిపారు. మొత్తంగా జిల్లాలో ఐదు లక్షల 96 వేల మెట్రిక్ టన్నుల  ధాన్యాన్ని రైతులు పండించారని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజ కూడా కొనుగోలు చేస్తామని, గన్ని బ్యాగ్ లకు కొరత లేదని తెలిపారు. రైతులు సంయమనం పాటించి, ముందుగా టోకెన్లు తీసుకొని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. తేమ 17  శాతం ఉండేలా,   తాలు 1  శాతం మించకుండా చూసుకోవాలని మంత్రి అన్నారు.  గ్రేడ్ ‘ఏ’ రకం ధాన్యానికి  క్వింటాలుకు రూపాయలు 1960/-,  సాధారణ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ. 1940/-  కనీస మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు.

ధాన్యం కొనుగోలు కోసం ముందుగా ఒటిపి నెంబర్ వస్తుందని,  ఒటిపి నెంబర్ రాగానే ధాన్యం కొనుగోలు చేస్తామని  అన్నారు. దుర్శడ్ గ్రామంలోని  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆవరణలో నాబార్డు నిధులు రూపాయలు 60 లక్షలతో నిర్మించనున్న గోదాం కు మంత్రి గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు.

కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో  ఆయా గ్రామాల సర్పంచులు,  ఉప సర్పంచులు,  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల  చైర్మన్లు,  జడ్ పిటిసి, ఎంపిటిసిలు, తహసీల్దార్లు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్,  పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News