Tuesday, May 7, 2024

ధోనీ సేన ప్రతీకారం

- Advertisement -
- Advertisement -

ధోనీ సేన ప్రతీకారం.. హైదరాబాద్‌పై ఘన విజయం

 కేన్ శ్రమ వృథా, టాపార్డర్ విఫలం

దుబాయి: ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమి చవిచూసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో కిందటిసారి సన్‌రైజర్స్ చేతిలో ఎదురైన పరాజయానికి చెన్నై ప్రతీకారం తీర్చుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టానికి 167 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ ఏ దశలోనూ విజయం సాధించేలా కనిపించలేదు. కేన్ విలియమ్సన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. చెన్నై బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న విలియమ్సన్ 7 ఫోర్లతో 57 పరుగులు చేశాడు. మిగతావారు విఫలం కావడంతో సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. మరోవైపు చెన్నై బౌలర్లు సమష్టిగా రాణించి జట్టుకు అద్భుత విజయం సాధించి పెట్టారు. ఈ గెలుపుతో చెన్నై నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
ఆదుకున్న రాయుడు, వాట్సన్..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ డుప్లెసిస్ (౦) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అయితే ఓపెనర్ అవతారమెత్తిన శామ్ కరన్ దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించాడు. ధాటిగా ఆడిన కరన్ 21 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్ ఔటయ్యాడు. దీంతో చెన్నై 35 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యత అంబటి రాయుడు, షేన్ వాట్సన్ తమపై వేసుకున్నారు. ఇద్దరు హైదరాబాద్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఒకవైపు వికెట్‌ను కాపాడు కుంటూనే చెత్త బంతులను భారీ షాట్లుగా మలుస్తూ స్కోరు వేగం పెంచేందుకు ప్రయత్నించారు. అయితే సన్‌రైజర్స్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ వీరిని ధాటిగా ఆడకుండా కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఇదే క్రమంలో ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు కీలకమైన 81 పరుగులు జోడించారు. అయితే కుదురుగా ఆడుతున్న రాయుడును ఖలీల్ అహ్మద్ వెనక్కి పంపాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాయుడు రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 41 పరుగులు చేశాడు. మరోవైపు వాట్సన్ మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 42 పరుగులు సాధించాడు. చివర్లో కెప్టెన్ ధోనీ (21), రవీంద్ర జడేజా 25 (నాటౌట్) ధాటిగా ఆడడంతో చెన్నై స్కోరు 167 పరుగులకు చేరింది. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ అద్భుతంగా రాణించాడు. 19 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

IPL 2020: CSK Win by 20 Runs against SRH

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News