Tuesday, April 30, 2024

పోలింగ్ సమయంలో ఎవరికి వారే నేతల ధీమా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : బుధవారం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా, వివిధ పార్టీల నేతలు విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి, ఈసారి బీజేపీపై ఉన్న వ్యతిరేకత కారణంగా ప్రజలు తమ పార్టీకే అధికారం కట్టబెడతారని కాంగ్రెస్ ధీమాతో ఉంది. రాష్ట్రంలో 38 ఏళ్లుగా వరుసగా ఒకే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోలేదని, అంతర్గత సర్వేలు కూడా కాంగ్రెస్ గెలుస్తుందని తేల్చి చెప్పాయని కాంగ్రెస్ ధీమా కనబరుస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వాల ఏర్పాటులో కింగ్‌మేకర్ పాత్రపై జేడీస్ గట్టి ఆశలతో ఉంది.

అయితే కింగ్‌మేకర్ స్థానాన్ని పదిలపర్చుకోడానికి జేడీఎస్ ప్రయత్నిస్తున్న సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తరువాత కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నాయా అని అడిగినప్పుడు అలాంటి అవకాశాలేవీ లేవని చెప్పారు. కాంగ్రెస్ సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ సిఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ద రామయ్య తాను పోటీ చేస్తున్న వరుణ నియోజక వర్గంలో ఓ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తన ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత మీడియాతో మాట్లాడుతూ ఓటర్ల నుంచి తనకు అద్భుతమైన స్పందన వస్తోందన్నారు.

తనకు 60 శాతం కన్నా ఎక్కువ ఓట్లు లభిస్తాయన్న ధీమా వెలిబుచ్చారు. కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. తనకు ఇవే చివరి ఎన్నికలని, భవిష్యత్తులోతాను ఎన్నికల్లో పోటీ చేయబోనని , అయితే రాజకీయాల నుంచి మాత్రం విరమించుకోనని చెప్పారు. కర్ణాటక మాజీ సిఎం , హుబ్లిధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగదీశ్ షెట్టార్ ఓటు వేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తమ పార్టీకి 125కు పైగా స్థానాలు లభిస్తాయని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి కోసం ముగ్గురు పోటీ పడుతున్నారని, అయితే అధిష్ఠాన వర్గమే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేస్తారని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News