Tuesday, April 30, 2024

గాంధీలైనా ఆపి ఉండాల్సింది

- Advertisement -
- Advertisement -

 

సింధియా రాజీనామాపై కాంగ్రెస్‌లో అంతర్గత చర్చ

న్యూఢిల్లీ: గాంధీజీలకు అత్యంత సన్నిహితుడు, దాదాపు రెండు దశాబ్దాల పాటు పార్టీకి నిబద్ధతతో పని చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా చేయడం రాష్ట్రంలో కమలనాథ్ ప్రభుత్వం బీటలు వారి కూలిపోవడానికి దారితీయగా, కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. జ్యోతిరాదిత్య సింధియా అసంతృప్తితో ఉన్నవిషయం తెలిసి కూడా పార్టీ అధినాయకత్వం ఆయనను ఆపడానికి ప్రయత్నించకపోవడం పార్టీలో అసమ్మతి గళాలు వినిపించడానికి కారణమైంది. 135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందని ఓ వర్గం బహిరంగంగానే అభిప్రాయపడుతోంది. రాహుల్ గాంధీకి ఎన్నో ఏళ్లుగా అత్యంత సన్నిహితుడైన సింధియా పట్ల పార్టీ అధిష్ఠానం ప్రవర్తన బాగా లేదని వారంటున్నారు. ఆయనను ఆపడానికి గాంధీ కుటుంబం చివరి ప్రయత్నం చేసి ఉండాల్సిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ నాయకుడు అన్నారు. సింధియా స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్నా వారిలో ఎవరో ఒకరు ఆయన ఇంటికి వెళ్లి ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి ఉండాల్సిందని ఆ నేత అన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తేవడంలో కీలకపాత్ర వహించిన తనకు పార్టీ సముచిత గుర్తింపు ఇస్తుందని భావిస్తున్నట్లు సింధియా బహిరంగంగానే తన మనసులో మాటను చెప్పారు. అయితే ఆయన ఆశించిన ముఖ్యమంత్రి పదవి కానీ, చివరికి పిసిసి అధ్యక్ష పదవి కానీ ఆయనకు దక్కలేదు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి పదవి లభించినప్పటికీ అక్కడ ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోవడం అసంతృప్తికి ప్రధాన కారణమైంది. దీనికి తోడు తన ముఖ్యమంత్రి పదవికి ఎక్కడ ఎసరు తెస్తాడోనన్న భయంతో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆయనను దూరంగా పెట్టడం, రాష్ట్రంలో మరో సీనియర్ నాయకుడైన దిగ్విజయ్‌తో ఉన్న విభేదాలు అందరికీ తెలిసిందే. చివరికి రాజ్యసభ సీటు ఇస్తామన్న హామీ కూడా అధిష్ఠానంనుంచి లభించలేదు. అదే ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బిజెపిలో చేరడానికి కారణంగా మారగా, కమలనాథ్ ప్రభుత్వం కూలిపోవడానికీ దారితీస్తోంది.
అయితే సింధియా తరహాలోనే పొరుగున ఉన్న రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పొసగని మరో యువనేత సచిన్ పైలట్ కూడా నడవనున్నారా అనే ఊహాహాగానాలు మొదలైనాయి. ఎందుకంటే సింధియా బాటలోనే సచిన్ పైలట్ కూడా గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన యువనేత. రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే తనకు ముఖ్యమంత్రి దక్కుతుందని ఆశించారు. అయితే ఆయనను కాదని అనుభవానికి పెద్ద పీట వేస్తూ అశోక్ గెహ్లాట్‌ను సిఎం గద్దెపై కూర్చో బెట్టారు. అప్పటినుంచి ఆ ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మధ్యప్రదేశ్‌లో పరిస్థితి తమ రాష్ట్రంలో లేదని పైలట్‌కు సన్నిహితులైన నేతలు అంటున్నారు. ఎందుకంటే రాజస్థాన్‌లో పైలట్‌కు ఉపముఖ్యమంత్రి పదవితో పాటుగా పిసిసి పగ్గాలు కూడా అప్పగించారు. అంతేకాదు, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కున్నది బొటాబొటి మెజారిటీ మాత్రమే. రాజస్థాన్‌లో పరిస్థితి కాస్త మెరుగు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలంటే బిజెపి మరింత ఎక్కువ మందిని తన వైపు తిప్పుకోవలసి ఉంటుంది. అంతేకాదు, వసుంధరా రాజె మరోసారి రాష్ట్ర సిఎం కావడం ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షాలకు ఇష్టం లేదని పైలట్‌కు సన్నిహితుడైన ఓ నాయకుడు అభిప్రాయపడ్డారు. ‘ రాజస్థాన్‌లో ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదు కానీ కాంగ్రెస్ పార్టీకి కష్టకాలమే’ అని ఆ నాయకుడన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్ వ్యాఖ్యలు పార్టీలోని అసమ్మతి నేతల మనోభావాలకు అద్ంద పట్టే విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానవర్గం సింధియాను అపడానికి ప్రయత్నించి ఉండాల్సింది. ఇరవై మంది ఎంఎల్‌ఎల మద్దతు ఉండే ఒక నాయకుడ్ని ఎలా పట్టించుకోకుండా ఉంటారు? సింధియా 15 నెలల పాటు ఎదురు చూశాడు. నేనే కాంగ్రెస్ నాయకుడిని అయి ఉంటే సింధియాను ఆపడానికి తప్పకుండా ప్రయత్నించి ఉండేవాడిని’ అని సింగ్ అన్నారు. మరి ఇప్పటికయినా కాంగ్రెస్ అధిష్ఠానం గుణపాఠం నేర్చుకుంటుందో లేదో వేచి చూడాలి.

Jyotiraditya Scindia resignation to Congress

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News