Saturday, May 4, 2024

ప్రజల పాత్రతోనే కరోనా కట్టడి

- Advertisement -
- Advertisement -

It is responsibility of all people to prevent Corona

వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా… ఈ కరోనా పీడ ఎప్పుడు విరగడౌతుందా అని ఎదురు చూసిన జనం తీరా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కొన్ని రకాల అనుమానాలు, అపోహలతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి అంతగా ఇష్టపడలేదు. ప్రభుత్వం ఎంతగా అవగాహన కల్పించినా, ప్రోత్సహించినా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు అంతంత మాత్రమే. ఇప్పుడు కరోనా రెండవ విడత విజృంభణతో ప్రతి రోజు లక్షల్లో కొత్త కేసులను గుర్తించడం, మరణాల సంఖ్య కూడా పెరగడంతో ఇన్నాళ్లూ అపోహలతో, అనుమానాలతో దూరంగా ఉన్న జనం ఇప్పుడు వాక్సిన్ తీసుకోవడానికి బారులు కడుతున్నారు. అంటే మనిషికి భయం కలిగితే తప్ప సరియైన మార్గంలో నడువ లేక పోతున్నాడు. తన బాధ్యతలను సరిగా గుర్తించలేకపోతున్నాడు.

అసలు ప్రభుత్వానికి బాధ్యత వుందా? కరోనా కట్టడికి ఏమి చర్యలు చేపడుతున్నది? బార్లు, సినిమా థియేటర్లు, స్కూళ్లు, కాలేజీలు, ఫంక్షన్ హాళ్లు ఎందుకు మూసి వేయట్లేదు? ఇంతమంది చనిపోతుంటే చోద్యం చూస్తుందా, కొంత మందికే టీకా వేయడమేంటి? అందరికీ వేయొచ్చు కదా!

ఇవి ప్రస్తుతం అక్కడక్కడా వినిపిస్తున్న ప్రశ్నలు. ఇలా ఏ సమస్య వచ్చినా కొంత మంది ప్రభుత్వంపై ఎక్కుపెట్టే విమర్శనాస్త్రాలు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా భూతం చేస్తున్న కరాళ నృత్యం ప్రపంచాన్నే భయభ్రాంతులకు గురి చేస్తుంటే, దేశాలన్నీ అసలీ గండం నుంచి గట్టెక్కి బయట పడేదెలా అని తలపట్టుకుంటుంటే, చికిత్సలేని ఇంతపెద్ద మహమ్మారి నుండి ప్రజలను ఎలా కాపాడాలి అనే అంశం పై ప్రభుత్వాలు నిరంతరం శ్రమిస్తున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలనే పాటిస్తున్నాయి. గత సంవత్సర కాలంగా ఎప్పటికప్పుడు ప్రజలకు సరియైన మార్గదర్శకాలను ఇస్తూనే వైద్య వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, పారిశుద్ధ వ్యవస్థలోని ఉద్యోగులందరూ కూడా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజారోగ్య పరిరక్షణలో పాలు పంచుకోవడం మనకు విదితమే. ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతిపక్షాల విషయం పక్కన పెడితే, కొంతమంది ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేనివారు కూడా సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణం ప్రభుత్వం అసమర్ధత అంటూ విమర్శిస్తే తమ బాధ్యత తీరిపోయిందనుకుంటారు. కాని ఈనాడు సమాజంలో ఉన్న అనేక సమస్యల పరిష్కారానికి ప్రజా భాగస్వామ్యం కూడా తప్పనిసరిగా అవసరం అనే విషయాన్ని మర్చిపోతుంటారు.ముఖ్యంగా ప్రపంచమంతా ఆవరించిన ఇంతపెద్ద మహమ్మారిని తరిమికొట్టాలంటే ప్రజలంతా ఐక్యంగా ప్రభుత్వానికి సహకరిస్తే తప్ప అది సాధ్యం కాదనే విషయాన్ని గుర్తెరుగరు.

సిగ్నళ్ల దగ్గర రెడ్‌లైట్ వెలుగుతున్నా కూడా ఆగకుండా వెళ్ళేవాళ్ళు, స్పీడ్ లిమిట్ అనుసరించని వాళ్లు, ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేసేవాళ్ళు, వారి వలన ఇతరులకు ఇబ్బంది కలగడమే కాకుండా ట్రాఫిక్ అస్తవ్యస్తమవుతుందని గుర్తించరు. పైగా పోలీసులు, ప్రభుత్వం ట్రాఫిక్‌ను సరిగా నియంత్రించలేకపోతున్నాయంటూ ఉపన్యాసాలు ఇస్తారు. గంటసేపు లైన్‌లో నిలబడి ఓటు వేయడానికి కూడా బద్దకించే వాళ్లు ముఖ్యమంత్రుల మీద, ప్రధాన మంత్రుల మీద, పరిపాలన మీద రోజుల తరబడి ధారాళంగా విమర్శలు చేస్తుంటారు. కాని ఓటు వేయడం మన బాధ్యత అనే విషయాన్ని మాత్రం గుర్తించరు.

అలాగే ఇప్పటి కరోనా ఉదంతంలో కూడా ప్రభుత్వం కరోనా బారిన పడకుండా ఉండేందుకు స్వీయ నియంత్రణ ఒక్కటే పరమౌషధమని ఎంతగా చెప్తున్నా కూడా మాస్కులు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా, గుంపులుగా తిరుగుతూ కరోనా వ్యాప్తికి దోహదం చేస్తూ, తిరిగి ప్రభుత్వం కరోనా కట్టడిలో సరియైన చర్యలు చేపట్టడం లేదు అని బాధ్యత లేకుండా విమర్శలు చేసే మహానుభావులున్నారు. మొదటి వేవ్‌లో కూడా ఇలాగే ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా వాటిని బేఖాతరు చేస్తూ ప్రజలు బయట తిరగడం, గుంపులుగా చేరడం పోలీసులు లాఠీలకు పని చెప్పడం చివరికి విధిలేని పరిస్థితుల్లో పూర్తిగా లాక్‌డౌన్ విధించడం కూడా జరిగింది.

విడతవిడతలుగా లాక్‌డౌన్ ఎత్తేసిన తరువాత ప్రజల్లో భయం పూర్తిగా తగ్గిపోయింది. కరోనాను దాదాపుగా మర్చిపోయారు. విందులు, వినోదాలు, బార్లు, రెస్టారెంట్‌లు, సినిమా థియేటర్లు, గుళ్లు, మసీదులు, చర్చిలు అన్ని చోట్ల జనసందోహాలు కనిపించాయి. మాస్క్ కట్టుకోవడం నామమాత్రమైపోయింది. సామాజిక దూరాన్ని పాటించడం వదిలేశారు. శానిటైజెర్లు కూడా అంతంత మాత్రంగానే ఉపయోగించారు. తత్ఫలితంగానే ఉధృతంగా విరుచుక పడుతూ కరోనా సెకండ్ వేవ్ మనల్ని తాకింది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా… ఈ కరోనా పీడ ఎప్పుడు విరగడౌతుందా అని ఎదురు చూసిన జనం తీరా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కొన్ని రకాల అనుమానాలు, అపోహలతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి అంతగా ఇష్టపడలేదు. ప్రభుత్వం ఎంతగా అవగాహన కల్పించినా, ప్రోత్సహించినా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు అంతంత మాత్రమే. ఇప్పుడు కరోనా రెండవ విడత విజృంభణతో ప్రతి రోజు లక్షల్లో కొత్త కేసులను గుర్తించడం, మరణాల సంఖ్య కూడా పెరగడంతో ఇన్నాళ్లూ అపోహలతో, అనుమానాలతో దూరంగా ఉన్న జనం ఇప్పుడు వాక్సిన్ తీసుకోవడానికి బారులు కడుతున్నారు.

అంటే మనిషికి భయం కలిగితే తప్ప సరియైన మార్గంలో నడువ లేక పోతున్నాడు. తన బాధ్యతలను సరిగా గుర్తించలేకపోతున్నాడు. చలానాలు విధిస్తే తప్ప ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించకుండా ఆగట్లేదు. సిసి కెమెరాలు అమరిస్తేనే నేరాలు తగ్గుతున్నాయి. లాక్‌డౌన్ విధించి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే తప్ప బయట తిరగకుండా ఆగలేకపోతున్నారు. విచిత్రం ఏంటంటే రోజూ లక్షల్లో కొత్త కరోనా కేసులు, పెరుగుతున్న మరణాల సంఖ్యను పత్రికల్లో, టివిల్లో చూస్తున్న జనం ఒకవైపు భయంతో హడలిపోతూనే మరోవైపు స్వీయ నియంత్రణా పద్ధతులు పాటించడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా క్రమశిక్షణ పాటించని, 130 కోట్లకు పైగా జనాభా ఉన్న అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి తప్పనిసరిగా కఠినమైన ఆంక్షలు విధించాల్సిందే.

అందుకే మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో పాక్షికంగా మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా రాత్రి పూట కర్ఫ్యూ అమల్లోకొచ్చింది. రెండవ విడతలో కరోనా చిత్రవిచిత్రంగా తన రూపాలను మార్చుకొంటూ, రకరకాల స్ట్రెయిన్ లలో దర్శనమిస్తూ మొదటి వేవ్‌లో కన్నా ఎక్కువ ప్రమాదకరంగా కనిపిస్తున్నది. మొన్నటి దాకా డబల్ మ్యూటంట్ వైరస్‌ను చూసిన మనకు ఇప్పుడు ట్రిపుల్ మ్యూటంట్ వైరస్ కూడా దర్శనమిచ్చింది. ఇలా మ్యూటేషన్లు పెరిగిన కొద్దీ వైరస్ దుష్ప్రభావాలు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి.

భవిష్యత్తులో కూడా ఇలాగే ఉండాలంటే ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ప్రజలంతా స్వీయ నియంత్రణ పద్ధతులను ఖచ్చితంగా పాటించాలి. కరోనాను అరికట్టడం కేవలం ప్రభుత్వ బాధ్యతగా భావించరాదు. ప్రజలందరూ కూడా ఇది అందరి సమష్టి బాధ్యతగా భావించి మనల్ని మనం నియంత్రించుకోగలిగితేనే కరోనా బారి నుంచి సమాజాన్ని రక్షించుకోగలం. లేదంటే మాత్రం భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చు. ఏదో ఒక రకమైన భయం ఉంటే మాత్రమే బాధ్యతగా ఉంటాం అని కాకుండా, భయంతో సంబంధం లేని క్రమశిక్షణతో కూడిన బాధ్యతను అలవాటు చేసుకుందాం. మెరుగైన సమాజ నిర్మాణంలో మన వంతు పాత్ర పోషిద్దాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News