Sunday, April 28, 2024

పిజ్జా డెలివరీ చేసినప్పుడు రేషన్ చేయలేమా?: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 72 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే రేషన్ డోర్ డెలివరీ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం మరోమారు నిలిపివేయడంపై ఢిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవారం నుంచి ఢిల్లీలో డోర్ టు డోర్ రేషన్ పథకం ప్రారంభం కానుండగా, దీన్ని రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం నిలిపి వేసిందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రంపై ధ్వజమెత్తారు. ముందస్తు అనుమతి కోరలేదంటూ శనివారం లెఫ్టినెంట్ గవర్నర్ ఈ పధకాన్ని రద్దు చేశారు. కేంద్రం ఆమోదించలేదని, కోర్టు కేసు నడుస్తోందని, రెండు చెల్లని కారణాలను అనిల్ బైజాల్ చెప్పారని, డిళ్లీ పౌరసరఫరాల శాఖ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ ఆరోపించారు. ఈ పథకానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఘర్ ఘర్ రేషన్ యోజనా అని పేరు పెట్టారు. ఈ పథకం కింద బియ్యం, గోధుమ పిండి అర్హులైన వారికి నేరుగా ఇళ్లకే సరపరా చేస్తారు. ఈ పథకానికి అనుమతి తీసుకోలేదని కేంద్రం సాకులు చెబుతోందని, కానీ దీనికి తాము ఐదుసార్లు అనుమతి పొందామని కేజ్రీవాల్ చెప్పారు.

కరోనా సంక్షోభంలో ఇంటింటికీ పిజ్జా డెలివరీకి అనుమతించారని, మరి రేషన్‌ను ఎందుకు డెలివరీ చేయనివ్వరని ఆయన ప్రశ్నించారు. దీన్ని బట్టి రేషన్ మాఫియా ఎంత బలంగా ఉందో, అది కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత ప్రభావితం చేస్తోందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం డిజిటల్ ప్రెస్ కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో సాయం అందించకుండా రాష్ట్రాలతో కేంద్రం రాజకీయాలు చేస్తోందని, రేషన్ అనేది ఓ పార్టీకో, నేతకో సంబంధించింది కాదని, సామాన్య ప్రజానీకానికి ఉన్న హక్కని, ఆయన ధ్వజమెత్తారు. చేతులెత్తి మొక్కుతున్నా.. దయచేసి ఈ పథకాన్ని ప్రారంభించనివ్వండి.. కావాలంటే క్రెడిట్ మొత్తం మీకే ఇస్తా.. అని పరోక్షంగా ప్రధాని మోడీని ఉద్దేశించి కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఇది ఒక్క ఢిల్లీకే కాదు, దేశం మొత్తం మీద కరోనా దృష్టా అమలు చేయాలని సూచించారు.

Kejriwal fires on Centre over ration home delivery

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News