Friday, May 3, 2024

బడుగు, బలహీనవర్గాల స్ఫూర్తి ప్రధాత కొండా లక్ష్మణ్ బాపూజీ

- Advertisement -
- Advertisement -

Konda Lakshman Bapuji is inspiration of poor and weaker sections

సిఎం కెసిఆర్ నివాళి

లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి సందర్భంగా
ఆయన సేవలను స్మరించుకున్న సిఎం కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత, ప్రజాస్వామిక మానవతావాది కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి (సెప్టెంబర్ 27)ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ స్పూర్తిదాయక నిస్వార్థ సేవలను సిఎం స్మరించుకున్నారు. సాయుధ పోరాట కాలంలో చాకలి ఐలమ్మతో సహా పలువురికి న్యాయవాదిగా సేవలందించి వారి తరఫున న్యాయపోరాటం చేసిన ప్రజాస్వామిక వాది కొండా లక్ష్మణ్ అని పేర్కొన్నారు. గాంధీజీ అందించిన స్ఫూర్తితో భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, అవే విలువలను తన జీవితాంతం పాటిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన అన్ని దశల్లో అదే స్పూర్తిని కొనసాగించిన కొండా లక్ష్మణ్ బాపూజీ దేశం గర్వించదగ్గ గొప్ప నేతగా సిఎం అభివర్ణించారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం, తన జీవితకాలం కృషి చేశారని తెలిపారు. బహుజన నేతగా దేశవ్యాప్తంగా పద్మశాలీలను సంఘటితం చేసిన ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీకే దక్కిందని సిఎం అన్నారు.

బాపూజీ జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. స్వరాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి గౌరవించుకున్నామని తెలిపారు. చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులను అందజేస్తూ తన స్పూర్తిని కొనసాగిస్తున్నామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. వినూత్న పథకాలను అమలు పరుస్తూ చేనేత కార్మికులైన పద్మశాలీల అభ్యున్నతి ప్రభుత్వం పాటుపడుతున్నదన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ కలలను నెరవేరుస్తూ, తక్కువ సమయంలోనే అన్ని రంగాల్లో విశేష పురోగతిని రాష్ట్ర ప్రభుత్వం సాధించిందని పేర్కొన్నారు. సకల జనులు, సబ్బండవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ తన జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తున్నదన్నారు. బంగారు తెలంగాణ సాధించడమే బాపూజీకి ఘనమైన నివాళి అని సిఎం స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News