Sunday, April 28, 2024

గాజాలో నరమేధాన్ని నిలువరించాలి

- Advertisement -
- Advertisement -

గత ఐదు నెలలుగా ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజానీకంపై నరమేధాన్ని నిరాటకంగా కొనసాగిస్తూనే ఉంది. గాజాలో భీకర పోరు సాగిస్తూ భారీగా పౌర మరణాలకు ఇజ్రాయెల్ కారణమవుతూనే ఉంది. యుద్ధ నేరాలకు పాల్పడుతోంది. యావత్ ప్రపంచం ఆక్షేపిస్తున్నా కూడా ఏకపక్షంగా ముందుకెళుతోంది. హమాస్ అంతమే లక్ష్యమని మారణ హోమాన్ని సమర్థించుకుంటోంది.ఇజ్రాయెల్ యుద్ధోన్మాద బాంబు దాడులతో నేడు గాజా ఒక ‘మృత్యుకూపం’గా మారిపోయింది. లక్షలాది మంది ప్రజానీకం అనేక సమస్యలతో విలవిలలాడుతుండడం హృదయవిదారకరం.

శాంతి భద్రతా పరిస్థితులు రోజురోజుకు మరింతగా క్షీణిస్తుండడంతో నేడు గాజా అంతటా అమానవీయవీయ విషమ పరిస్థితులు నెలకొని వుంది. గాజాలో 2023, అక్టోబరు 7 నుండి నేటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 30 వేల మందికి పైగా పాలస్తీనియన్ ప్రజలు చనిపోగా, 70 వేల మందికి పైగా ప్రజలు గాయపడడం ఇజ్రాయెల్ నరహంతక యుద్ధోన్మాదానికి నిదర్శనంగా నిలుస్తున్నది. వీరిలో మూడింట రెండొంతుల మంది మహిళలు, బాలలు ఉండడం గమనార్హం. గాజా స్ట్రిప్ అంతటా తీవ్రమైన పోషకాహార లోప సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. గాజా భూభాగం చాలా వరకు నాశనం చేయబడింది. ఇప్పుడు అంతిమంగా గాజా డెత్ జోన్ గాను మారింది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యుహెచ్‌ఒ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఆవేదనను వ్యక్తం చేశారు.

అమెరికా అండదండలతో ఇజ్రాయెల్ మరింతగా పేట్రేగిపోయి గాజాను ‘డెత్‌జోన్’గా మార్చడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొనవచ్చు. అక్కడ సాగుతున్న విధ్వంసకాండ వల్ల మరణాలు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నాయి. ఈ యుద్ధం సరిహద్దులు దాటి కూడా విస్తరిస్తోంది. ఇజ్రాయెల్ యుద్ధం నుండి వెనక్కు తగ్గకపోవడంతో మిలియన్ల మంది శరణార్థులు తీవ్ర విపత్కకర పరిస్థితులను ఎదుర్కొవాల్సి రావడం విచారకరం. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలి అని కోరుతూ ఇటీవల అరబ్ దేశాల మద్దతుతో అల్జీరియా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మండలిలోని మెజార్టీ దేశాలు బలపరచగా అమెరికా తన వీటో అధికారాన్ని ఉపయోగించి అడ్డుకోవడం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.

ఈ రకంగా అమెరికా వైఖరి అంతిమంగా అంతర్జాతీయ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బకొట్టింది అని చెప్పవచ్చు. ఒక రకంగా ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేధంలో అమెరికా కూడా ఒక పాత్రధారి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అమెరికా వీటో చర్యను ఫ్రాన్స్, నార్వే, రష్యా, కతార్, సౌదీ అరేబియా, ఈజిప్టు, సిరియా, జోర్డాన్, తదితర దేశాలు తీవ్రంగా విమర్శించాయి. ఏదిఏమైననూ అంతిమంగా గాజాలో నరమేధాన్ని నిలువరించేంత వరకు అంతర్జాతీయంగా ప్రగతిశీల ప్రజాస్వామ్యశక్తులు నిరవధికంగా ఉద్యమించాల్సిన అవసరం తప్పకుండా ఉంది.

జె.జె.సి.పి. బాబూరావు
94933 19690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News