Friday, May 10, 2024

కూటమి పటిష్టం… సంకీర్ణ ప్రభుత్వానికి ముప్పు లేదు : ఝార్ఖండ్ సిఎం సోరెన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఝార్ఖండ్‌లో జెఎంఎం నేతృత్వం లోని కూటమి పటిష్టం గానే ఉందని, సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయి సోరెన్ ఆదివారం స్పష్టం చేశారు. సోరెన్ తమ పార్టీకి చెందిన నలుగురిని మంత్రివర్గం లోకి చేర్చుకోవడంపై కాంగ్రెస్ లోని ఒక వర్గం ఆగ్రహంతో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో సోరెన్ ఈ వివరణ ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న చంపాయి సోరెన్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను కలుసుకునే ముందు ఈ వ్యాఖ్యలు చేశారు. ఖర్గేతో భేటీ అయిన తరువాత విలేఖరులతో సోరెన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత మర్యాద పూర్వకంగా ఖర్గేను కలుసుకున్నానని చెప్పారు.

ఇటీవల కేబినెట్ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్‌లోని ఒకవర్గం ఆగ్రహంతో ఉన్నట్టు పేర్కొనగా ఇది కాంగ్రెస్ లోని అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు. అసంతృప్తి కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు ఢిల్లీ చేరుకున్నారని అడగ్గా, కాంగ్రెస్ లోని ఈ అంతర్గత వ్యవహారం పరిష్కారమౌతుందని, జెఎంఎం, కాంగ్రెస్ మధ్య ఎలాంటి సంఘర్షణ లేదని, ప్రతీదీ బాగానే ఉందని విలేఖరులకు వివరించారు. కొత్తగా మంత్రిపదవులు పొందిన వారికి బదులుగా కొత్త వారిని చేర్చుకోకుంటే , ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని, జైపూర్ వెళ్లిపోతామని, కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎమ్‌ఎల్‌ఎలు బెదిరించారు.

అసెంబ్లీ లోని మొత్తం 81 మంది ఎమ్‌ఎల్‌ఎల్లో జెఎంఎం నేతృత్వం లోని కూటమిలో 47 మంది ఎమ్‌ఎల్‌ఎలుండగా, వీరిలో జెఎంఎం ఎమ్‌ఎల్‌ఎలు 29 మంది. కాంగ్రెస్ 17 మంది, ఆర్‌జెడి ఒకరు ఉన్నారు. కాంగ్రెస్ లోని అసమ్మతి వర్గం శనివారం రాంచీ లోని హోటల్‌లో జెఎంఎం సుప్రీం శిబు సోరెన్ చిన్న కుమారుడు , కొత్త మంత్రి బసంత్ సోరెనును కలుసుకున్నారు. వారిని ఓదార్చడానికి బసంత్ సోరెన్ ప్రయత్నించారు. ఈ సమావేశం తరువాత మాలో ఎలాంటి గందర గోళం లేదని, తామంతా సమైక్యంగా ఉన్నామని బసంత్ సోరెన్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News