Tuesday, April 23, 2024

గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ చేత అబద్దాలు చెప్పించారని కేంద్ర పర్యటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్రం నిధులతో చేపట్టిన కార్యక్రమాలను సైతం తమ ఖాతాలో వేసుకుని గొప్పులు చెప్పుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సబ్ స్టేషన్ ఎదుట రైతులు ధర్నాలు చేస్తుంటే 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ గ్రామాల రుపురేఖలు మారాయని అసెంబ్లీలో గవర్నర్‌తో చదివించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు అందక సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయాన్ని విస్మరించిందని అన్నారు. ప్రభుత్వ కృషితో రాష్ట్ర ఆదాయం పెరిగిందని చెప్పుకుంటున్న ప్రభుత్వం 16 వేల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన విషయాన్ని మర్చిపోయిందన్నారు.

వ్యవసాయ సబ్సిడీలు, పథకాలన్నింటిని ఎత్తివేసి రైతు బంధు ఇస్తున్నా వేలాదిమంది రైతులు ఎందుకు అత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్నారు. ధరణి రైతుల్ని దగా చేస్తుంటే తప్పులు సవరణపై స్పందించే నాథుడే లేడన్నారు. కేంద్రం నిధులతో నడుస్తున్న బస్తీ దావాఖానాలను తమ ప్రభుత్వం చేసిన ఘనకార్యాలుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

ఏడాదిలోపు 10 లక్షల ఉద్యోగాల భర్తీ చేయడమే లక్షంగా కేంద్రం ముందుకు వెళ్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసి దానిచుట్టూ వివాదాలను సృష్టిస్తుందని విమర్శించారు. ఉద్యోగాల కల్పనపై గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించడం హాస్యస్పదమన్నారు. చివరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్టిపిసి ద్వారా జరుగుతోన్న విద్యుత్ ఉత్పత్తిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఘనతగా చెప్పుకోవడం పెద్ద దివాళాకోరు ప్రకటన అని ఆయన ఆరోపించారు. అభివృద్ధిపై అబద్దాల ప్రచారం మానుకుని రాష్ట్ర సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News