Saturday, May 4, 2024

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కమల్‌నాథ్?

- Advertisement -
- Advertisement -

Kamal Nath as Congress Working President

కాదంటే ఇతరత్రా కీలక బాధ్యతలు
ఆగస్టు వరకూ తాత్కాలిక నేత?
సోనియాతో సుదీర్ఘ మంతనాలు
పగ్గాలకు కాదు పంజాబ్‌కోసమన్న నాథ్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత , మధ్యప్రదేశ్ మాజీ సిఎం కమల్ నాథ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తారని సంకేతాలు వెలువడ్డాయి. కమల్‌నాథ్ గురువారం హడావిడిగా దేశ రాజధానిలోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. ఇద్దరి మధ్య చాలా సేపు సంప్రదింపులుజరిగాయి. ఈ దశలో కాంగ్రెస్ తదుపరి అధ్యక్షులు కమల్‌నాథ్ అవుతారని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌కు సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగానే ఉన్నారు. రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి సుముఖంగా లేరు.ఈ దశలో అత్యంత సీనియర్ అయిన కమల్‌నాథ్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించి , సోనియా, రాహుల్‌లు పార్టీ తెరవెనుక పాత్ర పోషిస్తారని ప్రచారం జరిగింది. పార్లమెంట్ సెషన్ సోమవారం నుంచి ఆరంభం కానున్న దశలోనే కాంగ్రెస్‌లో పార్టీపరమైన నాయకత్వ బాధ్యతలలో మార్పులు చేర్పులు ఉంటాయని స్పష్టం అయింది.

పార్లమెంటరీ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరిని తప్పించేందుకు రంగం సిద్ధం అయింది. అనారోగ్య కారణాలతో పార్టీ నాయకత్వ బాధ్యతలను పూర్తి స్థాయిలో సోనియా నిర్వర్తించలేకపోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది చివరికి నాయకత్వ శూన్యతకు దారితీయరాదని ఆందోళన వ్యక్తం అయింది. ఈ క్రమంలో సోనియా విధేయులకు పార్టీపరంగా అన్ని కీలక పదవులు దక్కేలా చేయాలని భావిస్తున్నారు. ఈ దశలోనే కమల్‌నాథ్ సోనియాతో భేటీ అయ్యారు. ఆయననే పార్టీ అధ్యక్షులు చేస్తారని, లేదా ఇతరత్రా కీలక బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరిగింది. పార్టీలో ప్రధానమైన మార్పులతోనే పరిస్థితి చక్కదిద్దుకుంటుందని సోనియాకు కమల్ తెలిపినట్లు వెల్లడైంది. కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి చాలా కాలంగా ఎన్నికల ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది.

పార్లమెంట్ సెషన్ తరువాతనే సారధి ఎన్నిక జరుగుతుందని స్పష్టం అయింది. అయితే ఈ లోగా కమల్‌కు పార్టీ నాయకత్వ బాధ్యతను తాత్కాలికంగా అయినా అప్పగించడం ద్వారా పార్టీపై గాంధీ కుటుంబ ప్రాబల్యం దెబ్బతినకుండా వ్యూహరచన జరిగిందని స్పష్టం అయింది. సోనియా గాంధీకి అంతకు ముందు రాజీవ్‌కు కమల్ నాథ్ అత్యంత సన్నిహితుడు . గాంధీ కుటుంబానికి ఆప్తుడు అనే పేరుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆగస్టులో భేటీ కావల్సి ఉంది. అప్పుడు కొత్త అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ ఆరంభం అవుతుంది. పార్టీలో తీవ్రస్థాయి నిర్మాణాత్మక మార్పులు అవసరం అని అధినేత్రి కూడా భావిస్తున్నారు. అయితే ఈ పరిణామం అంతా అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. పార్టీలో ఇప్పుడు కోశాధికారి స్థానం కూడా ఖాళీగా ఉంది. అయితే దీనిని చేపట్టేందుకు కమల్‌నాథ్ ఆసక్తి కనపర్చడం లేదు. గురువారం సోనియా నివాసంలో కమల్‌నాథ్ భేటీ అయినప్పుడు ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు.

పార్టీ అధ్యక్ష బాధ్యతలా ..నహీ
కమల్ నాథ్ వివరణ

తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అవుతానని, ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చునని వచ్చిన వార్తలను కమల్ నాథ్ గురువారం రాత్రి తోసిపుచ్చారు. ఇవన్నీ ఊహాగానాలే అన్నారు. పార్టీ సంబంధిత కీలక విషయాలపై తాను సోనియా గాంధీతో చర్చించేందుకు వెళ్లినట్లు, దీనికే ఇతరత్రా వార్తలు వెలువడితే తానేమీ చేసేది లేదన్నారు. ప్రత్యేకించి పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభ పరిస్థితి గురించి మాట్లాడామని వివరించారు. పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్‌కు కమల్ నాథ్ సన్నిహితుడు. నవ్‌జోత్ సింగ్ సిద్ధూకు, సింగ్‌కు పడటం లేదు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ దశలో రాష్ట్ర కాంగ్రెస్‌లో చిచ్చు తగదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశలోనే తాను ఎక్కువగా సోనియాను ఈ మధ్యాహ్నం కలిసినప్పుడు మాట్లాడినట్లు నాథ్ వివరించారు. 74 ఏండ్ల కమల్‌నాథ్ పార్టీలో సీనియర్‌గా ఉంటూ వస్తున్నారు. మధ్యప్రదేశ్ సిఎంగా, కేంద్ర మాజీ మంత్రిగా, తొమ్మిది సార్లు ఎంపి అయిన కమల్‌నాథ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. సోనియా , రాహుల్‌లకు కావల్సిన వాడు. ఇదే సమయంలో సోనియా పట్ల ధిక్కారం విన్పించిన జి 23 టైప్ అసమ్మతి నాయకులకు కూడా దగ్గరివాడు. పార్టీలో సయోధ్య దిశలో ఇప్పటికే తెరవెనుక పాత్ర పోషించిన వాడని పేరుంది. ఈ అంశాన్ని తీసుకునే పార్టీలో కమల్‌నాథ్‌కు కీలక బాధ్యతలు ఇస్తారని స్పష్టం అయింది. అయితే ఇటువంటిదేమీ లేదని ఇప్పుడు నాథ్ తేల్చిచెప్పారు.

Kamal Nath as Congress Working President

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News