Wednesday, May 8, 2024

అదరగొట్టిన హసరంగా.. లంకదే టి20 సిరీస్

- Advertisement -
- Advertisement -

అదరగొట్టిన హసరంగా
చిత్తుగా ఓడిన భారత్, లంకదే టి20 సిరీస్
కొలంబో: భారత్‌తో గురువారం జరిగిన మూడో, చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. వనిండు హసరంగా ఆల్‌రౌండ్‌షోతో లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 81 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 14.3 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లలో రాహుల్ చాహర్ ఒక్కడే మెరుగైన ప్రదర్శన చేశాడు. చాహర్ 4 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే లక్షం మరి చిన్నదిగా ఉండడంతో లంక ఎలాంటి ఇబ్బంది లేకుండానే జయకేతనం ఎగుర వేసింది. సునాయాస లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన లంక ఆరంభం నుంచే జాగ్రత్తగా ఆడింది. రక్షణాత్మక ఆటతో ముందుకు సాగింది. మరోవైపు భారత బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి లంక బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో (12), మినోద్ భానుకా (18)లను చాహర్ వెనక్కి పంపాడు. కొద్ది సేపటికే సదీరా సమరావిక్రమ (6) కూడా ఔటయ్యాడు. ఈ వికెట్ కూడా చాహర్ ఖాతాలోకే వెళ్లింది. అయితే ఈ దశలో ధనంజయ డిసిల్వా, వనిండు హసరంగా సమన్వయంతో ఆడుతూ మరో వికెట్ నష్టపోకుండానే లంకకు విజయం సాధించి పెట్టారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ధనంజయ డిసిల్వా 23 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఇక వనిండు హసరంగా అజేయంగా 14 పరుగులు చేసి జట్టు గెలుపులో తనవంతు పాత్ర పోషించాడు.
చేతులెత్తేశారు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో లంక బౌలర్లు సఫలమయ్యారు. భారత్ ప్రారంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. కెప్టెన్(0) తాను ఎదుర్కొన్న మొదటి బంతికే ఔటయ్యాడు. తర్వాత వచ్చిన దేవ్‌దుత్ పడిక్కల్ (9), సంజు శాంసన్ (0) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (14), నితీష్ రానా(6) కూడా జట్టును ఆదుకోలేక పోయారు. మరోవైపు భువనేశ్వర్ కుమార్ (16), కుల్దీప్ యాదవ్ (23) మాత్రమే కాస్త పోరాడారు. మిగతావారు విఫలం కావడంతో భారత్ స్కోరు 81 పరుగులకే పరిమితమైంది. లంక బౌలర్లలో హసరంగా 9 పరుగులు మాత్రమే ఇచ్చిన నాలుగు వికెట్లు పడగొట్టాడు. శనక రెండు వికెట్లు తీశాడు.

INDvsSL 3rd T20: Sri Lanka win by 7 wickets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News