Friday, April 26, 2024

అంతర్రాష్ట్ర పులి చర్మాల స్మగ్లర్ల అరెస్టు..

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం టౌన్ : చిరుతపులిని వేటాడి దాని చర్మాన్ని విక్రయించేందుకు యత్నిస్తున్న తొమ్మిది మంది నిందితులను ఫారెస్టు అధికారులు చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం ఫారెస్ట్ అధికారి అప్పయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆరు నెలల క్రితం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం చింతల్‌నార్ అటవీ ప్రాంతంలో వేటగాళ్ళ ఉచ్చుల్లో చిక్కిన పులిని ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రాంతానికి చెందిన తొమ్మిది మంది స్మగ్లర్లు బరిసెలతో పొడిచి చర్మాన్ని విక్రయించేందుకు యత్నించారు. తొలుత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు కొనుగోలు చేయగా అటు నుంచి ఆంధ్రప్రదేశ్ చింతూరు ప్రాంతానికి చెందిన వ్యక్తుల స్వాధీనంలోకి వెళ్లింది.

ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తులు అమ్మకానికి సిద్ధపడగా పులి చర్మాన్ని కొనుగోలు చేసేందుకు తెలంగాణ రాష్ట్రం భద్రాచలానికి చెందిన కొందరు కొత్తగూడెం ప్రాంతంలో స్థానిక వ్యక్తుల సహాయంతో అమ్మకానికి సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు నింధితులపై నిఘా వేసిపట్టుకున్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన గవర్రాజు, ఆంధ్రప్రదేశ్ కందుకూరి ఫణేంద్ర, పన్నీరు చిరంజీవి, సుద్దపల్లి శ్రీనివాస్, మడవి కోసయ్య, కటుముల ఎర్రయ్య, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మడకం ముకేష్, జితేందర్, పూణెం సింఘలను విచారించగా నేరాన్ని అంగీకరించారు. చిరుతపులిపై కూర్చొని క్షుద్ర పూజలు నిర్వహించడం ద్వారా కాసుల వర్షం కురుస్తుందన్న మూడ నమ్మకంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు ఆయన పేర్కొన్నారు.

పట్టుబడిన వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి నిందుతలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎఫ్‌డివో అప్పయ్య తెలిపారు. ఆపరేషన్‌లో అధికారులు సురేష్, ఉమ, వెంకటేశ్వర్లు, మస్తాన్‌రాజు, లక్ష్మణ్, మోహన్, లక్‌పతి, మధన్‌లాల్, సుమన్, సాగర్, డ్రైవర్లు మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News