Monday, April 29, 2024

బోనాల నిర్వహణపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష

- Advertisement -
- Advertisement -
తెలంగాణ వైభవం ఉట్టిపడేలా బోనాలు
26 దేవాలయాల్లో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం బోనాల ఏర్పాట్లు, నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులతో డా.బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. బోనాలు ఉత్సవాల నిర్వహణపై అధికారులకు దిశా, నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిఎం కెసిఆర్ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, తొమ్మిదేళ్లుగా ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారన్నారు. బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం ఈ ఏడాది రూ.15 కోట్లు కేటాయించిందని, ఆ నిధులను సద్వినియోగం చేసుకొని బోనాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, డిప్యూటీ మేయర్, తదితరులు 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు.
జూలై 9వ తేదీన సికింద్రాబాద్ మహాంకాళి బోనాలు
జూలై 9వ తేదీన సికింద్రాబాద్ మహాంకాళి బోనాలు, 16వ తేదీన హైదరాబాద్ పాతబస్తీ బోనాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. బోనాల ఉత్సవాలకు వారం రోజుల ముందే ఆలయాల్లో బోనాల ఏర్పాట్ల కోసం ప్రత్యేక ఆర్థిక సాయం చెక్‌లను అందజేయాలని అధికారులకు మంత్రి సూచించారు. బోనాలకు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయాల వద్ద క్యూలైన్లు, నీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఉత్సవాల నిర్వహణ, అలంక రణ, పూజా కార్యక్రమాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులను సకాలంలో ఆలయ కమిటీలకు మంజూరు చేయాలన్నారు. అమ్మ వారి ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దాలని, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించాలని మంత్రి పేర్కొ న్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పలు ఆలయాల వద్ద ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేసి ప్రత్యేక కళా బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
బోనాలను విశిష్టతను తెలియజెప్పేలా విస్తృత ప్రచారం
భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో పాటు లేజర్ షో ఏర్పాటు చేయాలని, బోనాలను విశిష్టతను తెలియజెప్పేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఐ అండ్ పిఆర్, పర్యాటక శాఖ అధికారులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్‌కుమార్, దేవాదాయ, పర్యాటక, సమాచార, ఇతర అధికారులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే బోనాల మహోత్సవాలకు రావాలంటూ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని అధికారులు ఆహ్వానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News