Sunday, April 28, 2024

రెండు రోజులకే హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు: కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొత్త కౌన్సిల్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని రోడ్లు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలిపారు. తెలంగాణ సచివాలయం 5వ అంతస్తులోని 5ఎఫ్ 11,12,13 గదుల వద్ద కోమటి రెడ్డి పూజలు నిర్వహించారు. తరువాత మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే తొమ్మిది ఫైల్స్‌పై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి త్వరలో కొత్త కౌన్సిల్ భవన నిర్మాణం చేపడుతామన్నారు. పాత భవనం ఆవరణలోనే ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సిఎల్‌పి కార్యాలయాలు కూల్చి వేసి భవనాలు నిర్మిస్తామని చెప్పారు. రెండు రోజుల్లోనే ఏం చేశారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు మాట్లాడుతున్నారని, పది సంవత్సరాల నుంచి బిఆర్‌ఎస్ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు.

పది సంవత్సరాల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ అండ్ బి శాఖ కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తన నియోజకవర్గ పరిధిలోని రోడ్లను వంద కోట్ల రూపాయలతో నాలుగు లైన్లుగా మారుస్తానని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కోమటి రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం తన ఎంపి పదవికి రాజీనామా చేసిన అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అపాయింట్‌మెంట్ తీసుకుంటానని, కేంద్రం నుంచి నిధులు తీసుకరావాడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. హైదరాబాద్ టూ కల్వకుర్తి నాలుగు లైన్ల రోడ్డు, ఎల్‌బినగర్ టూ మల్కాపురం, మల్కాపురం టూ సూర్యాపేట వరకు ఆరు లైన్ల రోడ్డు పనులు చేయాలని, అందు కోసమే నితిన్ గడ్కరీ కలుస్తానని వివరణ ఇచ్చారు. పది రోజుల్లోనే కేంద్రం నుంచి స్పష్టత వస్తుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News