Sunday, April 28, 2024

వంద రోజులకు చేరువలో కంటి వెలుగు

- Advertisement -
94 పనిదినాల్లో కోటి 60 లక్షల 89 వేల 744
మందికి కంటి పరీక్షలు
మొదటి విడతతో పోల్చితే
10 లక్షల కంటే ఎక్కువ స్క్రీనింగ్
22 లక్షల 44 వేల 267 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం వంద రోజులకు చేరువవుతున్నది. 94 పని దినాల్లో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి 60 లక్షల 89 వేల 744 మందికి కంటి పరీక్షలు చేశారు. దృష్టి లోపం ఉన్నవారిని గుర్తించి 22 లక్షల 44 వేల 267 మందికి ఉచితంగా కళ్లద్దాలు, మెడిసిన్స్ అందజేయడంతోపాటు 15 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసెస్ పంపిణీ చేశారు. పరీక్షలు చేసిన వారిలో 75 లక్షల 62 వేల 259 మంది పురుషులు, 85 లక్షల 06 వేల 175 మంది స్త్రీలు, 11,584 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. కోటి 20 లక్షల 42 వేల 218 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని నిర్ధారణ అయ్యింది. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమంలో కోటి 50 లక్షల మందికి పరీక్షలు చేయగా ఈసారి 94 పని దినాల్లో 10 లక్షలకు పైగా అదనంగా నిర్వహించారు. 12,501 గ్రామపంచాయతీల్లో, 3,666 మున్సిపల్ వార్డులలో కంటి పరీక్షలు పూర్తి కాగా, మొత్తంగా ఇప్పటికే 15 జిల్లాల్లో పూర్తయిన స్క్రీనింగ్ పూర్తి అయ్యింది.
విజయవంతంగా కొనసాగుతున్న కార్యక్రమం
తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కంటి సమస్యతో బాధ పడకూడదని కంటి వెలుగు పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మారిన జీవన విధానం, వివిధ రకాల పని ఒత్తిళ్ల వల్ల కంటి సమస్యలపై ప్రజలు దృష్టి పెట్టాలని, అవగాహన లోపం వల్ల ఎక్కువ మంది దృష్టి లోపానికి గురవుతున్నందున ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మార్గదర్శనంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గత జనవరి 18 నుంచి వంద రోజుల కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. డిఎంహెచ్‌ఒలు, డిప్యూటీ డిఎంహెచ్‌ఒలు, ప్రోగ్రాం ఆపీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, కంటి వైద్యులు, సూపర్‌వైజర్లు, ఎఎన్‌ఎంలు, ఆశాలు, డిఇఒలు సహా, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. స్క్రీనింగ్ పూర్తి చేసిన తర్వాత వెంటనే రీడింగ్ గ్లాసెస్, నాలుగు వారాల్లోగా ప్రిస్కిప్షన్ గ్లాసెస్ తప్పకుండా అందేలా చూస్తున్నారు. క్యాంపుల నిర్వహణ ప్రణాళికతో నిర్వహిస్తున్నారు. సిబ్బందికి అవసరమైన భోజన, వసతి, వాహన సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
అవసరమైన అందరికీ పరీక్షలు చేయాలి : మంత్రి హరీశ్ రావు
నివారించదగిన అందత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వంద రోజులకు చేరువ కాబోతున్నదన్నారు. అవసరమైన ప్రతి ఒక్కరికీ వైద్య సిబ్బంది పరీక్షలు చేయాలని తెలిపారు. వెంటనే రీడింగ్ గ్లాసెస్ ఇవ్వడంతో పాటు, నిర్దేశించిన సమయంలో ప్రిస్కిప్షన్ గ్లాసెస్ ఇవ్వాలని చెప్పారు. మిగిలి ఉన్న జిల్లాల్లో పరీక్షలు ఎక్కువగా చేయాలని, ప్రచారం కల్పించి అవగాహన పెంచాలని సూచించారు. కంటి వెలుగు విజయవంతంగా నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి, సహకరిస్తున్న ఇతర శాఖలు, ప్రజాప్రతినిధులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News