Tuesday, April 30, 2024

కొవిడ్ 19 కాదు ఆకలి 20

- Advertisement -
- Advertisement -

migrant workers

 

Corona Virus Disease -2019 లో మొదటి అక్షరాలే Covid- 19. ఇది ఆకలి -2020 అయింది. మార్చి 30కి భారత్‌లో కరోనాతో 32 మంది చనిపోయారు. మార్చి 27కు 5 గురు పిల్లలతో సహా 22 మంది వలస కార్మికులు చనిపోయారు. మన దేశీయ వలసలు ఎక్కువ. ఇవి ఆర్థిక ప్రగతికి తోడ్పడతాయి. ఆర్థిక, సామాజిక, శ్రామిక కొరత, సహజ వనరుల అసమతుల్యతలు వలసల కారణాలు. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, సామాజిక, శాసన అశ్రద్ధలు మానవ హక్కులను హరిస్తున్నాయి. రాజ్యాంగ అధికరణ 19 అంతర్గత వలస హక్కు కల్పిస్తోంది. 2011 జనాభా లెక్కల్లో వలస కార్మికులు 38 కోట్లు. వీరిలో 70.7% మహిళలు. బాలురు 1.5 కోటి. షెడ్యూల్డ్ తెగల, కులాల, వెనుకబడ్డ తరగతుల వారూ ఎక్కువే. యుపి, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్, తమిళనాడుల నుండి ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, పంజాబ్, కర్నాటకలకు వలసలు సాగుతున్నాయి.

నిర్మాణం, ఇంటి పనులు, జవుళి, ఇటుక బట్టీలు, రవాణా, గనులు, వ్యవసాయ రంగాల్లో చాకిరీకి వలసలు జరుగుతాయి. వలసజీవుల తిండి, నీరు, వసతి, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం, పని పరిస్థితులు, సామాజిక భద్రత, చట్ట రక్షణ అశ్రద్ధ చేయబడతాయి. ప్రజాస్వామ్యంలో వీరి పాత్ర లేదు. వలస కార్మికులు మతం, కులం, ప్రాంతం, భాష, లింగ వివక్షతలకు గురవుతారు. స్త్రీలు శారీరక లైంగిక దోపిడీలకు లోనవుతారు. పిల్లలు ఇతర అసౌకర్యాలతో పాటు శారీరక, మానసిక, మేధో వికాసాలు కోల్పోతారు. వారి భవిష్యత్తు కోలుకోలేనంతగా నష్టపోతుంది. భారత భావి మానవ వనరులు శాశ్వతంగా బలహీనపడతాయి.

పాలకులు సమాజ శ్రేయస్సును నిర్మలం గా, పవిత్రంగా చూడాలి. ప్రజలు ఫణంగా స్వార్థానికి పాల్పడరాదు. దేశబందీ ప్రణాళికలు తయారీ లేవు. ప్రతిపక్షాలతో సంప్రదింపులు లేవు. ప్రజలను కష్టపెట్టిన కఠిన చర్యలు తీసుకున్నందుకు మన్నించండి. యుద్ధం గెలవడానికి ఇవి అవసరమయ్యాయి అన్నారు మోడీ. చిన్న ముందు చూపుతో కష్టాలు తప్పేవి. నాయకత్వ లక్షణాలులేని నేత క్షమార్హుడు కాదు. కనిపించని కరోనా నియంత్రణ యుద్ధం ఎలా అవుతుంది? ప్రపంచమంతా కరోనా విశ్వమారి నిరోధంలో ఉన్నా మనం చైనా నుండి వచ్చేవారి మీదే దృష్టిపెట్టాం. సీనియర్ వైరాలజిస్ట్, వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ గౌరవాచార్యులు జాకోబ్ జాన్ వ్యాఖ్యానించారు.

దేశంలో బయటపడ్డ కరోనా కేసులు చైనాయేతర దేశాల ఆగంతకులతో వచ్చాయి. ప్రజారోగ్యం కంటే ప్రభుత్వాల ఏర్పాటు ముఖ్యం. 80 రోజుల తర్వాత చర్యలు మొదలుపెట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వం మార్చి 20 ననే అత్యవసర సేవలు ఆపేసింది. పలు ప్రాంతాల వలస కార్మికులు రైళ్లు పట్టకుండా మహారాష్ట్రకు వచ్చారు. దైహిక దూరం దూరమైంది. ఇది గమనించినా కేంద్రానికి కనువిప్పు కలగలేదు. కష్ట జీవులు, సంపద సృష్టికర్తలు గుర్తురా లేదు. 4 గంటల్లో దేశబందీ విధించింది. ప్రజలు ఎలా సిద్ధపడతారు? వలస జీవుల బ్రతుకు దెరువు రాత్రికిరాత్రి మాయమైంది. వీరికి కరోనా తెలియదు. తెలిసింది ఆకలే. ఆశించిన దైహిక దూరాన్ని వలస కార్మికుల అలలు ముంచాయి. నగరా ల నుండి బయలుదేరిన అనాథల గుంపులు దేశ విభజనలో దేశాలను వదిలిన జనాభాను గుర్తుతెచ్చాయి. ప్రభుత్వమే పట్టించుకోని దేశనిర్మాతలను, సంపద సృష్టికర్తలను గుత్తేదారులు నట్టేట ముంచి పారిపోయారు. వీళ్ళకు గూడు, కూడు లేవు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ప్రభుత్వాలు రవాణా సౌకర్యాలు ఆపేశాయి.

వలస కార్మికులు వేల కిలోమీటర్ల దూరం కాలినడకన వట్టికాళ్ళతో బయలు దేరారు. వీళ్లలో నిండు గర్భవతులు, పిల్లలు, ముసలివాళ్ళు ఉన్నారు. కేంద్రం, రాష్ట్రాలు ఎక్కడి వాళ్ళు అక్కడే అన్నారు. రహదారుల మంత్రి వాళ్ళను పంపించండి అన్నారు. యోగి, కేజ్రీవాల్ పంపే ప్రయత్నం చేశారు. ఈ బస్సులు చాల్లేదు. ప్రభుత్వాలు ఈ పని ముందే ఎందుకు చేయలేదు? అమాయక వలస కార్మికుల ఆత్రుత కరోనా రక్కసిని లక్ష్య పెట్టలేదు. ఆకలి కరోనాను అధిగమించింది. విధాన కర్తలకు ముందు చూపు, ప్రతిస్పందన లేవు. ప్రతిపక్షాలు కరోనా అంశం పార్లమెంటులో ఎత్తలేదు. వలస కార్మికుల ఊర్ల ప్రయాణంతో కరోనా వ్యాప్తి అవకాశాలు పెరిగాయి.

రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వలసకార్మికులకు కరోనా సులభంగా అంటుకుంటుంది. వీళ్ళు నోళ్లలో నోర్లు పెట్టి కుక్కిన బసుల్లో గ్రామాలు చేరుతున్నారు. కొందరు నడిచి చేరారు. మన గ్రామీణ ఆరోగ్య సౌకర్యాలు అరకొరలు. 75% నకిలీ వైద్యులు. 70% ఆరోగ్య సంరక్షణ ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బుల సంచులతో జరుగుతుంది. వలస కార్మికులను ఎక్కడి వాళ్ళను అక్కడ ఖాళీ అయిన స్కూళ్ళ, కాలేజీల భవనాల్లో ఉంచా లి. వైద్య పరీక్షలు చేయాలి. ఏకాంతవాసంలో ఉంచాలి. స్వగ్రామాలకు వచ్చినవారికి కూడా వైద్య పరీక్షలు, ఏకాంతవాసం తప్పనిసరి. వారి సౌకర్యాలు కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు చూడాలి. వీరిని గాలికి వదిలేసిన గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలి.

కార్మికులకు వారి స్వస్థలాల్లో ఉపాధి కల్పించకపోటం ప్రభుత్వాల వైఫల్యం. కార్మిక చట్టాల నిర్లక్ష్యానికి ప్రభుత్వాలదే బాధ్యత. ఇందులో కేంద్ర వైఫల్యం అధికం. ఇది 2016 పెద్ద నోట్ల ప్రవేశంతో సమానం. వస్తు సేవల పన్నులు రుద్దటంలోనూ ఇదే పద్ధతి. ఇందిర పాలనలో ప్రజాస్వామ్యం రాజ్యాంగ ఆసరాతో పతనమైంది. నేడు రాజ్యమే కుచించుకుపోయింది. 2014 మోడీ ఆదర్శ నినాదం ‘కనిష్ట ప్రభుత్వం గరిష్ఠ పాలన’ అమలైంది. దేశబందీ ఉపన్యాసంలో ప్రధాని సమాజ స్వయంరక్షణ ప్రబోధించారు. ధనికులు పేదలను సంరక్షించాలన్నారు. ఒక్కొక్క సంపన్న కుటుంబం 9 పేద కుటుంబాల బాధ్యత తీసుకోవాలన్నారు. సంఘ్ సంప్రదాయం ఇదే.

1950ల్లో నెహ్రూ ప్రభుత్వ ఆస్పత్రులు నిర్మించారు. సంఘ్ సిద్ధాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ దీనికి విరుద్ధంగా పోరాడారు. సేవాభారతితో సహా సంఘ్ పరివార్ సంస్థల సాంఘిక సంక్షేమ రాజ్య దృష్టికోణం ఇదే. ధార్మిక సంస్థలు సంక్షేమ రాజ్యాన్ని పాక్షికంగా నిరర్థకం చేయగలవని వాటి ఊహ. సమాజం స్వయం నియంత్రణతో స్వయం సంరక్షణ చేసుకోవాలని సంఘ్ నమ్మకం. ఈ ఆలోచనా రూపమే జనతా కర్ఫ్యూ. ఇది సొంత పోలీసు విధానాన్ని, చట్టాన్ని చేతిలోకి తీసుకోవటాన్ని ప్రోత్సహిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో సిఎఎ నిరసనకారుల ఆస్తి జప్తు, గో సంరక్షక ఆగడాలు ఈ కోవలోనివే. ఇవి గిట్టనివారి ఆస్తుల ఆక్రమణకు, కబేళాల ధ్వంసానికి, పర మతస్థుల హత్యలకు దారి తీస్తాయి. దేశబందీ అమలుకు పాటుపడతాయి. ఉద్ధృత ప్రపంచీకరణలో విద్య, వైద్యరంగాలను మరింత నిర్వీర్యం చేశారు. ఫలితంగా ప్రజలు కార్పొరేట్ విద్యవైద్యాలు మేలనే స్థాయికి దిగారు. ప్రైవేటు ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అవి సామాన్యులు భరించలేనంత ఖరీదైనవి.

అధిక ద్రవ్యలోటుతో ఆర్థిక అవరోధాలు పెరిగాయి. అప్పుల స్థూల జాతీయోత్పత్తి నిష్పత్తి 69%కి పెరిగింది. ప్రజా సంక్షేమం తగ్గింది. 1.7 లక్షల కోట్ల దేశబందీ పేదల సాయంలో కొత్తగా ఇచ్చింది 56 కోట్లే. ఈ సాయం పరిధిలో వలస కార్మికులు లేరు. కరోనా కారణంతో వీళ్ళను నిర్వాసితులను చేశారు. ఆర్థికంగా, సామాజికంగా చిదిమేశారు. రాజ్యం మీద, వీరిని దోచుకున్న ప్రైవేటు సంస్థల మీద వీరి బాధ్యత ఉంది. ఒక మెజారిటీ సమాజం భయభ్రాంతులతో సంఘీయాన్ని సమర్థిస్తోంది. ఈ 40 కోట్ల వలస కార్మికుల ఆకలి మరో మెజారిటీ ఆకలితో కలిసి పాలక నాటకాలను నిరోధిస్తుందని ఆశిద్దాం. దేశం ఏకఛత్రత్వం నుండి విముక్తి పొందాలి.

 

Kovid 19 not, hunger 20
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News