Friday, May 3, 2024

టెస్టు ఛాంపియన్‌షిప్: అగ్రస్థానంలోనే టీమిండియా..

- Advertisement -
- Advertisement -

అగ్రస్థానంలోనే టీమిండియా
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ఇంగ్లండ్‌పాకిస్థాన్ జట్ల మధ్య రెండో టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత ఐసిసి తాజాగా టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్లను ప్రకటించింది. ఇందులో భారత జట్టు మొదటి స్థానాన్ని కాపాడుకుంది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు భారత్ మొత్తం నాలుగు సిరీస్‌లు ఆడింది. ఇందులో టీమిండియా ఏడు విజయాలతో మొత్తం 360 పాయింట్లను సాధించింది. ఒక్క న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనే భారత్‌కు ఓటమి ఎదురైంది. బంగ్లాదేశ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలతో జరిగిన సిరీస్‌లలో టీమిండియా జయకేతనం ఎగుర వేసింది. దీంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక, ఆస్ట్రేలియా 296 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఆస్ట్రేలియాకు ప్రస్తుతం ఈ స్థానం కాపాడుకోవడం కష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇంగ్లండ్ రెండో స్థానానికి చాలా చేరువైంది. పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ ఇప్పటికే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. అంతేగాక ఒక టెస్టును డ్రాగా ముగించింది. ఇక మూడో టెస్టును గెలిచినా లేకుంటే డ్రాగా ముగించినా ఇంగ్లండ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 21తో సొంతం చేసుకుంది.

దీంతో ఆ జట్టు పాయింట్లను గణనీయంగా పెంచుకుంది. ఇక పాకిస్థాన్‌పై కూడా పైచేయి సాధించడంతో ఇంగ్లండ్ రెండో స్థానం చేరుకునే అవకాశాలు మెరుగు పడ్డాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ 279 పాయింట్లతో ఉంది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కంటే కేవలం 17 పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉంది. దీంతో మూడో టెస్టులో ఒకవేళ ఓటమి పాలుకాకుంటే ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే సమీప భవిష్యత్తులో టెస్టు సిరీస్‌లు లేక పోవడంతో భారత అగ్రస్థానానికి వచ్చిన ముప్పేమీ కనిపించడం లేదు. అయితే ఈ ఏడాది చివర్లో జరిగే ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత పరిస్థితులు తారుమారు అయ్యే అవకాశాలున్నాయి. ఇరు జట్ల మధ్య జరిగే సిరీస్ తర్వాత ఈ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరే జట్టు ఏవో తేలిపోవడం ఖాయం. అప్పటి వరకు భారత్ అగ్రస్థానంలోనే ఉంటుంది. అయితే రెండో స్థానం కోసం మాత్రం ఇటు ఇంగ్లండ్ అటు ఆస్ట్రేలియా మధ్య గట్టి పోటీ నెలకొంది.
మూడు జట్లకే ఛాన్స్
ఇదిలావుండగా ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరే అవకాశాలు భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లకు మాత్రమే కనిపిస్తున్నాయి. పాయింట్ల పట్టికలో ఈ మూడే జట్లే అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ పాయింట్లు 180 మాత్రమే. దీంతో కివీస్‌కు ఫైనల్ బెర్త్‌ను సాధించడం అనుకున్నంత తేలికకాదనే చెప్పాలి. పాకిస్థాన్‌కు కూడా ఆ ఛాన్స్ లేదనే చెప్పాలి. పాకిస్థాన్ ఇప్పటి వరకు కేవలం 153 పాయింట్లు మాత్రమే సాధించింది. ఇలాంటి స్థితిలో ప్రస్తుతం తొలి మూడు స్థానాల్లో ఉన్న జట్లకే ఫైనల్ బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది.

India top in ICC World Test Championship Points table

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News