Tuesday, April 30, 2024

కేసీఆర్ మావాడే

- Advertisement -
- Advertisement -

కేసీఆర్ అమ్మమ్మ ఊరు కోనాపూర్ వాసుల సంబరం

కామారెడ్డినుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బరిలోకి దిగడంతో కోనాపూర్ గ్రామం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలంలో ఉంది కోనాపూర్ గ్రామం. ఒకప్పుడు ఈ గ్రామాన్ని పోసానిపల్లి అనేవారు. కేసీఆర్ తల్లి వెంకటమ్మది ఈ ఊరే. కేసీఆర్ తండ్రి స్వగ్రామం సిద్దిపేట జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట. ఆయన కోనాపూర్ కు ఇల్లరికం వచ్చారు. అప్పర్ మానేర్ డ్యామ్ కు సమీపంలో ఈ గ్రామం ఉంది. 1950లో డ్యామ్ నిర్మాణ సమయంలో ఊరు, భూములు చాలావరకూ మునిగిపోవడంతో చాలామంది ఇతర ప్రాంతాలకు వలస పోయారు. కేసీఆర్ తల్లిదండ్రులు కూడా కోనాపూర్ వదిలి చింతమడకకు వెళ్లారు. కేసీఆర్ అక్కచెల్లెళ్లు కోనాపూర్ లోనే పుట్టినా, కేసీఆర్ మాత్రం చింతమడకలోనే పుట్టారు. కేసీఆర్ కామారెడ్డినుంచి పోటీ చేస్తుండటంతో అందరి దృష్టీ కోనాపూర్ పై పడింది.

ప్రస్తుతం కేసీఆర్ అమ్మమ్మ తాలూకు రెండంతస్తుల మేడ ఒకటి కోనాపూర్ లో ఉంది. అయితే శిథిలావస్థకు చేరడంతో దీనిని ఎవరూ వాడటంలేదు. ఇంటి లోపల పిచ్చి మొక్కలు పెరిగాయి. ఊళ్లో 400వరకూ ఇళ్లు ఉన్నాయి. కోనాపూర్ ను కేటీఆర్ దత్తత తీసుకుని, అభివృద్ధి చేశారు. రోడ్లు, వంతెనలు నిర్మించారు. కేసీఆర్ రెండున్నర కోట్ల రూపాయల ఖర్చుతో పాఠశాల కట్టించారు. అయితే ఎన్నికల నియమావళి అమలులో ఉండటంతో ఈ పాఠశాల ప్రారంభానికి నోచుకోలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, ఈ గ్రామ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. తమ ప్రాంతానికి చెందిన నేత ముఖ్యమంత్రి అయ్యాడంటూ మిఠాయిలు పంచిపెట్టారు. తమ గ్రామానికి చెందిన కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండటం పట్ల కోనాపూర్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News