Sunday, April 28, 2024

రాహుల్ ‘మన నేత’

- Advertisement -
- Advertisement -

ఆయన యాత్రలో చేరండి
ఎంపి ప్రజలకు కమల్ నాథ్ పిలుపు
మార్చి 2న భారత్ జోడో న్యాయ్ యాత్రలోకి కమల్ నాథ్
6 వరకు మధ్య ప్రదేశ్‌లో సాగనున్న యాత్ర

భోపాల్ : రాహుల్ గాంధీ సారథ్యంలో మొదలైన భారత్ జోడో న్యాయ్ యాత్ర మధ్య ప్రదేశ్‌లో సాగుతున్నప్పుడు యాత్రలో పాల్గొనవలసిందిగా ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ పిలుపు ఇచ్చారు. ‘రాహుల్ గాంధీ సారథ్యంలోని భారత్ జోడో న్యాయ్ యాత్రను స్వాగతించేందుకు మధ్యప్రదేశ్ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సుకతతో ఉన్నారు. మన నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా వీధులలో యాత్ర సాగిస్తూ, అన్యాయం, అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటాన్ని ప్రకటించారు’ అని కమల్ నాథ్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు.

‘గరిష్ఠ సంఖ్యలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో చేరడం ద్వారా రాహుల్ గాంధీకి జవసత్వాలు అందజేయాలని రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అన్యాయంపై ఈ మహా ఉద్యమాన్ని మనం అందరం ముందుకు తీసుకువెళదాం’ అని కమల్ నాథ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. సీనియర్ నేత కమల్ నాథ్ యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఒకరు శుక్రవారం వెల్లడించారు. కమల్ నాథ్ మార్చి 2న ఉజ్జయిని చేరుకుంటారని, 6 వరకు యాత్రలో పాల్గొంటారని పార్టీ ప్రతినిధి తెలిపారు. యాత్ర మార్చి 2న రాజస్థాన్ నుంచి మొరేనాలోకి ప్రవేశిస్తుంది.

యాత్ర గ్వాలియర్, శివ్‌పురి, గుణ, రాజ్‌గఢ్, షాజాపూర్, ఉజ్జయిని, ధార్, రత్లామ్ మీదుగా సాగి 6న రాజస్థాన్‌లోకి తిరిగి ప్రవేశిస్తుంది. ఇది ఇలా ఉండగా, కమల్ నాథ్ కేంద్రంగా ఇటీవల పార్టీ ఫిరాయింపు ఊహాగానాలు సాగిన విషయం విదితమే. కమల్ నాథ్, ఆయన కుమారుడు, ఛింద్వారా ఎంపి నకుల్ నాథ్ అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరే యోచనలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. కాగా, కమల్ నాథ్ కంచుకోట అయిన ఛింద్వారా నుంచి పలువురు కాంగ్రెస్‌వాదులు బుధవారం ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సమక్షంలో బిజెపిలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News