Saturday, April 27, 2024

లాక్‌డౌన్‌లో నిత్యావసరాల ధరలు

- Advertisement -
- Advertisement -

Essential Prices on Lockdown

 

రేపు ఏమవుతుందో, ఎలా ఉంటుందో తెలియని భయోత్పాత వాతావరణంలో ప్రజల ముందస్తు జాగరూకత పరాకాష్ఠకు చేరుకుంటుంది. వేగంగా పుంజుకున్న నగరీకరణ, మధ్య తరగతి అసాధారణ పెరుగుదల నేపథ్యంలో ఇది మరింతగా రుజువవుతుంది. కరోనా లాక్‌డౌన్ నిత్యావసర సరకుల కొనుగోలును అమితంగా ప్రభావితం చేసిన తీరే ఇందుకు నిదర్శనం. లాక్‌డౌన్ ప్రకటించగానే దేశ వ్యాప్తంగా గల ప్రధానమైన నగరాల్లో పట్టణాల్లోని దుకాణాలు, మాల్స్ దాదాపు ఖాళీ అయిపోయాయి. అమెరికాలో మాదిరిగానే ఇక్కడ కూడా ఆహార సరకులు, శానిటైజర్లు, మాస్కులు వంటి వాటిని జనం అవసరానికి అనేక రెట్లు మించిపోయి కొనుగోలు చేసి దాచుకున్నారు. షాపులన్నీ మూతపడితే ఏమైపోతాం అనే భయం సంపన్న, మధ్యతరగతి వినియోగాదారులను పరుగులు పెట్టించింది. ఇప్పుడు రవా ణా బంద్ అయిపోయి వాహనాలు గమ్యాలకు చేరుకోడం అరుదయిపోడానికి అమ్మకం దార్ల అత్యాశ తోడై కూరగాయలు, ఉల్లిపాయల వద్ద నుంచి పలు సరకుల ధరలు మిన్నంటిపోతున్నాయి.

నిన్నటి వరకు సాధారణ ధరలకు దొరికినవే ఇప్పుడు కొండెక్కి కూచుంటున్నాయి. ఇటీవల కొన్ని మాసాల పాటు అసాధారణంగా ధర పెరిగిపోయి ఏడిపించిన ఉల్లి ఈ మధ్యలో దిగివచ్చిందనిపించి ఇప్పుడు మళ్లీ ప్రియమైపోయింది. రవాణా సదుపాయం దెబ్బ తిని సరఫరా గొలుసు తెగిపోడం సహజంగానే సరకుల కొరతను సృష్టించి డిమాండ్‌ను పెంచుతుంది. దానికి దళారుల దోపిడీ తోడయితే ఇక చెప్పేదేముంటుంది? హైదరాబాద్ నగరంలోని రైతు బజార్లు సహా అన్ని మార్కెట్‌లలో కూరగాయల ధరలు అకస్మాత్తుగా రెండు మూడింతలు పెరిగిపోడం పట్ల వినియోగదార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆకుకూరల ధరలు కూడా పెరిగిపోయాయనే ఆందోళన వ్యక్తమ యింది. లాక్‌డౌన్‌కు ముందు మామూలుగా ఉన్న ధరలు అది ప్రకటించడంతోనే మండిపోడం వెనుక మర్మమేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆదిలాబాద్, సంగారెడ్డి వంటి జిల్లాల కలెక్టర్లు కూరగాయల యజమానులతో మాట్లాడారు.

ధరలను కృత్రిమంగా పెంచితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. పౌర సరఫరాలు, వ్యవసాయ, ఉద్యాన వన, మార్కెటింగ్ శాఖల అధికారులతో ఈ విషయమై ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేసింది. ధరలను కృత్రిమంగా పెంచితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దానితో కొంత మార్పు వచ్చింది. లాక్‌డౌన్ ఉపయోగించుకుని ధరలను పెంచేయడం ప్రజల అవసరాన్ని అతి నీచంగా సొమ్ము చేసుకోడం కంటే దారుణం మరొకటి ఉండదు. కోల్‌కతా, ముంబై, చెన్నై వంటి నగరాల్లో కూడా కూరగాయల ధరలు 30 నుంచి 50 శాతం పెరిగినట్లు సమాచారం. పండ్ల ధరలు కూడా చెట్టెక్కాయి. కోల్‌కతాలో బెండకాయల ధర ఉన్నట్లుండి కిలో రూ. 30 నుంచి రూ 40కి పెరిగిపోయింది. ముంబైలో క్యాబేజీ కిలో రూ. 80, కాలీఫ్లవర్ రూ. 120కి అమ్ముతున్నాయి.

ముంబైలో టమాటో ధర కూడా 70 శాతం పెరిగిపోయింది. లాక్‌డౌన్ వ్యవధి పెరిగే కొద్దీ ఈ ధరలు మరింతగా విజృంభించే ప్రమాదమున్నది. లాక్‌డౌన్ ప్రభావంతో నగరాల్లో ఆన్‌లైన్ కొనుగోళ్లు కూడా పెరిగిపోయాయని సమాచారం. వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్య భద్రతకు సంబంధించిన వస్తువుల విక్రయాలు ఉన్నపళంగా 200 శాతం హైజంప్ చేశాయట. శానిటైజర్లు, మాస్కులతోపాటు, ఆహార సరకులు సబ్బులు వంటి వాటి ఆన్‌లైన్ కొనుగోళ్లు 100 శాతం పెరిగాయి. కరోనా ప్రభావం మాంసాహార వ్యాపారంపైనా తీవ్రంగా ఉన్నది. పౌల్ట్రీ ఘోరంగా దెబ్బ తినగా, మేక మాంసం ధర కిలో రూ. 800నుంచి రూ. 1200లకు కూడా ఎగబాకినట్టు వార్తలు చెబుతున్నాయి. కోడి మాంసం తినడం వల్ల కరోనా వ్యాపిస్తుందనే అసత్య ప్రచారం ముమ్మరం కావడంతో దాని విక్రయాలు దారుణంగా పడిపోయి పరిశ్రమ రోజుకి రూ. 1500 నుంచి రూ. 2 వేల కోట్ల వరకు నష్టపోయిన సందర్భాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.

కోడిని హాయిగా తినండి మేమూ తింటున్నాం అని మన ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ వంటి వారు భరోసా పలకడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇటువంటి అత్యవసర పరిస్థితులలోనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండి నికరాదాయ వర్గాల ఇంటి బడ్జెట్ రైలు పట్టాలు తప్పకుండా కాపాడవలసి ఉంది. సరఫరా వ్యవస్థను దెబ్బ తినకుండా ప్రజలకు అత్యవసరమైన సరకులు అందుబాటులో ఉండేటట్టు చూడవలసి ఉంటుంది. ఆ వైపుగా పాలకులు మరింతగా దృష్టి సారించాలి. లాక్‌డౌన్‌లు, కర్ఫూలలో ప్రజలు నిశ్చింతగా బతకడానికి అది తోడ్పడుతుంది.

 

Essential Prices on Lockdown
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News