Saturday, May 4, 2024

అధికారంలోకి వస్తే గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మేడారం: బిజెపి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలో వారి జనాభా ప్రాతిపదికన 10శాతం రిజర్వేషన్లు తీసుకొస్తామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగానకు గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని, దీని నిర్మాణానికి తొలి విడతగా దాదాపు రూ.900 కోట్లను కేటాయించడంతోపాటుగా.. ఈ విశ్వవిద్యాలయానికి సమ్మక్క, సారక్క పేరును పెట్టిన ప్రధానమంత్రికి.. గిరిజన సమాజం తరపున, తెలంగాణ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. బుధవారం ములుగు జిల్లా మేడారంలో కొలువైన వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను కేంద్రమంత్రి దర్శనం చేసుకున్నారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి అవకాశాల్లోనూ గిరిజన యువతీ, యువకులకు ఈ రిజర్వేషన్లను అమలు చేస్తామని ఆయన వెల్లడించారు.

దేశవ్యాప్తంగా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు, గిరిజన వీరుల త్యాగాలను యావద్భారతం స్మరించుకునేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన అన్నారు. హైదరాబాద్ లో రూ.25 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజన స్మారక మ్యూజియం నిర్మాణం చేపట్టబోతున్న విషయాన్ని, రూ.6.5 కోట్ల కేంద్ర నిధులతో గిరిజన పరిశోధన సంస్థ ప్రారంభానికి సిద్దంగా ఉందని తెలిపారు. ములుగు జిల్లాలోని రుద్రేశ్వర ఆలయం (రామప్ప గుడి)కి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చే విషయంలోనూ ప్రధానమంత్రి ప్రత్యేక చొరవతీసుకున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో విద్యారంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ వర్గాల్లో అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యంతో రూ.420 కోట్లతో 17 కొత్త ‘ఏకలవ్య పాఠశాలలను’ కేంద్రం ఏర్పాటు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News