Tuesday, April 30, 2024

ఖరారైన జెఇఇ, నీట్ పరీక్షల తేదీలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు(సెట్స్) షెడ్యూల్ జనవరిలో వెలువడే అవకాశం ఉంది. జెఇఇ మెయిన్, నీట్ షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో త్వరలోనే సెట్స్ షెడ్యూల్ ప్రకటించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థుల్లో ఎక్కువ మంది జెఇఇ మెయిన్‌కు కూడా హాజరవుతారు కాబట్టి, విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఎంసెట్ పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేయనుంది. సాధారణంగా ఏటా మే నెలలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఈసారి కూడా వచ్చే ఏడాది మే నెలలోనే ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది.

2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జెఇఇ మెయిన్ మొదటి విడత, ఏప్రిల్ 1 నుంచి 15 రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్‌టిఎ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్ యుజి) పరీక్ష 2024 మే 5వ తేదీన జరగనుంది. రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలకు సెట్ల కన్వీనర్ల నియామకం, పరీక్షల నిర్వహణ ప్రక్రియ నవంబర్ లేదా డిసెంబర్‌లో ప్రారంభించేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

ఇంకా కొనసాగుతున్న ప్రవేశాలు
ప్రస్తుత విద్యాసంవత్సరంలో కొన్ని కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రవేశ పరీక్షలు పూర్తయి, ఫలితాలు వెలువడి దాదాపు రెండు మూడు నెలలు గడుస్తున్నప్పటికీ కౌన్సెలింగ్‌లో జాప్యం చోటుచేసుకుంది. ప్రస్తుతం సెప్టెంబర్‌లో మూడు వారాలు గడుస్తున్నా ప్రవేశాలు కొనసాగుతూనే ఉండగా, ఇప్పటికీ లాసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమే కాలేదు. వచ్చే నెలలో లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలు ముగిసిన కొన్ని రోజులకే వచ్చే ఏడాదికి సంబంధించిన సెట్ల షెడ్యూల్ వెలువడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News