Sunday, April 28, 2024

పార్లమెంటు, ఎంఎల్‌సి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

- Advertisement -
- Advertisement -

మంత్రి జూపల్లి కృష్ణారావు

మన తెలంగాణ / హైదరాబాద్ : రాబోయే పార్లమెంట్, ఎంఎల్‌సి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే మళ్లీ పునరావృతం కానున్నాయని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. షాద్ నగర్ బైపాస్ రోడ్ లో ఎంఎల్‌ఏ వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యం లో కొందుర్గు ఎంపీపీ గోపాల్ తో పాటు ఇద్దరు ఎంపీటీసీలు బిఆర్‌ఎస్‌ను వీడి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి వారికి కాంగ్రెస్ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ… గడిచిన పదేండ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు రంగుల కల చూపించిందని, అందుకే తెలంగాణ ప్రజలు అస్తవ్యస్త, అవినీతి, అప్రజాస్వామిక బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి పాతరేసి, కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోందని, రానున్న రోజుల్లో బిఆర్‌ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమని తెలిపారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి , పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు ఎంఎల్‌సి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎంఎల్‌ఏ వీర్లపల్లి శంకర్, వనపర్తి ఎంఎల్‌ఏ మేఘరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News